
శివాజీనగర: నూతన ముఖ్యమంత్రి ఎంపిక బంతి ప్రస్తుతం హైకమాండ్ ఆవరణలో ఉండటంతో ఎవరిని కరుణిస్తుందోనన్న కుతూహలం ఏర్పడింది. సిద్దరామయ్య, డీకే శివకుమార్ ఇద్దరూ ఢిల్లీకి రావాలని పార్టీ పెద్దలు సూచించారు. సిద్దరామయ్య మధ్యాహ్నమే వెళ్లిపోగా, డీకే శివకుమార్ పుట్టిన రోజు కార్యక్రమాలు, అనారోగ్యం వల్ల హస్తినకు వెళ్లలేదు. సీఎం ఎవరనేది హైకమాండ్ సోమవారం గాని మంగళవారం గానీ ప్రకటించనుంది. సోనియాగాంధీ, రాహుల్ గాంధీలతో ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే చర్చించి ఖరారు చేస్తారు.
బ్యాలెట్ ద్వారా అభిప్రాయాలు
ఆదివారం జరిగిన కాంగ్రెస్ శాసనసభా పార్టీ సమావేశంలో ఏఐసీసీ పరిశీలకులు బ్యాలెట్ ద్వారా ఎమ్మెల్యేల అభిప్రాయాన్ని సేకరించారు. ఇందులో ఎవరికి ఎక్కువ ఓట్లు వచ్చాయనేది ముఖ్యమైన సంగతి కానుంది. ఎమ్మెల్యేల అభిప్రాయం, పరిశీలకుల నివేదిక, సిద్దు, డీకేలతో చర్చించి కాబోయే ముఖ్యమంత్రిని ఫైనల్ చేస్తారు. కాంగ్రెస్‌కు చెందిన పలువురు ఎమ్మెల్యేలు సిద్దరామయ్య, డీకే శివకుమార్ ఇంటికి తరలి సమాలోచనలు జరిపారు. ఇద్దరి ఇళ్లకు ఎమ్మెల్యేలు సోమవారం ఉదయం నుండే నిరంతరం భేటీ చేస్తుండగా, వారి ఇళ్ల వద్ద జాతర సందోహం నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment