నౌకా స్థావరంలో విచారణ
యశవంతపుర: ఉత్తరకన్నడ జిల్లా కార్వార వద్ద గల భారతీయ నౌకాదళ స్థావరం ఐఎన్‌ఎస్ కదంబలో ఎన్‌ఐఎ అధికారులు ముగ్గురు కార్మికులను అదుపులోకి తీసుకున్నారు. సోమవారం స్థావరానికి చేరుకొని విచారించారు. 2024 ఆగస్ట్‌లో ఎన్‌ఐఎ అధికారులు మొదటిసారి ఇక్కడ విచారణ జరిపారు. ముదగాద వేతన్ తండేల్, తోడూరు సునీల్, అక్షయ్ నాయక్ అనేవారు ఇక్కడ కార్మికులుగా పనిచేస్తున్నారు. వీరు కార్వార, గోవాకు చెందినవారు. స్థావరానికి సంబంధించిన ఫోటోలు, ముఖ్యమైన సమాచారాన్ని ఇతరులకు చేరవేశారని ఆరోపణలు వచ్చాయి. ఆ కేసును ఎన్‌ఐఏ దర్యాప్తు చేస్తోంది. ముగ్గురు నిందితులను విచారించి నోటీసులిచ్చారు.
వరుసగా ఏడు కార్లు ఢీ
దొడ్డబళ్లాపురం: బెంగళూరు– మంగళూరు రహదారిలో ఆదివారం అర్ధరాత్రి వాహనాలు వరుసగా ఢీకొన్న ప్రమాదంలో 7 కార్లు ధ్వంసమయ్యాయి. చోలగెరె టోల్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఇక్కడ కొత్తగా టోల్‌గేట్ ఏర్పాటు చేయడం వద్ద వాహనాల రద్దీ ఎక్కువగా ఉంది. వేగంగా వచ్చిన ఒక కారు ముందు ఉన్న కారును ఢీకొనడంతో ఒకదానికొకటి 7 కార్లు గుద్దుకొని ధ్వంసమయ్యాయి. కార్లలోని కొందరికి చిన్న చిన్న గాయాలయ్యాయి. దీంతో ఈ మార్గంలో కాసేపు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఆలూరు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
ఈదఫా రూ.8 లక్షల
కోట్ల బడ్జెట్!
● మార్చి 7న సమర్పణ: సీఎం
శివాజీనగర: రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలు మార్చి 3వ తేదీ నుంచి ఆరంభం కానున్నాయి. మార్చి 7న సీఎం సిద్దరామయ్య బడ్జెట్‌ను ప్రకటిస్తారు. సోమవారం విధానసౌధలో విలేకరులతో మాట్లాడిన సిద్దరామయ్య, తొలిరోజున గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ ఉభయ సభలను ఉద్దేశించి మాట్లాడతారని, గవర్నర్ ప్రసంగంపై అసెంబ్లీలో మూడు రోజులు చర్చ జరుగుతుందని తెలిపారు. 7న అసెంబ్లీలో తాను బడ్జెట్‌ను సమర్పిస్తానని చెప్పారు. ఆర్థిక శాఖను కూడా చూస్తున్న సిద్దరామయ్య బడ్జెట్‌ను ప్రకటించడం ఇది 16 వ సారి. ఈసారి బడ్జెట్ పరిమాణం రూ. 8 లక్షల కోట్ల కంటే ఎక్కువగా ఉంటుందని తెలిపారు. గతంలో ఎప్పుడూ కూడా ఇంత మొత్తంలో బడ్జెట్ లేదని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. ఐదు గ్యారంటీలు అమలులో ఉన్నాయి. ఇంకా కొత్త సంక్షేమ పథకాలు ప్రకటిస్తారా? అనే ఉత్కంఠ నెలకొంది.
రైతులకు పెద్దపీట: సీఎం
శివాజీనగర: రాష్ట్ర ప్రభుత్వం రైతుల డిమాండ్లను నెరవేరుస్తుంది, ఎప్పటికీ రైతులకు అనుకూలంగా ఉంటామని సీఎం సిద్దరామయ్య తెలిపారు. సోమవారం విధానసౌధలో రైతు సంఘాల ప్రతినిధులు, నాయకులతో రాష్ట్ర బడ్జెట్ ముందస్తు సమావేశం నిర్వహించారు. సీఎం మాట్లాడుతూ అత్యధిక ఉద్యోగాలు సృష్టి అయ్యేది వ్యవసాయంలోనే. అందుచేత రైతుల డిమాండ్లకు ప్రథమ ప్రాధాన్యత ఉంటుందని చెప్పారు. రైతులకు కావాల్సిన సహాయం, కార్యక్రమాల గురించి రైతు నేతలు వినతి పత్రాన్ని సమర్పించారు. మైక్రో ఫైనాన్స్‌ల బలవంతపు వసూళ్ల వేధింపులను అరికట్టాలన్నారు.
మారమ్మదేవికి విశేష పూజలు
బొమ్మనహళ్లి: బెంగళూరు బొమ్మనహళ్ళి నియోజకవర్గం హెచ్‌ఎస్‌ఆర్ లేఔట్ పరంగిపాళ్యలో గ్రామదేవత మారమ్మదేవికి సోమవారం విశేష పూజలు చేశారు. ఉదయం అభిషేకం, అలంకరణ గావించారు. అమ్మవారికి అక్షింతలతో పాటు పూలతో ముస్తాబు చేశారు. పెద్దసంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు.
నౌకా స్థావరంలో విచారణ
నౌకా స్థావరంలో విచారణ
Comments
Please login to add a commentAdd a comment