ధాన్యం కుప్ప వద్ద కుప్పకూలిన రైతు | - | Sakshi
Sakshi News home page

ధాన్యం కుప్ప వద్ద కుప్పకూలిన రైతు

Apr 16 2025 11:20 AM | Updated on Apr 16 2025 11:20 AM

ధాన్య

ధాన్యం కుప్ప వద్ద కుప్పకూలిన రైతు

కథలాపూర్‌(వేములవాడ): మండలంలోని దూలూర్‌ గ్రామానికి చెందిన రైతు పూండ్ర జలపతిరెడ్డి (50) కొనుగోలు కేంద్రం వద్ద తన ధాన్యం కుప్ప వద్ద గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. జలపతిరెడ్డి గ్రామ శివారులోని కొనుగోలు కేంద్రంలో ధాన్యం పోశాడు. ధాన్యాన్ని ఆరబెట్టేందుకు మంగళవారం ఉదయం వెళ్లాడు. ధాన్యాన్ని ఆరబోస్తుండగానే కింద పడిపోయాడు. అక్కడున్న రైతులు గమనించి గుండెపోటు వచ్చిందని సీపీఆర్‌ చేశారు. వెంటనే చికిత్స నిమిత్తం కథలాపూర్‌లోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలిస్తుండగానే మృతిచెందాడు. జలపతిరెడ్డికి భార్య లక్ష్మి, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.

స్వగ్రామానికి మృతదేహం

ఇల్లంతకుంట(మానకొండూర్‌): ఉపాధి కోసం గల్ఫ్‌ వెళ్లి ఆత్మహత్య చేసుకున్న కార్మికుడి మృతదేహం 34 రోజులకు స్వగ్రామానికి చేరింది. గ్రామస్తులు తెలిపిన వివరాలు.. ఇల్లంతకుంట మండలం నర్సక్కపేట గ్రామానికి చెందిన ముత్యం వెంకటేశంగౌడ్‌ (52) గత 32 ఏళ్లుగా ఉపాధి కోసం గల్ఫ్‌ వెళ్తున్నాడు. ఇటీవల ఇంటికి వచ్చి ఫిబ్రవరిలో తిరిగి గల్ఫ్‌ వెళ్లాడు. అనంతరం తన కొడుకును అక్కడి కంపెనీలోకి పనికి తీసుకున్నాడు. కొడుకు వెళ్లిన పక్షం రోజులకే వెంకటేశం తన గదిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మంగళవారం నర్సక్కపేటకు మతదేహాన్ని తీసుకొచ్చారు. మృతుడికి భార్య పద్మ, కొడుకు సాయికిరణ్‌, కూతురు ఉన్నారు.

బైక్‌ను ఢీకొన్న లారీ

ఒకరి మృతి, మరొకరికి తీవ్ర గాయాలు

కామారెడ్డి క్రైం: అతివేగంతో లారీ ఎదురుగా వస్తున్న బైక్‌ను ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. కామారెడ్డి జిల్లా కేంద్రానికి సమీపంలోని ఉగ్రవాయి మైసమ్మ స్టేజీ వద్ద కామారెడ్డి–సిరిసిల్లా ప్రధాన రహదారిపై మంగళవారం చోటు చేసుకుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నాగంపేట గ్రామానికి చెందిన నాగుల వినోద్‌ కుమార్‌ (30) చేపలు పట్టడం, కూలీ పనులు చేసుకుంటూ జీవించేవాడు. చేపల పని మీద తన స్నేహితుడు జక్కుల దేవేందర్‌తో కలిసి బైక్‌పై కామారెడ్డికి బయల్దేరారు. ఉగ్రవాయి మైసమ్మ స్టేజీ సమీపంలోకి రాగానే బైక్‌ను లారీ ఢీకొనగా ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. వారిని వెంటనే కామారెడ్డిలోని ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రికి తరలించారు. కొద్దిసేపటికే చికిత్స పొందుతూ వినోద్‌ కుమార్‌ మృతి చెందాడు. దేవేందర్‌ను మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌ తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు దేవునిపల్లి ఎస్సై రాజు తెలిపారు.

పింఛన్‌ ఇప్పిస్తానని..

వృద్ధురాలి బంగారం దోచుకెళ్లాడు

జమ్మికుంట: పింఛన్‌ ఇప్పిస్తానని, ఫొటో తీయాలని మాయమాటలు చెప్పి గుర్తు తెలియని వ్యక్తి వృద్ధురాలి మెడలోంచి రెండు తులాల బంగారం ఎత్తుకెళ్లాడు. ఈ ఘటన జమ్మికుంటలో మంగళవారం చోటు చేసుకుంది. టౌన్‌ సీఐ వివరాల ప్రకారం.. వీణవంక మండలం కనపర్తి గ్రామానికి చెందిన అల్ల పురెడ్డి కమలమ్మ భర్త కొమరరెడ్డితో కలిసి జమ్మికుంటలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి చికిత్స కోసం వచ్చింది. అనంతరం కూరగాయలు కొనుగోలు చేసేందుకు కొండూరు కాంప్లెక్స్‌ అంగడికి వెళ్లింది. అక్కడ ఓ షాపు వద్ద మెట్లపై కూర్చుంది. గుర్తు తెలియని వ్యక్తి వృద్ధురాలి వద్దకు వచ్చి ‘నేను గ్రామానికి కార్యదర్శిని. మీ ఇద్దరికి పింఛన్‌ ఇప్పిస్తాను. మిమ్మల్ని ఫొటో తీయాలి’ అని నమ్మించాడు. ఫొటో తీసే సమయంలో ఒంటిపై బంగారం ఉండొద్దని, రెండు తులాల బంగారు పుస్తెలతాడు తీసుకున్నాడు. మెల్లిగా అక్కడి నుంచి పరారయ్యాడు. కాసేపటికి తేరుకున్న బాధితురాలు బోరున విలపించింది. అనంతరం పోలీసులకు పిర్యాదు చేయగా.. దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు.

ధాన్యం కుప్ప వద్ద   కుప్పకూలిన రైతు1
1/2

ధాన్యం కుప్ప వద్ద కుప్పకూలిన రైతు

ధాన్యం కుప్ప వద్ద   కుప్పకూలిన రైతు2
2/2

ధాన్యం కుప్ప వద్ద కుప్పకూలిన రైతు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement