తుపాకీతో ఆటలు.. బాలుని దుర్మరణం
మండ్య: కోళ్ళ ఫారంలో తుపాకీ పేలి నాలుగేళ్ల బాలుడు చనిపోగా, అతని తల్లి గాయపడింది. జిల్లాలోని నాగమంగళ తాలూకాలోని దూందేమాదనహళ్ళి గ్రామంలో ఆదివారం సాయంత్రం ఈ విషాద సంఘటన జరిగింది. నరసింహమూర్తి అనే వ్యక్తి కోళ్ల ఫారం నడుపుతున్నాడు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన కుటుంబం ఇందులో నివసిస్తూ ఫారంలో పని చేస్తోంది. సదరు మహిళ లిపిక, కొడుకు అభిజిత్ (4), మరో బాలుడు సుదీప్ దాస్(15) ఆడుకుంటూ ఉన్నారు. ఫారం యజమానికి చెందిన సింగిల్ బ్యారెల్ తుపాకీతో సుదీప్‌దాస్ ఆడుకుంటూ ట్రిగ్గర్ నొక్కడంతో తూటా పేలింది. తూటా రవ్వలు ఎదురుగా ఉన్న లిపిక, అభిజిత్‌కు తగలగా అభిజిత్ తీవ్ర గాయాలై చనిపోయాడు. మహిళను ఆస్పత్రికి తరలించారు. నాగమంగల పోలీసులు పరిశీలించి తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేశారు.
దొంగనోట్లు మార్చబోయి..
శివాజీనగర: ఇటీవల ఆడుగోడిలోని ఓ షాపులో నకిలీ నోట్ల మార్పిడికి ప్రయత్నించి ముగ్గురు ప శ్చిమ బెంగాల్ కార్మికులు పోలీసుల చేతికి చిక్కారు. నిందితులు సుమన్, గులామ్, మరొకరు కలిసి గౌహతి ఎక్స్‌ప్రెస్ రైలు ద్వారా బెంగళూరుకు భవన నిర్మాణ పని కోసం వస్తుండగా, రైలు టాయ్‌లెట్‌లో నకిలీ నోట్లు ఉన్న బ్యాగ్ దొరికింది. దానిని తమతో పాటు బెంగళూరుకు తీసుకొచ్చారు. తరువాత ఆడుగోడికి చెందిన సురేశ్ అనే వ్యక్తి అంగడికి వెళ్లి రూ.70 వేల నకిలీ నోట్లను ఇచ్చి, కమీషన్ పట్టుకుని, తమ ఖాతాలోకి జమ చేయాలని కోరారు. సురేశ్ నగదును లెక్కించేటపుడు నోట్ల సీరియల్ నంబర్ ఒకటే ఉండడంతో అనుమానం వచ్చి పోలీసులకు ఉప్పందించాడు, నిందితులను ప్రశ్నించగా రైలు– బ్యాగు కథ చెప్పారు. ఇది విశ్వసించని పోలీసులు బెంగాల్‌కు నిందితులను తీసుకెళ్లి వారి ఇళ్లలో తనిఖీలు చేయాలని నిర్ణయించారు.
అన్నదాత శ్రమ ఆహుతి
మండ్య: రాగి గడ్డి వాము మంటల్లో చిక్కుకుని రూ.75 వేల విలువ చేసే రాగులు, గడ్డి బూడిదయ్యాయి. నాగమంగల తాలూకాలోని కరడహళ్ళిలో ఈ ప్రమాదం జరిగింది. రైతు రామేగౌడ పొలంలో రాగి పంట పండించాడు. సుమారు ఐదు ట్రాక్టర్ల రాగి పైరును కోసి వాము వేశాడు. ఆదివారం సాయంత్ర మంటలు అంటుకొన్నాయి. రైతులు ఆర్పే ప్రయత్నం చేసినా ఫలితం లేదు. ఫైర్ సిబ్బంది వచ్చి ఆర్పివేసేటప్పటికి బూడిద మిగిలింది. ఎంతో నష్టం జరిగిందని బాధిత రైతు విలపించాడు.
పాటిల్ అలకపాన్పు..
ఈసారి మంచి పోస్టు
యశవంతపుర: కర్ణాటక ప్రణాళికా విభాగం ఉపాధ్యక్షునిగా ఆళంద కాంగ్రెస్ ఎమ్మెల్యే బీఆర్ పాటిల్‌ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఆయనకు మంత్రి హోదా కల్పిస్తూ, వారికి లభించే అన్ని సౌకర్యాలను తక్షణం ఇవ్వాలని ఆ ఆదేశాల్లో సూచించారు. బీఆర్ పాటిల్ సీఎం సిద్దరామయ్య రాజకీయ సలహాదారు పదవిలో ఉండేవారు. మంత్రి పదవి కోరుకున్న ఆయనకు నిరాశే మిగిలింది. దీంతో నియోజకవర్గ అభివృద్ధికి నిధులు రావడం లేదు, అన్నీ గ్యారంటీ పథకాలకే ఖర్చయిపోతున్నాయని ఆరోపించి గత నెలలో సలహాదారు పదవికి రాజీనామా చేశారు. దీంతో సిద్దరామయ్య అయనను బుజ్జగించి ఈ స్థానాన్ని కట్టబెట్టారు.
చిన్నారికి ఉరివేసి,
తల్లి ఆత్మహత్య
దొడ్డబళ్లాపురం: భర్తపై కోపంతో ఓ భార్య చిన్నారి కుమార్తెను చంపి తానూ ఆత్మహత్య చేసుకున్న సంఘటన బెంగళూరులోని బాగలగుంటలో చోటుచేసుకుంది. శృతి (33), కుమార్తె రోహిణి (5)ని మొదట ఫ్యాన్‌కు ఉరివేసి హత్య చేసి తరువాత అదే ఫ్యాన్‌కు తానూ ఉరివేసుకుని ప్రాణాలు తీసుకుంది. శృతి తుమకూరు జిల్లా పావగడ తాలూకా గుండారహళ్లి గ్రామపంచాయతీ అధ్యక్షురాలు కావడం గమనార్హం. ప్రస్తుతం భర్త, ఆడిటర్ గోపాలక్రిష్ణతో కలిసి బాగలగుంటలో నివసిస్తోంది. భర్త అక్రమ సంబంధం పెట్టుకున్నాడని, ఎంత చెప్పినా తన మాట వినడం లేదని, అందుకే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్టు శృతి డెత్ నోట్ రాసింది. బాగలగుంట పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
తుపాకీతో ఆటలు.. బాలుని దుర్మరణం
తుపాకీతో ఆటలు.. బాలుని దుర్మరణం
Comments
Please login to add a commentAdd a comment