రంజాన్ ఉపవాసంతో ఆత్మశుద్ధి
బళ్లారిఅర్బన్: పవిత్ర రంజాన్ ఉపవాస రోజుల్లో సాయంత్రం ఇఫ్తార్ విందులో ఉపవాసం చేసిన వ్రతదారుల ప్రార్థనలు, కోరికలను అల్లా స్వీకరించి పరిష్కరిస్తారని, రంజాన్ ఉపవాస దీక్షల వల్ల ఆత్మశుద్ధి అవుతుందని నగర ఎమ్మెల్యే నారా భరత్‌రెడ్డి అన్నారు. బలిజ భవన్ పక్కన ఖాళీ స్థలంలో రంజాన్ ఉపవాస దీక్షలను పురస్కరించుకొని ఎమ్మెల్యే అభిమానుల బృందం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఆయన పాల్గొని ముస్లిం బాంధవులకు స్వయంగా భోజనం వడ్డించి మాట్లాడారు. ఉపవాసం వల్ల ఆత్మశుద్ధితో పాటు పరోపకార గుణం తదితర మంచి అలవాట్లు అలవడతాయన్నారు. మత సామరస్యానికి ప్రతీక రంజాన్ అన్నారు. అంతకు ముందు ఎమ్మెల్యేకు జేసీబీతో భారీ గజమాలను వేసి స్వాగతించారు. రాము, రసూల్, దూనిద్, మెహబూబ్ పీరా, కోదండరాముడు, రాజన్న, ఖాదర్, అబ్దుల్, రజాక్, శివు, రాజా సాబ్, సుభాన్ షేక్ తదితరులు పాల్గొన్నారు.
సలాం బళ్లారికి ఎమ్మెల్యే శ్రీకారం
ప్రజా సమస్యలను ఆయా ప్రాంతాల్లో పర్యటించి స్వయంగా తెలుసుకొని వీలైనంత త్వరగా పరిష్కరించే దిశలో నగర ఎమ్మెల్యే నారా భరత్‌రెడ్డి నాంది పలికారు. ఆ మేరకు సలాం బళ్లారి పేరిట కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. బుధవారం 6వ వార్డులో సలాం బళ్లారిని ప్రారంభించి ఆయన మాట్లాడుతూ సమస్యలు ఏవైనా కానీ వారి ఇంటి ముంగిటకు వెళ్లి అంతేకాకుండా వారింట్లోనే భోజనం చేసి సమస్యలను వింటాను. ఎవరూ ఇకపై ఖర్చు పెట్టుకొని తన కార్యాలయానికి రాకూడదని ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టానన్నారు. తన నియోజకవర్గ పరిధిలోని అన్ని వార్డుల్లో పర్యటించి అక్కడే ఏ సమస్యలనైనా తెలుసుకొని అక్కడికక్కడే సంబంధిత అధికారులతో చర్చించి పరిష్కరించేందుకు శాయశక్తులా కృషి చేస్తానన్నారు.
రంజాన్ ఉపవాసంతో ఆత్మశుద్ధి