శివాజీనగర: గౌరీ గణేశ పండుగ, వరుసగా సెలవులు రావడంతో బెంగళూరు నుంచి ఇతర నగరాలకు, అలాగే తెలుగు రాష్ట్రాలకు వేలాది మంది తరలివెళ్తున్నారు. సొంతూరిలో బంధుమిత్రుల మధ్య సంతోషంగా పండుగ జరుపుకోవాలనే ఆశ ప్రైవేటు బస్సు యజమానులకు వరమైంది. టికెట్ల ధరలను రెండు రెట్లు పెంచి దోపిడీ చేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తాయి.
టికెట్‌పై రూ.వెయ్యి వరకూ
శనివారం నుంచి సోమవారం వరకూ ప్రైవేట్, ప్రభుత్వ బస్సుల సీట్లు భర్తీ అయ్యాయి. బెంగళూరు నుంచి రాష్ట్రం, ఇతర రాష్ట్రాలకు సంచరించే అనేక ప్రైవేట్ బస్సుల ప్రయాణం ధరలు రెండింతలయ్యాయి. పండుగ సమయంలో ఇది సహజం, దూరపు ప్రాంతాలకు బస్సుల టికెట్ ధరను రూ.800 నుండి రూ.1000 వరకూ పెంచినట్లు ప్రైవేటు ట్రావెల్స్ సిబ్బంది తెలిపారు.
అవసరం కాబట్టి..
సొంతూళ్లకు వెళ్లేవారు అనివార్యంగా అడిగినంత సొమ్ము ఇచ్చి ప్రయాణం చేస్తారు. ఈ సమయంలో టికెట్ ఎంతపెంచినా కొంటారనేది బస్సు యజమానులకు తెలుసు. ఒకవేళ ఎవరైనా ప్రశ్నిస్తే అలాంటివారిపై బస్సు సిబ్బంది దౌర్జన్యంతో నోరు మూయిస్తారని కొందరు ప్రయాణికులు వాపోయారు. ఎక్కువ చార్జీలు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్న ప్రభుత్వ హెచ్చరికలకు సైతం విలువ లేకుండా పోయింది. టికెట్ ధరల బాదుడుపై పలువురు ప్రయాణికులు సోషల్ మీడియాలోనూ ఆవేదన వెళ్లగక్కారు.
దూర ప్రాంతాలకు రెట్టింపు ధరలు
పండుగ, వరుస సెలవులను సొమ్ము చేసుకుంటున్న వైనం
బస్టాండ్లు కిటకిట
బెంగళూరు–మంగళూరు: 700 నుండి రూ. 800; ప్రస్తుతం రూ.1300
బెంగళూరు–ఉడుపి: రూ.880–1050; ప్రస్తుతం రూ.1500 నుండి 2500
బెంగళూరు–బళ్లారి : రూ.900 –రూ.1050; ప్రస్తుతం రూ.1000 నుండి 1500
బెంగళూరు–బెళగావి: రూ.900 నుండి రూ.1050; ప్రస్తుతం రూ.1600 నుండి 3000
బెంగళూరు–రాయచూరు: రూ.850 నుండి రూ.1110; ఇప్పుడు రూ.850 నుండి 1500
బెంగళూరు నుంచి తెలుగు రాష్ట్రాలకు ధరలు ఇదేమాదిరిగా పెరిగాయి
శుక్రవారం సాయంత్రం నుంచి బెంగళూరులో ఆర్టీసీ, ప్రైవేటు బస్టాండు రద్దీగా మారాయి. కుటుంబాలతో సహా ఊళ్లకు వెళ్లేవారు కార్లు, రైళ్లు దొరకనివారు బస్సుల బాట పట్టారు. అయితే లగ్జరీ బస్సుల్లో ఆర్టీసీ బస్సుల్లో అప్పటికే రిజర్వేషన్లు కావడంతో సాధారణ ప్రయాణికులకు సీట్లు దొరకడం గగనమైంది. ఉచిత ప్రయాణం వల్ల మహిళల రద్దీ పెరిగింది.
Comments
Please login to add a commentAdd a comment