
ప్రమాదవశాత్తు చెరువులో పడి ఒకరి మృతి
కొత్తపల్లి(కరీంనగర్): కొత్తపల్లి పట్టణంలోని చెరువులో ప్రమాదవశాత్తు ఒకరు పడి మృతిచెందారు. కొత్తపల్లి ఏఎస్సై బి.రాంమూర్తి వివరాల ప్రకారం.. కొత్తపల్లి పట్టణానికి చెందిన గుండ శ్రీధర్(41) పని లేక తాగుడుకు బానిసై మానసిక స్థితి బాగా లేక అనారోగ్య సమస్యలతో బాధపడుతుండేవాడు. కోహెడ మండలం తంగళ్లపల్లి గ్రామానికి చెందిన రాధతో వివాహం జరగగా.. వారికి 11 ఏళ్ల కుమారుడున్నాడు. శ్రీధర్ తాగుడుకు బానిసై తరచూ భార్యను ఇబ్బంది పెట్టడంతో.. కొడుకుతో కలిసి మూడేళ్లుగా తల్లిగారింటి వద్ద ఉంటోంది. కొత్తపల్లిలోని తన ఇంటి నుంచి శుక్రవారం సాయంత్రం బయలుదేరిన శ్రీధర్.. శనివారం కొత్తపల్లి చెరువులో శవమై తేలాడు. కాలకృత్యాలు తీర్చుకునేందుకు చెరువు వద్దకెళ్లి ప్రమాదవశాత్తు అందులో పడి ఊపిరాడక చనిపోయినట్లు భావిస్తున్నట్లు రాధ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై పేర్కొన్నారు.
కాంక్రీట్ మిల్లర్ కింద పడి వ్యక్తి..
జగిత్యాలక్రైం జగిత్యాల రూరల్‌మండలం నర్సింగాపూర్ గ్రామంలో సీసీ రోడ్డు నిర్మాణ పనులు చేస్తుండగా జలగం ఎల్లయ్య (33) అనే వ్యక్తి మిల్లర్ కింద పడి అక్కడికక్కడే మృతిచెందాడు. జనగామ జిల్లా దర్దెపల్లి గ్రామానికి చెందిన జలగం ఎల్లయ్య జగిత్యాల రూరల్ మండలం నర్సింగాపూర్ గ్రామంలో సీసీరోడ్డు నిర్మాణ పనులకు వచ్చాడు. మిల్లర్ వాహనం డ్రైవర్ వొల్లపు రాములు అజాగ్రత్తగా నడపడంతో ఎల్లయ్యపై టైరు ఎక్కి తలకు బలమైన గాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. నర్సింగాపూర్ చెందిన గడ్డం మల్లారెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు రూరల్ ఎస్సై సదాకర్ తెలిపారు.
బావిలో పడి వృద్ధురాలు..
ముస్తాబాద్: మామిడి కాయల కోసం వెళ్లిన వృద్ధురాలు ప్రమాదవశాత్తు బావిలో పడి మృతిచెందింది. పోలీసుల కథనం ప్రకారం.. పోతుగల్‌కు చెందిన మ్యాకల బాల్‌లక్ష్మి(75) మామిడి కాయల కోసం ఇంటి నుంచి వెళ్లింది. గ్రామ శివారులోని బావిలో ప్రమాదవశాత్తు పడిపోయింది. బాల్‌లక్ష్మి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆమె కోసం గాలించారు. బావిలో బాల్‌లక్ష్మి పడ్డట్లు గుర్తించి ఆమెను బయటకు తీశారు. అప్పటికే మృతిచెందింది. మృతురాలికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై గణేశ్ తెలిపారు.
ఇద్దరు బలవన్మరణం
తంగళ్లపల్లి(సిరిసిల్ల): తంగళ్లపల్లి మండలంలో వేరువేరు కారణాలతో ఇద్దరు వ్యక్తులు ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం.. చీర్లవంచ గ్రామానికి చెందిన మ్యాక కొమురయ్య(43) ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య కారణాలతో శుక్రవారం రాత్రి పురుగుల మందు తాగాడు. అంకుషాపూర్ గ్రామానికి చెందిన యువకుడు కాసాని వేణు(26) మూడేళ్లుగా కడుపు నొప్పితో బాధపడుతున్నాడు. గతంలో అపెండిక్స్ కడుపులో బ్లాస్ట్ అవగా.. చికిత్స చేయించారు. పది రోజుల క్రితం మళ్లీ కడుపు నొప్పి రావడంతో భరించలేక పొలం వద్దకెళ్లి పురుగుల మందు తాగాడు. కొమురయ్య భార్య మ్యాక రేణుక, వేణు తల్లి కాసాని ఎల్లవ్వ ఫిర్యాదుల మేరకు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తంగళ్లపల్లి ఎస్సై బి.రామ్మోహన్ తెలిపారు.

ప్రమాదవశాత్తు చెరువులో పడి ఒకరి మృతి