దుర్గమ్మ తేరు.. భక్తజన హోరు
సాక్షి,బళ్లారి: నగర ఆదిదేవత, కోట్లాది మంది భక్తుల కొంగు బంగారం, కోరిన కోర్కెలు తీర్చే అమ్మవారుగా ఖ్యాతి పొందిన కనక దుర్గమ్మ సిడిబండి రథోత్సవం కన్నుల పండువగా నిర్వహించారు. మంగళవారం నగరంలోని కనక దుర్గమ్మ ఆలయం వద్ద ముందుగా తీసుకుని వచ్చిన సిడిబండి రథానికి ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేయించారు. కౌల్‌బజార్ గాణగ సమాజానికి చెందిన ఆలయ ప్రముఖుల ఎద్దులను సిడిబండికి కట్టి ఆలయం చుట్టూ తిప్పారు. అమ్మవారి ఆలయానికి దేదీప్యమానంగా పూలు, విద్యుత్ దీపాలను అలంకరించడంతో పాటు కనక దుర్గమ్మకు బంగారు ఆభరణాలు అలంకరించారు. వేలాది మంది భక్తులు బారులు తీరడంతో ఎటుచూసిన ఆలయ పరిసరాలు భక్తజన సందోహంతో కిటకిటలాడాయి. ఆలయం ముందు సిడిబండికి పూజలు చేస్తూ టెంకాయలు కొడుతూ, అరటిపండ్లు విసురుతూ మొక్కులు తీర్చుకున్నారు.
ఇంటింటా పండుగ వాతావరణం
ప్రతి ఏటా మాదిరిగానే ఫాల్గుణ మాసంలో పౌర్ణమి కంటే ముందు వచ్చే మంగళవారం నాడు ఆనవాయితీగా నిర్వహించే సిడిబండి రథోత్సవం అంటే నగర వాసులకే కాకుండా జిల్లాతో పాటు చుట్టుపక్కల జిల్లాల వాసులకు పండుగ. ఈ నేపథ్యంలో సిడిబండి రోజున నగరంలో ఇంటింటా పండుగ వాతావరణం నెలకొంది. అమ్మవారి ఆలయం చుట్టు మాత్రమే కాకుండా నగరంలోని పలు రోడ్లలో భక్తుల కోసం మజ్జిగ, అన్న ప్రసాదాలు ఏర్పాటు చేశారు. ఉదయం నుంచి బారులు తీరి దర్శనం చేసుకున్న భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని చర్యలు తీసుకున్నారు. అనంతరం సాయంత్రం సిడిబండి రథోత్సవం తిలకించేందుకు లక్షలాది మంది జనం తరలిరావడంతో కనక దుర్గమ్మ ఆలయం నుంచి ఇటు రాయల్ సర్కిల్, అటు ఎస్పీ సర్కిల్, కప్పగల్ రోడ్డు, తాళూరు రోడ్డు ఇలా ప్రముఖ కాలనీలన్ని జనసందోహంతో నిండిపోయాయి. ఆలయం చుట్టు ఉన్న భవంతులపైకి జనం ఎక్కి సిడిబండి రథోత్సవాన్ని తిలకించారు. పెద్ద సంఖ్యలో జనం తరలి రావడంతో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.
కన్నుల పండువగా సిడిబండి రథోత్సవం
ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు
ఉదయం నుంచి బారులు తీరిన భక్తులు
దుర్గమ్మ తేరు.. భక్తజన హోరు
దుర్గమ్మ తేరు.. భక్తజన హోరు
Comments
Please login to add a commentAdd a comment