
విద్య, వైద్యానికి ప్రాధాన్యం ఇచ్చాం
కరీంనగర్‌రూరల్: బీఆర్‌ఎస్ హయాంలో విద్య, వైద్యరంగానికి మొదటి ప్రాధాన్యం ఇచ్చినట్లు బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ పేర్కొన్నారు. బొమ్మకల్‌లోని చల్మెడ ఆనందరావు మెడికల్ కళాశాలలో శనివారం 2019 సంవత్సరం ఎంబీబీఎస్ బ్యాచ్ విద్యార్ధుల స్నాతకోత్సవ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో ప్రతీ జిల్లాకు ప్రభుత్వ మెడికల్ కళాశాల, నర్సింగ్ కళాశాలలను మంజూరు చేసినట్లు తెలిపారు. తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చుతూ వైద్యులుగా మారుతున్న విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. రాబోయే రోజుల్లో వైద్యులకు ఏఐ చాలెంజ్‌గా మారుతుందని తెలిపారు. కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ చల్మెడ మెడికల్ కళాశాల హైదరాబాద్ కళాశాలలకు దీటుగా వైద్యవిద్యను నేర్పిస్తుండటంతో తన కూతురును చేర్పించినట్లు తెలిపారు. కళాశాల చైర్మెన్ లక్ష్మినర్సింహరావు మాట్లాడుతూ..తెలంగాణలో ఏ మెడికల్ కళాశాలలో లేని సిమ్యులేషన్ ల్యాబ్‌ను చల్మెడ వైద్య విద్యార్ధులకు అందుబాటులోకి తీసుకరావడం జరిగిందన్నారు.అనంతరం 124మంది ఎంబీబీఎస్ విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేశారు. కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్, కళాశాల డైరెక్టర్ సూర్యనారాయణరెడ్డి, ప్రిన్సిపాల్ ఆసీంఅలీ, వైస్ ప్రిన్సిపాల్ అనిత, సూపరింటెండెంట్ రామకృష్ణప్రసాద్ పాల్గొన్నారు.
సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్
చల్మెడ మెడికల్ కళాశాలలో స్నాతకోత్సవం