
చల్‌గల్‌లో మామిడి కొనుగోళ్లు ప్రారంభం
జగిత్యాలఅగ్రికల్చర్: జగిత్యాల రూరల్ మండలంలోని చల్‌గల్ మామిడి మార్కెట్‌లో కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. వ్యాపారుల్లో కొందరు బహిరంగ వేలం ద్వారా.. మరికొందరు కమీషన్ ప్రతిపాదికన కొనుగోలు చేస్తున్నారు. మార్కెట్ నిబంధనల ప్రకారం ప్రతి వ్యాపారి బహిరంగ వేలం ద్వారా కొనుగోలు చేయాలని మార్కెట్ అధికారులు చెపుతున్నప్పటికీ కొందరు వ్యాపారులు పట్టించుకోవడం లేదు. ఇటీవల మాజీమంత్రి జీవన్ రెడ్డితోపాటు రైతు సంఘం నాయకులు, మామిడి మార్కెట్‌లో బహిరంగ వేలం ద్వారా కొనుగోలు చేయాలని కలెక్టర్ సత్యప్రసాద్‌కు వినతిపత్రం అందించారు. మార్కెట్ ప్రారంభమైనా విధివిధానాలు నిర్ణయించకపోవడంతో రైతులు, వ్యాపారులు ఆందోళనకు గురవుతున్నారు. రైతుల నుంచి వ్యాపారులు ఏమైనా కటింగ్‌లు చేస్తారా..? మార్కెట్ కమిటీకి వ్యాపారులు ఏ మేరకు మార్కెట్ ఫీజు చెల్లిస్తారు..? వంటి విషయాలు ఎవరికీ అర్థం కాని పరిస్థితి ఏర్పడింది.
బంగినపల్లికి కిలో రూ.35 నుంచి రూ.46
చల్‌గల్ మార్కెట్‌లో బంగినపల్లి మామిడికి కిలో రూ.35 నుంచి రూ.46 వరకు పలుకుతోంది. దశేరికి రూ.65 నుంచి రూ.70, హిమాయత్ రకానికి రూ.70 నుంచి రూ.80 వరకు పలుకుతోంది. చల్‌గల్ మార్కెట్‌కు 30 నుంచి 35 టన్నుల మామిడికాయలు వచ్చినట్లు వ్యాపారులు చెబుతున్నారు.