రాయచూరు రూరల్: పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై సీబీఐతో విచారణ జరపాలని కల్వరి పాస్టర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు జాన్ వెస్లీ డిమాండ్ చేశారు. మంగళవారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పాస్టర్ ప్రవీణ్ పగడాలను హత్య చేయించి దానిని రోడ్డు ప్రమాదంలో మరణించినట్లు చిత్రీకరిస్తోందన్నారు.
హైదరాబాద్ నుంచి రాజమండ్రికి సువార్త స్వస్థత కూటమి సమావేశాలకు పాస్టర్ ప్రవీణ్ పగడాల వెళుతున్న సమయంలో కొవ్వూరు టోల్‌గేట్ వద్ద ఈ ప్రమాదం సంభవించినట్లు తెలిపారు. పాస్టర్ ప్రవీణ్ పగడాల వాహనానికి ఎలాంటి ముప్పు జరగక పోయినా పాస్టర్ తలకు బలమైన గాయాలయ్యాయన్నారు. తలకు పెట్టుకున్న హెల్మెట్ కూడా పగలకుండా ఉందన్నారు. పాస్టర్ ప్రవీణ్ పగడాలను రాజకీయ కక్షతో హత్య చేశారన్నారు. పాస్టర్ మరణంపై సీబీఐతో విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
వివాదాస్పద ఫోటో స్టేటస్‌పై ఘర్షణ
హుబ్లీ: ఓ యువకుడు వివాదాస్పద ఫోటో స్టేటస్ పెట్టుకున్నాడన్న విషయమై రెండు వర్గాల మధ్య వాగ్వాదానికి కారణమైంది. ధార్వాడ ఆంజనేయ నగర్‌కు చెందిన సలీం ఈ కేసులో నిందితుడు. ఈయన ధార్వాడ జకని బావి వద్ద ఈద్గాలో ఉన్నట్లు వదంతులు వెలువడ్డాయి. దీంతో భజరంగదళ్ కార్యకర్తలు అక్కడ గుమిగూడారు. అయితే పోలీసులు ముందుగానే నిందితుడిని విద్యాగిరి స్టేషన్‌కు తరలించారు. దీంతో స్టేషన్ ఎదుట గుమిగూడిన కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదే సమయంలో సలీం కుటుంబ సభ్యులు కూడా విద్యాగిరి స్టేషన్‌కు రావడంతో స్టేషన్ ఎదుటే రెండు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకోగా పోలీసులు ఇరు వర్గాలకు నచ్చజెప్పి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
12న హంపీలో జోడు బ్రహ్మరథోత్సవం
హొసపేటె: చారిత్రక హంపీలోని విరుపాక్ష్వేర స్వామి, చంద్రమౌళేశ్వర స్వామి జంట బ్రహ్మరథోత్సవం ఈనెల 12న జరుగుతుందని ఆలయ కార్యనిర్వహణాధికారి హనుమంతప్ప తెలిపారు. హంపీ జాతర మహోత్సవం ఈనెల 6 నుంచి 14 వరకు హంపీ తాలూకాలో జరుగుతుంది. హంపీ ప్రాంత ప్రధాన పూజారి విద్యారణ్య భారతీ స్వామి మార్గదర్శకత్వంలో ఈనెల 12న జోడు బ్రహ్మరథోత్సవం జరుగుతుందన్నారు. శ్రీ కృష్ణదేవరాయలు సమర్పించిన బంగారు కిరీటాన్ని ఏప్రిల్ 10 నుంచి 14 వరకు అలంకరించనున్నారు. భక్తులందరికీ ఉచిత అన్న ప్రసాదం పంపిణీ చేస్తారు. జాతర మహోత్సవం, రథోత్సవాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామి వారి కృపకు పాత్రులు కావాలని ఓ ప్రకటనలో కోరారు.
ఇస్పేట్ జూదరుల అరెస్టు
హొసపేటె: గంగావతి తాలూకా ఉడుమకల్‌లో ఇస్పేట్ జూదం అడ్డాపై రూరల్ పోలీసులు దాడి చేసి, 9 మంది జూదరులను అరెస్టు చేసి, 26 బైకులు, రూ.39,000 నగదు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు. గ్రామీణ ప్రాంతాలైన సిద్దికేరి రైల్వే ట్రాక్, పాపయ్య కెనాల్, ఆంజనేయ గుడి, విద్యానగర్, దేవఘట్ట, ఆనెగుంది, బెట్టగుడ్డ, తుంగభద్ర నదీ పరివాహక ప్రాంతం, గంగావతి గంజ్ ఏరియా, కొన్ని లాడ్జిల్లో పగలు, రాత్రి సాగుతున్న జూదాలను అరికట్టాలని ఆయా సంఘాలు ఎస్పీకి విన్నవించాయి. ఈ దాడిలో రూరల్ సీఐ రంగప్ప దొడ్డమని, సిబ్బంది బసవరాజు చిన్నూరు, రాఘవేంద్ర, మంజునాథ్, బసవరాజు, మురుడి ముత్తురాజు, డ్రైవర్ అమరేష్ పాల్గొన్నారు.

పాస్టర్ మృతిపై సీబీఐ దర్యాప్తునకు డిమాండ్