అపురూపం ఈ పావురం
బొమ్మనహళ్లి: ఉత్తర కన్నడ జిల్లాలోని దాండేలి పట్టణంలోని బంగూరు నగర జూనియర్ కాలేజీ దగ్గర అరుదైన రంగుల పావురం కనిపించింది. రావి చెట్టు మీద ఆ పక్షి ఉన్నట్లు తెలుసుకుని ప్రముఖ ఫోటోగ్రాఫర్, వన్యజీవి ప్రేమికుడు రాహుల్ బాలాజీ కెమెరాలో బంధించారు. మామూలుగా పావురాలు తెలుపు, నలుపు, బూడిద రంగుల్లో ఉంటాయి. పసుపు రంగువి అరుదు. ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయగా ప్రశంసలు దక్కాయి. భారత ఉపఖండంలో, ఆగ్నేయాషియాలోని కొన్ని ప్రాంతాల్లో ఇది అరుదుగా కనిపిస్తుందని తెలిపారు. ఇది మహారాష్ట్ర రాష్ట్ర పక్షి అని, మరాఠీలో హరోలి లేదా హరియల్ అని పిలుస్తారని బాలాజీ తెలిపారు. ఈ పావురం దట్టమైన అడవుల్లో జీవిస్తుందని చెప్పారు.
కుక్క కాటు గొడవ
యజమానికి కత్తిపోట్లు
మైసూరు: చామరాజనగర కుక్క పెద్ద గొడవకు కారణమైంది. కుక్క కరిచిందని దాని యజమానిని కత్తితో పొడిచారు. వివరాలు.. చామరాజనగర తాలూకా హరదనహళ్లిలో బసవరాజు, కుమార్ కుటుంబాలు ఇరుగు పొరుగు ఇళ్లలో నివసిస్తున్నారు. ఇటీవల కుమార్ తండ్రిని బసవరాజుకు చెందిన కుక్క కరిచి గాయపరిచింది. ఈ విషయమై ఇరు కుటుంబాల మధ్య గొడవ జరిగింది. దీనిపై బసవరాజు గ్రామ పెద్దలకు ఫిర్యాదు చేశారు. దీంతో కోపోద్రిక్తుడైన కుమార్.. దొడ్డంగడి వీధిలో బసవరాజు చొప్ప అమ్మే పనిలో ఉండగా, కత్తితో దాడి చేశాడు. బసవరాజుకు చేతిపై, పొట్ట కత్తిపోట్లు తగిలాయి. ఇన్‌స్పెక్టర్ రాజేష్, పోలీసులు చేరుకుని బాధితున్ని జిల్లాస్పత్రిలో చేర్పించారు. నిందితున్ని అరెస్టు చేశారు.
బ్యాంకు ఖాతాల నుంచి రూ.19 లక్షలు మాయం
మైసూరు: వారసత్వ నగరిని సైబర్ నేరగాళ్లు లక్ష్యం చేసుకుని భారీగా దోచుకుంటున్నారు. గంట వ్యవధిలో ఓ వ్యక్తికి చెందిన రెండు బ్యాంకు ఖాతాల నుంచి రూ.19.30 లక్షలను బదలాయించుకున్నారు. వివరాలు.. ఓ ఫార్మా కంపెనీలో పని చేస్తున్న శ్రీరాంపుర నివాసి మురుగేష్ బాధితుడు. ఐసీఐసీఐ బ్యాంకులో ఉన్న ఓ ఖాతా నుంచి రూ.17 లక్షలు, మరొక ఖాతా నుంచి రూ.2.30 లక్షలను బదిలీ చేసుకున్నారు. ఇంటర్నెట్ బ్యాంకింగ్ వ్యవస్థ కలిగిన మురుగేష్ ఖాతాలను దుండగులు హ్యాక్ చేసి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ఒక గంట అవధిలో ఖాతాలోని డబ్బు మాయమైంది. డబ్బు బదిలీ అయినట్లు మెసేజ్‌లు రావడంతో బాధితుడు కంగుతిని సైబర్ క్రైం పీఎస్‌లో ఫిర్యాదు చేశాడు.
మణిపాల్‌లో
విద్యార్థుల కొట్లాట
యశవంతపుర: తాగిన మత్తులో రెండు విద్యార్థుల గుంపులు గొడవ పడిన ఘటన విద్యానగరి అయిన మణిపాల్‌లో కాయిన్ సర్కిల్ వద్ద జరిగింది. శుక్రవారం రాత్రి బార్‌కు వెళ్లిన విద్యార్థులు బాగా మద్యం తాగారు. మాటమాట పెరిగి రెండు గుంపులుగా విడిపోయి దాడులు చేసుకున్నారు. ఒక విద్యార్థి బట్టలను చించివేసి కొట్టారు. స్థానికుల సమాచారంతో పోలీసులు అక్కడికి వచ్చేలోపు పోకిరీలు పారిపోయారు. మళ్లీ కొట్లాటలు జరగకుండా ఆ సర్కిల్‌లో బందోబస్తు ఏర్పాటైంది. సమీపంలో అమర్చిన సీసీ కెమెరాల చిత్రాలను పరిశీలించి ఆకతాయిలను గుర్తించే పనిలో ఉన్నారు.
మోస్ట్ వాంటెడ్ పట్టివేత
చిక్కబళ్లాపురం: పలు నేరాల్లో పోలీసులకు బాగా కావలసిన మహమ్మద్ ఖలీలుల్లా అలియాస్ బాంబే సలీంను బాగేపల్లి పోలీసులు అరెస్టు చేశారు. కర్ణాటక, మహారాష్ట్రలో ఇతనిపై హత్యలు, దోపిడీల కేసులు ఉన్నట్లు జిల్లా ఎస్పీ కుశాల్ చౌక్సీ తెలిపారు. నిందితుని నుంచి రూ. 30 లక్షల విలువగల కారు, రూ. 5.15 లక్షల విలువైన బైక్, దోపిడీలకు వాడే ఇనుప సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. గత డిసెంబరు 20వ తేదీన గుడిబండ తాలూకా గంగానహళ్లివాసి అశ్వత్థ నారాయణ భూమిని అమ్మి డబ్బుతో వెళ్తుండగా కారులో వచ్చిన బాంబె సలీం రూ. 16 లక్షలను దోచుకొన్నాడు. అశ్వత్తనారాయణను కిడ్నాప్ చేసి రూ. 50 లక్షలు ఇవ్వాలని కుటుంబాన్ని బెదిరించాడు. అప్పటినుంచి పరారీలో ఉన్నాడు. సీఐ ప్రశాంత్ వర్ని బృందం నిఘా వేసి నిందితున్ని పట్టుకుంది.
అపురూపం ఈ పావురం
Comments
Please login to add a commentAdd a comment