
చలో ఎల్కతుర్తి
● బీఆర్‌ఎస్ రజతోత్సవానికి గులాబీదండు రెడీ ● లక్ష మందిని తరలించేందుకు ఏర్పాట్లు పూర్తి ● వందలాది బస్సుల్లో పంపేందుకు సిద్ధం
సాక్షిప్రతినిధి,కరీంనగర్:
బీఆర్‌ఎస్ పార్టీ 25వ వార్షికోత్సవం సందర్భంగా ఎల్కతుర్తిలో నిర్వహించ తలపెట్టిన రజో త్సవ సభకు జనసమీకరణ దాదాపుగా పూర్తయింది. సమీకరించిన జనాలు, కార్యకర్తలతో బీఆర్‌ఎస్ నాయకులు ఆదివారం ఉదయమే తరలేలా వందలాదిగా ఆర్టీసీ, ప్రైవేటు, స్కూల్ బస్సులను అందుబాటులో ఉంచారు. ఇవి కాకుండా పార్టీకి చెందిన నాయకుల కార్లను కూడా సిద్ధం చేశారు. కరీంనగర్ నుంచి 15 వేలు, చొప్పదండి, మానకొండూరు నియోజకవర్గాల నుంచి 10వేల మంది చొప్పున జనసమీకరణ జరిగిందని పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు వెల్లడించారు. హుస్నాబాద్, హుజూరాబాద్ నుంచి లక్ష మందిని తరలిస్తున్నామన్నారు. కరీంనగర్‌లో ప్రతీ డివిజన్ నుంచి 3 బస్సులు బయల్దేరనున్నాయి. ఈ మేరకు బస్సులు, పోస్ట ర్లు, బ్యానర్లు, సిద్ధమయ్యాయి. మధ్యాహ్నం 12.30 గంటల తరువాత బస్సులు నియోజకవర్గాల నుంచి బయల్దేరనున్నాయి. ప్రతీ బస్సుకు కో– ఆర్డినేటర్లు ఉంటారు. వీరే బస్సులో వస్తున్న నాయకులకు ఆహారం, నీరు, ఇతర అవసరాలు, పార్కింగ్ తదితర విషయాల్లో మార్గనిర్దేశనం చేయనున్నారు.
నాడు.. నేడు ఉమ్మడి జిల్లానే
2001 ఏప్రిల్ 27వ తేదీన కరీంనగర్‌లో సింహగర్జన పేరిట నిర్వహించిన సభ ద్వారా తెలంగాణ రాష్ట్ర సమితి ప్రత్యేక తెలంగాణ ఆకాంక్షను చాటింది. ఆ తరువాత 2004లో కాంగ్రెస్‌తో సంకీర్ణంలో చేరింది. 2009 నుంచి మలిదశ పోరాటం ఉధృతం చేసింది. 2014లో రాష్ట్రం సిద్ధించింది. 2014, 2018లో రెండుసార్లు అధికారంలోకి వచ్చింది. 2023 నుంచి తిరిగి ప్రతిపక్ష పాత్ర పోషిస్తోంది. అధినేత కేసీఆర్ కాళేశ్వరం, రైతుబంధు, దళితబందు వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులకు ఉమ్మడి జిల్లాలోనే శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం 25 ఏళ్ల రజతోత్సవ సభ జరుగుతున్న ఎల్కతుర్తి కూడా 2016 వరకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అంతర్భాగం కావడం గమనార్హం. నాడు తొలి ఆవిర్భావ సభ, ఇప్పుడు 25వ ఆవిర్భావ సభలు రెండూ ఉమ్మడి జిల్లాలోనే జరుగుతుండటం విశేషం.