పెద్ద దంతాల గజేంద్రునికి మోక్షం
మైసూరు: అడవిలో ఓ గజరాజుకు దంతాలు అనూహ్యంగా పెరిగిపోయాయి. తొండాన్ని దాటుకుని కొన్ని అడుగుల మేర ముందుకొచ్చాయి. అంత పెద్ద దంతాల గల ఏనుగును చూడడం పర్యాటకులకు, స్థానిక ప్రజలకు అద్భుతంగానే ఉన్నా ఆ ఏనుగు మాత్రం ఇబ్బందులు పడుతోంది. తొండం దంతాల మధ్య సాఫీగా కదలలేక కడుపు కాల్చుకుంటోంది. ఈ నేపథ్యంలో అటవీ అదికారులు ఏనుగు సమస్యను తీర్చారు. దాని దంతాలను కట్ చేశారు.
రైతుల ఫిర్యాదుతో..
వివరాలు.. చామరాజనగర జిల్లా బండీపుర అడవిలో ఒక ఏనుగుకు అడ్డదిడ్డంగా దంతాలు పెరిగాయి. దీంతో తొండం ఆ రెండు దంతాల మధ్య ఇరుక్కుపోయి అది సక్రమంగా ఆహారం తీసుకోలేకపోతోంది. పైకి తొండం పైకి ఎత్తలేక, నోరు సరిగ్గా తెరవలేక కష్టపడుతోంది. అది నిత్యం రైతుల పొలాల్లోకి వచ్చి పంటలను నాశనం చేస్తూ, ఆహారం తినేందుకు కష్టపడుతోందని గ్రామస్తులు అటవీ అధికారులకు తెలిపారు. దీని వల్ల అది బరువు కూడా తక్కువగానే ఉంది.
మత్తు మందు ఇచ్చి
అధికారులు కొన్ని రోజులుగా ఈ సమస్యపై విశ్లేషణ చేసి అడ్డంగా పెరిగిన దంతాలను కత్తిరించాలని నిర్ణయించారు. అడవుల్లోని పెద్ద చెట్లు, కొమ్మలను తినేందుకు తొండం పైకి రాకపోవడం వల్ల అడవిని వదిలేసి పొలాల్లో పంటల మీదకు పడుతోందని తెలుసుకున్నారు. ఈ క్రమంలో భారీ క్రేన్ వాహనాన్ని రప్పించి ఏనుగును బంధించారు. దానికి మత్తు మందు ఇచ్చి యంత్రపు రంపంతో దంతాలను కొంతమేర కత్తిరించారు. కబిని బ్యాక్ వాటర్‌లో గుండ్రే అటవీ జోన్ ప్రాంతంలో విడిచిపెట్టారు. ఇప్పుడు అది మామూలు ఏనుగుల మాదిరిగా ఆహారం తీసుకోగలదని అధికారులు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment