● 100 పిల్లుల మరణం
● రాష్ట్రానికి వ్యాపించిన నూతన వైరస్
రాయచూరు రూరల్: ఇళ్లలో పెంచుకునే పెంపుడు పిల్లుల్లో ఎఫ్‌పీవీ వ్యాధి సోకి జిల్లాలో 100కు పైగా పిల్లులు మరణించినట్లు సమాచారం. ఇప్పటికే కరోనా వ్యాధి బారి నుంచి కోలుకుంటున్న తరుణంలో పిల్లుల్లో ఎఫ్‌పీవీ వ్యాధి కనిపించడంతో రాష్ట్రానికి నూతన వైరస్ వ్యాపించిందని ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఈ విషయంపై పశు సంవర్ధక శాఖాధికారి అశోక్ కోల్‌కర్ మాట్లాడారు. మనిషికి పోలియో వ్యాధి సోకినప్పుడు పోలియో చుక్కలు వేసుకోకపోతే దివ్యాంగులుగా మారుతారన్నారు. ఈ విషయంలో జిల్లాలో ఎక్కడా ఎలాంటి సంఘటనలు జరిగినట్లు తమకేమీ సమాచారం లేదన్నారు. పిల్లులకు వ్యాక్సిన్ వేయడానికి చర్యలు తీసుకుంటామన్నారు. ఈ వ్యాధి పిల్లులకు మాత్రమే సోకుతుందని, మనుషులకు సోకదని తెలిపారు.
జొన్నల కొనుగోళ్లు ప్రారంభం
హుబ్లీ: 2024–25వ ఏడాదికి కేంద్ర ప్రభుత్వ మద్దతుధర పథకం కింద నాణ్యమైన తెల్లజొన్నలను ప్రతి క్వింటాల్‌కు హైబ్రిడ్ రూ.3371, మాల్‌దండి రూ.3421 చొప్పున ధార్వాడ జిల్లా రైతుల నుంచి మాత్రమే కొనుగోలు చేస్తారు. రైతులు ఈ అవకాశం వినియోగించుకోవాలని జిల్లా టాస్క్‌ఫోర్స్ సమితి చైర్‌పర్సన్, జిల్లాధికారిణి దివ్యప్రభు తెలిపారు. మరిన్ని వివరాలకు ధార్వాడ, హుబ్లీ, నవలగుంద, కలఘటిగి, కుందగోళ ఏపీఎంసీ కార్యదర్శి, సహకార విక్రయ మహామండలి బ్రాంచ్ మేనేజర్ లేదా 0836–2004419లో సంప్రదించాలని ఆమె కోరారు.
పీఎఫ్ సౌకర్యానికి వినతి
రాయచూరు రూరల్: రాష్ట్రంలో 1995లో పదవీ విరమణ చేసిన పెన్షనర్లకు పీఎఫ్ సౌకర్యం కల్పించాలంటూ ఆందోళన చేపట్టారు. మంగళవారం పీఎఫ్ జిల్లాధికారి కార్యాలయం వద్ద పెన్షనర్లు మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయం వల్ల ఇబ్బందులకు గురవుతున్నట్లు తెలిపారు. పెన్షన్ 95 భవిష్య నిధి పదవీ విరమణ సమన్వయ సమితి ఆధ్వర్యంలో పదవీ విరమణ చేసిన పెన్షనర్లకు పీఎఫ్‌ను రూ.1000 నుంచి రూ.7,500 వరకు పెంచాలని కోరుతూ పీఎఫ్ అధికారికి వినతిపత్రం సమర్పించారు.
