
కర్ణాటక సంఘానికి నూతన భవనం నిర్మిస్తాం
రాయచూరు రూరల్ : కళ్యాణ కర్ణాటక, ఉత్తర కర్ణాటక ప్రజలకు సాంస్కృతిక పరంగా, కన్నడ భాషకు నూతన ఒరవడిని కల్పించిన కర్ణాటక సంఘం నూతన భవన నిర్మాణానికి చర్యలు చేపడతామని రాష్ట్ర చిన్న నీటిపారుదల శాఖ మంత్రి బోసురాజు వెల్లడించారు. మంగళవారం కర్ణాటక సంఘం పాత భవనాన్ని సందర్శించి ఆయన మాట్లాడారు. 98 ఏళ్లు పూర్తి చేసుకున్న భవనం శిథిలావస్థకు చేరుకుందని, మరో రెండేళ్లో వందేళ్లు పూర్తి కానున్న నేపథ్యంలో నూతన భవన నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించాలని అధికారులకు సూచించారు. సంఘం అధ్యక్షుడు శాంతప్ప, జయన్న, రుద్రప్ప, శివమూర్తి, నరసింహులు, శ్రీనివాసరెడ్డి, మురళీధర్ కులకర్ణిలున్నారు.