Karnataka Sakaleshapura : సకలేశపుర చూడడానికి రెండు కళ్లు చాలవు.! | - | Sakshi
Sakshi News home page

Karnataka Sakaleshapura : సకలేశపుర చూడడానికి రెండు కళ్లు చాలవు.!

Published Tue, Aug 29 2023 12:26 AM | Last Updated on Tue, Aug 29 2023 6:17 PM

బిస్లే ఘాట్‌ వద్ద ప్రకృతి అందాల వీక్షణం   - Sakshi

బిస్లే ఘాట్‌ వద్ద ప్రకృతి అందాల వీక్షణం

బనశంకరి: కన్నడనాట సుందరమైన పర్యాటక ప్రాంతాలకు కొదవలేదు. కొంచెం ఓపిక చేసుకుని వెళితే జీవితాంతం గుర్తుంచుకునే మధురమైన పర్యాటక యాత్రలు చేయవచ్చు. ఇదే కోవలోకి వస్తుందని హాసన్‌ జిల్లాలోని సకలేశపుర హిల్‌స్టేషన్‌. సకలేశపుర బెంగళూరు నుంచి 220 కిలోమీటర్లు దూరంలో ఉంది. ఇది పశ్చిమకనుమల్లో కలిసిపోయిన ఒక చిన్న పర్వత ప్రాంతం. టూరిస్టులకు ఎంతో డిమాండ్‌ ఉన్న విహార స్థలంగా మారింది. ఈ ప్రాంత ఇటు బెంగళూరు అటు మైసూరుకు సమీపంలో ఉండటం వల్ల వారాంతాల్లో టూర్‌ కు చాలా అనువైన ప్రదేశం. సకలేశపుర పట్టణం సముద్రమట్టానికి 949 మీటర్లు ఎత్తున ఉండి బెంగళూరు, మైసూరు నుంచి తేలికగా ప్రయాణించేలా ఉంటుంది. పర్యాటకులకు ట్రెక్కింగ్‌కు తగినట్లుగా ఉంటుంది. పర్యాటకులు బిస్లే అభయారణ్యంలో యువత, దేశ విదేశాల నుంచి వచ్చే యువ పర్యాటకులు ట్రెక్కింగ్‌ చేసి ఆనందిస్తారు.

ఆ అందాలకు అంతే లేదు

సకలేశపుర సమీపంలో అద్భుతమైన ఆకుపచ్చదనం కప్పుకున్న ఎత్తైన కొండలు, కాఫీ తోటలు పరుచుకున్న లోయలతో పర్యాటకులను ఆహ్వానిస్తాయి. ఈ రెండింటి మధ్యలో ఉండే సన్నటి ఘాట్‌రోడ్‌పై మలుపులు తిరిగే ప్రయాణం మరచిపోలేని అనుభూతి కలిగిస్తుంది. దట్టమైన అడవులు, ఆకాశాన్ని తాకుతున్నట్లు అనిపించే ఎత్తైన వృక్షసంపద ఆహా అనిపిస్తాయి. జలపాతాల హోరు కొండల్ని చీల్చుకుంటూ రైలుపట్టాల ఏర్పాటుకోసం తవ్విన గుహలు, పాయల గుండా హోరెత్తుతుంటాయి. అప్పుడప్పుడూ శబ్దం చేస్తూ దూసుకొచ్చే రైళ్లు పర్యాటకులను పలకరిస్తాయి.

ఆ పేరెలా వచ్చిందంటే హాసన్‌ నుంచి 30 కిలోమీటర్ల దూరంలో గల సకలేశపుర ఊరు చిన్నదే. కాఫీ, యాలకులు, మిరియాల తోటలతో పాటు అక్కడక్కడ టీ తోటలతో సంపన్న ప్రాంతంగా కనిపిస్తుంది. పర్వతారోహకులకు స్వర్గం వంటిది సకలేశపుర. ఒకప్పుడు మైసూరు రాజుల పాలనలో ఉండేది వీరికి ముందు హొయసళులు, చాళు క్యులు పరిపాలించారు. హొయసళుల కాలంలో ఈ ప్రాంతానికి సకలేశపుర అనే పేరువచ్చింది. హొయసళులు అక్కడకు వచ్చినప్పుడు ఒక శివలింగం విరిగిపడి ఉండటం గమనించారని, అంతా ఈశ్వర మహిమ అని పేరు వచ్చేలా సకలేశ్‌పుర అని పేరు పెట్టారని స్థానికులు చెబుతారు. కానీ మరికొందరు పట్టణనివాసులు వ్యవసాయం వల్ల ధనికులు కావడంతో ఈ పేరు పెట్టారని కూడా చెబుతారు.

