
తండ్రి వచ్చేలోపే.. తనువు చాలించింది
దండేపల్లి: అదనపు కట్నం వేధింపులు ఓ వివాహితను బలి తీసుకున్నాయి. పెళ్లయి ఎనిమిదేళ్లయినా అత్తింటివారి వేధింపులు ఆగలేదు. నాలుగేళ్లపాటు భర్త, అత్తామామ, బావ, మరిది వేధింపులు తట్టుకుంది. ఆర్నెళ్ల క్రితం ఆడపిల్ల పుట్టడంతో మరింత ఎక్కువయ్యాయి. పెద్దమనుషుల సమక్షంలో పంచాయితీ అయినా తీరు మారలేదు. చివరకు ఆ వివాహిత చావే శరణ్యనుకుంది. ఉరేసుకుని తనువు చాలించింది. ఫలితంగా ఆమె కుమారుడు (6), కూతురు (ఆర్నెళ్లు) తల్లిలేనివారయ్యారు. ఈ ఘటన మంచిర్యాల జిల్లా దండేపల్లిలో ఆదివారం చోటుచేసుకుంది. ఎస్సై తహాసీనొద్దీన్ కథనం ప్రకారం.. దండేపల్లికి చెందిన గంగధరి మల్లేశ్‌కు, బుగ్గారం మండలం యశ్వంత్‌రావుపేటకు చెందిన వరలక్ష్మి అలియాస్ మేఘనతో 2017లో వివాహమైంది. పెళ్లి సమయంలో రూ.4 లక్షల కట్నం, 4 తులాల బంగారం, ఇతర సామగ్రి ఇచ్చారు. నాలుగేళ్లపాటు వీరి కాపురం బాగానే సాగింది. కూలీ పనులకు వెళ్లే మల్లేశ్‌కు అదనపు కట్నంపై ఆశపుట్టింది. అప్పటి నుంచి భార్యను వేధిస్తున్నాడు. దీనికి మల్లేశ్ తల్లిదండ్రులు లక్ష్మి, నర్సయ్య, సోదరులు తోడయ్యారు. కుటుంబమంతా వేధించడంతో మేఘన భరించలేకపోయింది. విషయాన్ని పుట్టింటివారికి చెప్పడంతో ఏడాది క్రితం పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టారు. నచ్చజెప్పి మళ్లీ కాపురానికి పంపించారు.
ఆరు నెలల క్రితం పాప జననం..
ఆర్నెళ్ల క్రితం మేఘన పాపకు జన్మనిచ్చింది. అప్పటినుంచి కట్నం వేధింపులు మొదలయ్యాయి. భీవండిలో ఉండే తన తండ్రి రాజమల్లుకు 10 రోజుల క్రితం ఫోన్ చేసి చెప్పింది. త్వరలోనే యశ్వంత్‌రావ్‌పేటకు వస్తానని, వచ్చాక పుట్టింటికి తీసుకొస్తానని నచ్చజెప్పాడు. శనివారం స్వగ్రామానికి వచ్చిన రాజమల్లు ఆదివారం భార్య అమ్మాయితో కలిసి దండేపల్లిలోని కూతురు ఇంటికి వెళ్లాడు. అక్కడ కూతురు కనిపించకపోవడంతో లోపలికి వెళ్లి చూడగా చీరతో ఉరేసుకుని కనిపించింది. కన్నబిడ్డను విగతజీవిగా చూసిన తల్లిదండ్రులో బోరున విలపించారు. పుట్టింటికి తీసుకుపోతానంటిని కదా బిడ్డా.. అంతలోనే ఇలా అయ్యిందా అంటూ తండ్రి విలపించిన తీరు అందరినీ కన్నీరు పెట్టించింది. స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. తన కూతురు మృతికి అల్లుడు, అతని తల్లిదండ్రులు, అన్న, తమ్ముడే కారణమని రాజమల్లు ఫిర్యాదు చేశారు. ఈమేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెల్లడించారు.
తల్లి ప్రేమకు దూరమైన చిన్నారులు..
వరలక్ష్మి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకోవడంతో ఆమె కుమారుడు శ్రీనాథ్, కూతురు శరణ్య తల్లిప్రేమకు దూరమయ్యారు. తల్లి ఏమైందో కూడా ఆ చిన్నారులకు తెలియడం లేదు. కనీసం ఆ తల్లికి ఆత్మహత్య చేసుకునే ముందు తన పిల్లలైన గుర్తుకు రాలేదా అని పలువురు విచారం వ్యక్తం చేస్తున్నారు.
అత్తింటి వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య
పలుమార్లు పెద్దల పంచాయితీ
అయినా తీరు మారకపోవడంతో బలవన్మరణం
దండేపల్లిలో ఘటన.. కేసు నమోదు
మృతిరాలిది బుగ్గారం మండలం యశ్వంత్‌రావుపేట

తండ్రి వచ్చేలోపే.. తనువు చాలించింది