రైతు భవన్ పనుల పరిశీలన
హొసపేటె: విజయనగర జిల్లాలోని హొసపేటె తాలూకాలోని అంబేడ్కర్ భవన్ సమీపంలో చేపట్టిన కొత్త రైతు భవన్ నిర్మాణ పనులను మంగళవారం ఎమ్మెల్యే గవియప్ప పరిశీలించారు. రూ.5 కోట్ల వ్యయంతో అద్భుతంగా నిర్మిస్తున్న రైతు భవన్‌లో ప్రోగ్రామ్ హాల్, కళ్యాణ మండపంతో సహా మూడంతస్తుల భవన నిర్మాణ పనులు ఎంత వరకు పురోగతిలో ఉన్నాయో రైతు నాయకులు ఎమ్మెల్యే గవియప్పకు వివరించారు. నిర్మాణ పనుల పరిశీలనలో రైతు నాయకుడు కటికి జంబయ్య తదితరులు పాల్గొన్నారు.
హక్కులను తెలుసుకోవాలి
బళ్లారిటౌన్: ప్రతినిత్యం వ్యాపార వ్యవహారాలు చేస్తున్న వినియోగదారులు తమ హక్కులను తెలుసుకోవాలని జిల్లాధికారి ప్రశాంత్ మిశ్రా పేర్కొన్నారు. జిల్లా పాలన, జిల్లా పంచాయతీ, ఆహార పౌర సరఫరాల శాఖ, తూనికలు కొలతల, జిల్లా ఫోరం, న్యాయసేవా ప్రాధికారం ఆధ్వర్యంలో మంగళవారం నూతన జిల్లా పాలన భవనంలో ఏర్పాటు చేసిన ప్రపంచ వినియోగదారుల కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. నేడు ఆధునిక పరిజ్ఞానం అభివృద్ధి చెందుతున్నందున దానికి అనుగుణంగా ముందుకు సాగాల్సిన అనివార్యత ఏర్పడిందన్నారు. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్లలో వస్తువులు కొనుగోలు చేసేటప్పుడు నాణ్యమైనదీ, కానిదీ తెలుసుకోవాలన్నారు. వినియోగదారులు అమ్మకందారుల నుంచి మోసపోతే కన్జూమర్ ఫోరంలో ఫిర్యాదు చేయవచ్చన్నారు. సివిల్ న్యాయమూర్తి రాజేష్ ఎస్ హొసమని మాట్లాడుతూ వినియోగదారులు కొనే ప్రతి వస్తువు పట్ల జాగ్రత్త వహించాలన్నారు. ఫోరం అధ్యక్షుడు తిప్పేస్వామి, లాయర్ ప్రకాష్, అంకాలయ్య, శశికళ, తూనికలు కొలతల ఈడీ అమృత, షకీన పాల్గొన్నారు.
పశువుల కొట్టం దగ్ధం
హుబ్లీ: పశువుల కొట్టానికి నిప్పంటుకుని రెండు ఎద్దులు, రెండు ఆవులు, రెండు దూడలతో పాటు భారీగా ధాన్యం కాలి బూడిదైన ఘటన జిల్లాలోని కలఘటిగి తాలూకా గలగిహులకొప్ప గ్రామంలో చోటు చేసుకుంది. ఆ గ్రామ నివాసులైన శివప్ప, బసప్పలకు చెందిన కొట్టానికి అగ్నిప్రమాదం వాటిల్లింది. 10 క్వింటాళ్ల వడ్లు, 10 క్వింటాళ్ల సోయాబీన్, 5 క్వింటాళ్ల ఉలువలు, 20 పైపులతో పాటు వ్యవసాయ పరికరాలు కాలిపోయాయి. తోటలోని పొలంలో కొట్టం ఉండటం వల్ల అక్కడ పశువులను కట్టివేశారు. అర్ధరాత్రి వేళ ఎవరూ లేని సమయంలో ప్రమాదం జరగటంతో పశువులు మృత్యువాత పడ్డాయి.
పిల్లుల్లో ఎఫ్‌పీవీ వ్యాధి
పిల్లుల్లో ఎఫ్‌పీవీ వ్యాధి
పిల్లుల్లో ఎఫ్‌పీవీ వ్యాధి