
● కలెక్టర్ పమేలా సత్పతి
హుజూరాబాద్ : ఽసన్నాలు, దొడ్డు రకం ధాన్యం కొనుగోళ్ల రికార్డులు పకడ్బందీగా ఉండాలని, కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించాలని కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు. తుమ్మన్నపల్లిలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని బుధవారం ఆమె సందర్శించారు. తూకంలో కోతలు లేకుండా చూడాలన్నారు. దాన్యం తడవకుండా టార్పాలిన్ కవర్లు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. 48 గంటల్లోగా ధాన్యం వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలన్నారు. కేంద్రాల వద్ద మెడికల్ క్యాంపు ఏర్పాటు చేసి కొనుగోలు కేంద్రాలకు వచ్చే మహిళలు,ఉపాధి కూలీల కు ‘ఆరోగ్య మహిళ’ పరీక్షలు నిర్వహించాలన్నారు.
పౌష్టికాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం
గర్భిణులు, బాలింతలు, చిన్నారులు పౌష్టికాహారం తీసుకోవాలని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాలలో పోషణ్ పక్షోత్సవాల్లో భాగంగా అంగన్‌వాడీ కేంద్రాల్లో పూర్వ ప్రాథమిక విద్యను పూర్తి చేస్తున్న విద్యార్థులకు సర్టిఫికెట్లు అందించారు. అనంతరం గర్భిణులకు సీమంతం నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయాన్ని సందర్శించి చెత్త సేకరణ విధానం గురించి కమిషనర్ సమ్మయ్య అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ వెంట అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, తహసీల్దార్ కనకయ్య, ఎంపీడీవో సునీత, ఏఈవో సౌమ్య ఉన్నారు.