
పోలీస్ ఇన్‌ఫార్మర్‌గా వ్యవహరిస్తున్నాడని..
వేములవాడ: తమతో కలిసి గంజాయి వ్యాపారం చేస్తూనే తమ పేర్లను పోలీసులకు చెప్పి, జైలుకు పంపించి.. తాను కుటుంబ సభ్యులతో ఎంజాయ్‌గా ఉంటున్నాడని, పోలీసు ఇన్‌ఫార్మర్‌గా వ్యవహరిస్తున్నాడని భావించి చెట్టిపల్లి పర్శరాములు (36)ను ఈనెల 13న వేములవాడ పట్టణ బైపాస్‌రోడ్డులోని మహాలింగేశ్వర ఫంక్షన్‌హాలులో గొడ్డళ్లు, కత్తులతో నరికి చంపేశారు. మంగళవారం టౌన్ పోలీస్‌స్టేషన్ ఆవరణలో ఏఎస్పీ శేషాద్రినిరెడ్డి వివరాలు వెల్లడించారు. పట్టణంలోని శ్రీనగర్‌కాలనీకి చెందిన చెట్టిపెల్లి పరుశరాములు, బైరెడ్డి వినయ్, ఈర్ల సాయి, వస్తాద్ అఖిల్, నేదురి రాజేశ్, అడ్డగట్ల మనోజ్ గతంలో కలిసి తిరిగేవారు. వీరందరు గంజాయి, హత్య కేసులతో చాలాసార్లు జైలుకు వెళ్లి వచ్చారు. ఈక్రమంలో కొంతకాలంగా పర్శరాములు మిగతా ఐదుగురితో ఉండకుండా తన పని తాను చేసుకుంటూ ఇంటి వద్ద ఉంటున్నాడు. కొద్ది రోజుల క్రితం ఐదుగురు నిందితులపై వివిధ పోలీస్ స్టేషన్లలో గంజాయి కేసులు నమోదు కాగా, కేసులు కావడానికి పర్శరాములే కారణమని భావించారు. తమపై పోలీసులకు సమాచారం ఇస్తున్నాడని అనుమానించారు. అతడిని చంపితేనే తమపై గంజాయి కేసులు కావని, ఈజీగా తమ వ్యాపారం చేసుకోవచ్చని పథకం వేశారు. ఈనెల 13న మహాలింగేశ్వర ఫంక్షన్‌హాల్‌లోని స్టోర్‌రూమ్ బిల్డింగ్‌పై ఒంటరిగా ఉన్న పర్శరాములుపై రెండు గొడ్డళ్లు, కొబ్బరికాయలు కొట్టే కత్తితో బైరెడ్డి వినయ్, ఈర్ల సాయి, వస్తాద్ అఖిల్ విచక్షణారహితంగా దాడి చేసి చంపారు. మరో నిందితుడు రాజేశ్ బయట ఎవరూ రాకుండా గేటు వేశాడు. ఇంకో నిందితుడు అడ్డగట్ల మనోజ్‌కుమార్ వీళ్లందరూ జైలుకెళ్తే బెయిల్ తీసుకురావడానికి బయట ఉంటానని చెప్పి ఈ నలుగురితో హత్య చేయించాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు టౌన్ సీఐ వీరప్రసాద్ కేసు నమోదు చేశారు. మంగళవారం ఉదయం 10 గంటలకు అయ్యోరుపల్లి శివారులో నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. హత్యకు ఉపయోగించిన రెండు గొడ్డళ్లు, ఒక కత్తి, రెండు బైక్‌లు, రెండు సెల్‌ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న మనోజ్‌కుమార్ కోసం గాలిస్తున్నామని ఏఎస్పీ పేర్కొన్నారు. సమావేశంలో రూరల్ సీఐ శ్రీనివాస్, ఎస్సైలు రమేశ్, వెంకట్రాజం, సిబ్బంది ఉన్నారు.
వ్యక్తిని చంపిన నిందితుల అరెస్ట్
వివరాలు వెల్లడించిన ఏఎస్పీ శేషాద్రినిరెడ్డి