
నారా భరత్‌రెడ్డికి టికెట్ దక్కిందని తెలియగానే ఆయన అభిమానులు పెద్ద ఎత్తున
సాక్షి,బళ్లారి: నగర, సిరుగుప్ప నియోజకవర్గాల కాంగ్రెస్ టికెట్ల కేటాయింపుపై నెలకొన్న ఉత్కంఠ ఎట్టకేలకు వీడింది. శనివారం ఆ పార్టీ ప్రకటించిన మూడో జాబితాలో జిల్లాకు చెందిన నగర నియోజకవర్గం నుంచి నారా భరత్‌రెడ్డి, సిరుగుప్ప నుంచి మాజీ ఎమ్మెల్యే బీ.ఎం.నాగరాజు పేర్లను ఖరారు చేశారు. మొదటి జాబితాలోనే గ్రామీణ నుంచి నాగేంద్ర, సండూరు నుంచి తుకారాం, కంప్లి నుంచి గణేష్‌ల పేర్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. నగర నియోజకవర్గం నుంచి టికెట్ ఆశిస్తున్న వారు ఎక్కువగా ఉండటంతో పార్టీ హైకమాండ్ దృష్టికి నారా భరత్‌రెడ్డితో పాటు జే.ఎస్.ఆంజనేయులు పేర్లు చేరాయి.
వీరిద్దరిలో ఎవరికి టికెట్ కేటాయించాలన్న దానిపై ఆ పార్టీ నేతలు తీవ్రంగా చర్చలు జరిపి ఎట్టకేలకు మాజీ జెడ్పీ మెంబరు నారా భరత్‌రెడ్డి పేరును ఖరారు చేశారు. సిరుగుప్ప నుంచి కూడా గత ఎన్నికల్లో ఓటమి పాలైన మురళీకృష్ణతో పాటు మాజీ ఎమ్మెల్యే నాగరాజు టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేయగా, చివరికి నాగరాజుకే టికెట్ దక్కింది. నారా భరత్‌రెడ్డికి టికెట్ దక్కిందని తెలియగానే ఆయన అభిమానులు పెద్ద ఎత్తున నగరంలో బాణసంచా కాల్చారు. నగరంలో గాంధీనగర్‌లోని తన తండ్రి, మాజీ ఎమ్మెల్యే నారా సూర్యనారాయణరెడ్డి కార్యాలయం వద్ద కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సందడి నెలకొంది. గత 10 రోజులుగా తీవ్ర ఉత్కంఠతతో ఎదురుచూసిన నారా అభిమానులకు పార్టీ ప్రకటించిన జాబితాలో భరత్‌రెడ్డి పేరు ఉండడంతో హర్షం వ్యక్తం చేశారు.