
ఉద్యోగిని సేవలు మరువలేనివి
బళ్లారి రూరల్ :బీఎంసీఆర్‌సీలో మేట్రిన్ (నర్సింగ్ సూపరింటెండెంట్) కె.నాగరత్నమ్మ సేవలు మరవరానివని బీఎంసీఆర్‌సీ డీన్ డాక్టర్ గంగాధరగౌడ అన్నారు. కె.నాగరత్నమ్మ ఉద్యోగ విరమణ సదర్భంగా శనివారం ఏర్పాటు చేసిన వీడ్కోలు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. స్టాఫ్ నర్సుగా బళ్లారి మెడికల్ కళాశాలలో చేరి అనంతరం విమ్స్ హెడ్‌నర్సుగా, మేట్రిన్‌గా, బీఎంసీఆర్‌సీ మేట్రిన్‌గా రోగులకు విశేష సేవలు అందించారన్నారు. నాగరత్నమ్మ అందరిపట్ల సౌమ్యంగా మాట్లాడేవారని, ఆమెను తల్లిలా భావించేవాడినని తెలిపారు. అనంతరం కె.నాగరత్నమ్మ దంపతులను సన్మానించారు. ప్రిన్స్‌పాల్ డాక్టర్ మంజునాథ్ సూపరిన్‌టెండెంట్‌లు డాక్టర్ ఇందుమతి, డాక్టర్ శివనాయక్, నర్సులు సిబ్బంది పాల్గొన్నారు.