
బనశంకరి: ఒకవైపు ముఖ్యమంత్రి పదవి కోసం పోటీ సాగుతుండగా, మరోవైపు రాష్ట్ర డీజీపీగా ఉన్న ప్రవీణ్ సూద్‌ను సీబీఐ డైరెక్టర్‌గా కేంద్ర ప్రభుత్వం నియమించడంతో కొత్త డీజీపీ కోసం సీనియర్ ఐపీఎస్‌లలో పరుగు మొదలైంది. సూద్ పదవీకాలం ఇంకా ఏడాది ఉండగా, సీబీఐకి వెళ్లారు. రాష్ట్రానికి నూతన పోలీస్ బాస్ కోసం నలుగురు సీనియర్ ఐపీఎస్‌ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఫైర్ డీజీపీ డాక్టర్ అలోక్ మోహన్, శిక్షణ విభాగం చీఫ్ పీ.రవీంద్రనాథ్, నియామకాల విభాగం డీజీపీ కమల్‌పంత్, నగర పోలీస్ కమిషనర్ సీహెచ్ ప్రతాప్‌రెడ్డి పేర్లు ఇందులో ఎక్కువగా వినబడుతున్నాయి.
సీనియారిటీ ప్రకారమైతే..
ఐదుమంది సీనియర్లలో ఒకరిని ప్రభుత్వం ఎంపిక చేస్తుంది. సీనియారిటీ ఆధారంగా డాక్టర్ అలోక్‌మోహన్, అలాగే కమల్‌పంత్‌లలో ఒకరిని ప్రభుత్వం డీజీపీగా నియమించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పలువివాదాల్లో చిక్కుకున్న రవీంద్రనాథ్‌కు, ఇటీవలే డీజీపీ పదోన్నతి పొందిన సీహెచ్.ప్రతాప్‌రెడ్డి, అలాగే మరో ఐపీఎస్ ప్రశాంత్‌కుమార్ ఠాకూర్‌కు అవకాశాలు స్వల్పమేననే మాట వినిపిస్తోంది.
బిహార్‌కు చెందిన అలోక్‌మోహన్ 1987 బ్యాచ్ ఐపీఎస్. 36 ఏళ్ల నుంచి సర్వీసులో ఉన్నారు. గతంలో జైళ్లు, సీసీబీ జాయింట్ కమిషనర్, ఏసీబీ లలో పనిచేశారు. ఆయనకు 2025 ఏప్రిల్ వరకూ పదవీకాలముంది. తెలుగువారైన రవీంద్రనాథ్ 1990 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. ఇప్పుడు శిక్షణ విభాగం చీఫ్‌గా ఉండగా, ఈ ఏడాది సెప్టెంబరులో రిటైరవుతారు. రేసులో సీనియారిటీ ఆధారంగా అలోక్‌మోహన్ ముందున్నారు.
కొత్త సర్కారుపై బాధ్యత
కమల్‌పంత్ గతంలో నగర పోలీస్ కమిషనర్‌గా ఉండగా ప్రస్తుతం నియామకాల డీజీపీగా ఉన్నారు. ఆయన కూడా ఎంపిక జాబితాలో ఉండవచ్చు. మరోవైపు నగర పోలీస్ కమిషనర్ సీహెచ్, ప్రతాప్‌రెడ్డి కూడా డీజీపీ పోస్టుపై కన్నేశారు. కొత్త ప్రభుత్వం ఏర్పడి, కొత్త సీఎం బాధ్యతలు చేపట్టాక నూతన డీజీపీని ఎంపికచేసే అవకాశముంది.
Comments
Please login to add a commentAdd a comment