
లక్కేపూర్ శివారులో మహిళ హత్య
మంథని: లక్కేపూర్ గ్రామ శివారులో శనివారం ఓ మహిళ హత్యకు గురైంది. మంథని సీఐ రాజు వివరాల ప్రకారం.. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం పెగడపల్లి గ్రామానికి చెందిన మాసు రమాదేవి(36) అనే వివాహిత శుక్రవారం మధ్యాహ్నం శెట్టిపల్లి గ్రామానికి వెళ్లి వస్తానని చెప్పి ఇంట్లో నుంచి వెళ్లింది. రాత్రి వరకు రమాదేవి ఇంటికి రాలేదు. శనివారం మంథని మండలం లక్కేపూర్ శివారులో గుర్తుతెలియని మహిళ మృతదేహం కన్పించింది. మృతురాలి కుటుంబ సభ్యులు ఫొటో ఆధారంగా రమాదేవిగా గుర్తించారు. మృతురాలి భర్త మాసు సత్యనారాయణ సంఘటనా స్థలానికి చేరుకొని తన భార్యకు పరిచయమున్న లక్కేపూర్ గ్రామానికి చెందిన పండుగు మొగిలిపై అనుమానముందని పోలీసులకు ఫిర్యాదు చేయగా.. హత్య కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.