
శాంతిభద్రతల రక్షణలో పోలీసుల పాత్ర కీలకం
సాక్షి,బళ్లారి: శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసుల పాత్ర కీలకమని జిల్లా ఎస్పీ శోభారాణి పేర్కొన్నారు. ఆమె బుధవారం నగరంలోని డీఏఆర్ మైదానంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. సమాజంలో ఎలాంటి సమస్యలు వచ్చినా ముందుగా అందరికీ గుర్తుకు వచ్చేది పోలీసులేనన్నారు. అలాంటి ఉద్యోగం చేస్తుండటం మనందరికీ గర్వకారణమన్నారు. అయితే పోలీసు స్టేషన్లకు వచ్చే వారితో స్నేహ పూర్వకంగా మెలగాలన్నారు. పోలీసులు అంటే భయం చూపకూడదన్నారు. జనంలో మనం ఒకరిగా జీవిస్తూ ముందుకెళ్లాలన్నారు. ఎన్నో ఒత్తిళ్లను తట్టుకుని పని చేసే పోలీసులు ఆరోగ్యంపై కూడా జాగ్రత్తలు పాటించాలన్నారు. కుటుంబ సభ్యులకు కూడా సమయం కేటాయించాలన్నారు. పోలీసు ధ్వజం అమ్మకం ద్వారా సంగ్రహించిన నిధులను పోలీసు కుటుంబాల సంక్షేమానికి సమర్పిస్తున్నారని కొనియాడారు. జిల్లాలో 2024 ఏప్రిల్ నుంచి 2025 వరకు మొత్తం 37 మంది పోలీసు అధికారులు వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారన్నారు. వీరిలో పీఎస్‌ఐలు7 మంది, ఆర్‌ఎస్‌ఐలు 2, ఏఎస్‌ఐలు 13 మంది, ఏఆర్‌ఎస్‌ఐలు 9 మంది, సీడ్‌సీపీలు 3 తదితరులు పదవీ విరమణ పొందారన్నారు. జిల్లాలో ఉత్తమంగా పని చేసిన 178 పోలీసు అధికారులు, సిబ్బందికి రూ.లక్ష చొప్పున బహుమతి ఇచ్చామని గుర్తు చేశారు. పోలీసులు లేకుంటే సమాజంలో అశాంతి వాతావరణం, గొడవలు తలెత్తుతాయన్నారు. మిగిలిన శాఖల కన్నా పోలీసు వృత్తిలో పని చేయడం ఎంతో ఛాలెంజ్‌గా ఉంటుందన్నారు. సమాజం దృష్టి మనందరిపై ఉంటుందని, అలాంటి వృత్తిలో పని చేసే మనందరి అడుగులు ఆచితూచి మంచి నడతతో ముందుకెళ్లాలన్నారు. పలువురు పోలీసు అధికారులు కూడా తమ సందేశాన్ని వినిపించారు. కార్యక్రమంలో ఏఎస్పీ రవికుమార్, జైలు సూపరింటెండెంట్ లత, పోలీసు అధికారి తిప్పేస్వామి తదితరులు పాల్గొన్నారు.
విధి నిర్వహణలో సేవాభావం అవసరం
రాయచూరు రూరల్: పోలీసులు విధి నిర్వహణలో సేవా మనోభావాన్ని పెంపొందించుకోవాలని రిటైర్డ్ సీఐ హసన్ సాబ్ పేర్కొన్నారు. బుధవారం ఎస్పీ క్రీడా మైదానంలో పోలీస్ ధ్వజ దినోత్సవాన్ని ప్రారంభించి ఆయన మాట్లాడారు. పోలీస్ శాఖలో పేరు సంపాదించుకోవాలంటే ప్రజలకు సేవ చేయాలన్నారు. ప్రస్తుతం ప్రజల్లో శాఖపై నమ్మకం తగ్గిపోతోందన్నారు. క్రమశిక్షణతో విధులు నిర్వహించాలన్నారు. పోలీస్ సంక్షేమ నిధి నుంచి 2024–25లో 266 మందికి ఆరోగ్య భాగ్య పథకం కింద రూ.4 లక్షలు వ్యయం చేసినట్లు ఎస్పీ తెలిపారు. కార్యక్రమంలో బళ్లారి రేంజ్ ఐజీ లోకేష్ కుమార్, ఎస్పీ పుట్టమాదయ్య, ఏఎస్పీ హరీష్, డీఎస్పీలు దత్తాత్రేయ కర్నాడ్, తళవార్, సీఐ ఉమేష్ కాంబ్లే, ఎస్‌ఐ వైశాలి, చంద్రప్ప, నారాయణ, లక్ష్మి, నరసమ్మ తదితరులు పాల్గొన్నారు.
జిల్లా ఎస్పీ శోభారాణి వెల్లడి