సదాశివాలయం

నాగారం శైలిలో ఉండే గోపురంతో సదాశివాలయాన్ని ఏకకూట నిర్మాణశైలిలో నిర్మించారు. ఈ పుణ్యక్షేత్రంలోని గర్భగుడిలో పెద్ద శివలింగం ఉంది. రాతి గవాక్షాలతో కూడుకున్న ఒక పెద్ద గుడిలో అందంగా చెక్కిన నందివిగ్రహం ఉంచారు. అక్కడికి చేరుకోగానే అమ్మవారి గుడి వద్ద శివాలయం బయట రెండు వినాయకుడి విగ్రహాలు ఉండటం గమనించవచ్చు.

పర్వతాల శ్రేణులు

సకలేశపుర ప్రవేశంలోనే కాఫీ, టీ తోటల పరిమళాలు పర్యాటకులను స్వాగతం పలుకుతాయి. ఇక్కడ బిస్లే రిజర్వు ఫారెస్ట్‌, పుష్పగరి వైల్డ్‌ లైఫ్‌ సాంచురీ చూడవచ్చు. అందమైన పడమటి కనుమల శ్రేణి మైమరిపిస్తుంది. కుమారపర్వతం, పుష్పగిరి, దొడ్డబెట్ట, పట్టబెట్ట పర్వతాలను ఎంతసేపు చూసినా తనివి తీరదు. సాహసక్రీడలను ఆస్వాదించేవారు కుమార పర్వతం అధిరోహణానికి వెళ్లవచ్చు.

మంజూరాబాద్‌ కోట

దగ్గరలో మంజురాబాద్‌ కోట ప్రధాన ఆకర్షణ. 1790లలో దీనిని టిప్పుసుల్తాన్‌ నిర్మించారు. ఆకాశం నుంచి చూస్తే ఇది నక్షత్ర ఆకారంలో కనిపిస్తుంది. టెక్నాలజీ లేని రోజుల్లో ఇంత కచ్చితత్వంతో నిర్మించడం అబ్బురమే. కోటలోకి వెళ్తే రహస్య సొరంగాలు అబ్బురపరుస్తాయి. అప్పట్లో ఇక్కడ టిప్పు సైన్యం ఉండేది.

మధురం రైలు ప్రయాణం

సకలేశపుర నుంచి 59 కిలోమీటర్ల దూరంలో కుక్కె వరకు రైలు మార్గంలో సాహసయాత్ర మధురానుభూతి లభిస్తుంది. బెంగళూరు నుంచి సకలేశపుర –సకలేశపుర నుంచి కుక్కేకు రైలులో పరుగులు తీస్తుంటే పులకించే సంఘటనలు ఎదురవుతాయి. చిక్కని అడవి మధ్యలో పెద్దపెద్ద చీకటి సొరంగాల మధ్య నుంచి రైలు వెళ్తుంది. ఆ సమయంలో ప్రయాణికులు పిల్లా పెద్ద భేదం మరచి కేరింతలతో సందడి చేస్తారు.

ఎలా వెళ్లాలి

సకలేశపుర మంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం దగ్గరగా ఉంది. మంగళూరు, బెంగళూరు నుంచి రోడ్డు మార్గంలో ఆర్టీసీ బస్సులు, క్యాబ్‌లు, టూరిజం విభాగం వాహనాలు వెళ్తాయి. రైలు సౌకర్యం కూడా ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
మంజూరాబాద్‌ కోట  1
1/6

మంజూరాబాద్‌ కోట

కాఫీ తోటలు  2
2/6

కాఫీ తోటలు

సకలేశపురలో అక్కడక్కడా ఉన్న టీ తోటలు  3
3/6

సకలేశపురలో అక్కడక్కడా ఉన్న టీ తోటలు

కుమార పర్వతశ్రేణిలో  పర్యాటకుల ట్రెక్కింగ్‌ 4
4/6

కుమార పర్వతశ్రేణిలో పర్యాటకుల ట్రెక్కింగ్‌

నక్షత్ర ఆకారంలో కోట  5
5/6

నక్షత్ర ఆకారంలో కోట

6
6/6

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement