
కర్ణాటక: యుక్త వయసులో స్నేహం, ప్రేమ, వంచన లాంటి ఘటనలు సాధారణం. కానీ కాటికి కాళ్లు చాపుకున్న 63 ఏళ్ల మహిళ, 72 ఏళ్ల వృద్ధుడు పెళ్లి పేరుతో మోసగించాడని బెంగళూరు తూర్పు విభాగం మహిళా పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయించిన ఘటన వెలుగులోకి వచ్చింది. వివరాలు.. హలసూరు కు చెందిన వృద్ధురాలికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. భర్త గతంలో మరణించాడు.
ఆమె పిల్లలతో ఉంటూ ఒక బ్యాంక్ మేనేజర్ ఇంట్లో వంటపని చేస్తుంది. ఈ సమయంలో లోకనాథ్ అనే వృద్ధునితో ఆమెకు పరిచయమైంది. ఆయన భార్య గతంలో కన్నుమూసింది. తన కొడుక్కి పిల్లను చూడడానికి వెళ్తున్నానని, తనతో రావాలని వృద్ధురాలిని పిల్చుకెళ్లాడు. అలా ఇద్దరి పరిచయం ప్రేమగా మారింది. తరచూ పలు పర్యాటక ప్రాంతాల్లో షికార్లు చేశారు.
పెళ్లి చేసుకోనంటున్నాడు
నిన్ను బాగా చూసుకుంటాను, పిల్లలను వదిలి తనతో వచ్చేయాలని వృద్ధుడు ప్రాధేయపడ్డాడు. దీంతో కుమారుడు వద్దన్నా లెక్కచేయకుండా లోక్‌నాథ్ వద్దకు వచ్చింది. పెళ్లి చేసుకుంటానని చెప్పిన లోకనాథ్ ఇప్పుడు మాట మారుస్తున్నాడని, వయసు తేడా ఉందంటూ అసభ్యపదజాలంతో దూషిస్తున్నాడని, తనను దూరం పెట్టేందుకు యత్నిస్తున్నాడని ఆమె పలు ఆరోపణలు చేసింది.
అతన్ని నమ్ముకుని అటు పిల్లలను వదిలేసి, ఇటు పని మానేసి వీధిన పడ్డానని, నమ్మించి మోసం చేసిన లోకనాథ్‌పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొంది. కాగా, ఆమె ఆరోపణలను లోకనాథ్ ఖండించాడు, ఆమెకు డబ్బు చెల్లించానని తెలిపాడు. వృద్ధుల తగవును ఎలా తీర్చాలా? అని పోలీసులు తలపట్టుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment