
యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా
రాయచూరు రూరల్: కళ్యాణ కర్ణాటకలోని రాయచూరు, కలబుర్గి, యాదగిరి జిల్లాల్లో యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా సాగుతోంది. దీనిపై అధికారులు, ప్రజా ప్రతినిధులు మౌనం దాల్చారు. జిల్లాలో తుంగభద్ర, కృష్ణా నది తీరంలోని ప్రాంతాల్లో రోజుకు వందలాది టిప్పర్ల ద్వారా ఇసుక రవాణా నిరాటంకంగా సాగుతోంది. జిల్లాలోని మాన్వి, రాయచూరు, దేవదుర్గ, యాదగిరి జిల్లాలోని సురపుర, యాదగిరి తాలూకాల్లో అక్రమంగా ఇసుక రవాణా నేటికీ కొనసాగుతోంది. జోళదహెడగి, కరిహళ్లి, పర్వతాపురల్లో కాంట్రాక్టర్లు స్టాక్ యార్డులకు నది నుంచి ఇసుకను దొంగతనంగా తరలించి నిల్వ చేసుకుంటున్నారని సామాజిక కార్యకర్తలు ఆరోపిస్తున్నారు.
యంత్రాలతో ఇసుక తవ్వకం
పట్టపగలే నదిలో పొక్లెయినర్లు, జేసీబీలతో పెద్ద ఎత్తున గుంతలు పడేలా తవ్వి ఇసుకను తరలిస్తున్నారు. రెండు వాహనాలకు రాయల్టీని పొంది మిగిలిన వాహనాలకు లేకుండా వందలాది టన్నుల ఇసుకను సరఫరా చేస్తున్నారు. కొంత మంది కాంట్రాక్టర్లు నేరుగా ఇసుకను తరలిస్తారు. దీంతో ప్రభుత్వానికి వచ్చే రూ.కోట్లాది ఆదాయంలో కోత పడుతోంది. ఈ విషయంలో జిల్లాధికారి, ఎస్పీ, తహసీల్దార్లు మౌనం వహిస్తున్నారు. శాసన సభ, లోక్‌సభ, జెడ్పీ సభ్యులు కుమ్మక్కు కావడంతో అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. అక్రమ ఇసుక రవాణా సరఫరా వల్ల నదుల స్వరూపం మారుతుందనే భయం ప్రజల్లో నెలకొంది.
పోలీస్ అధికారులపై దాడులు
ఇటీవల అక్రమంగా ఇసుకను రవాణా చేస్తున్న వాహనాలను అడ్డుకున్న పోలీస్ కానిస్టేబుల్‌ౖపై దాడి జరిగిన ఘటన మాన్విలో చోటు చేసుకుంది. మాన్వి తాలూకా చీకలపర్వి వద్ద తుంగభద్ర నదీ తీరం నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తుండగా నియంత్రించిన పోలీస్ కానిస్టేబుల్‌పై ఇసుక మాఫియా దాడి చేశారు. ఈ విషయంలో వాస్తవాల నిర్ధారణకు హైదరాబాద్ కర్ణాటక పోరాట సమితి నేత రాఘవేంద్ర కుష్టిగి తాజాగా తమ ప్రతినిధి బృందంతో వివిధ ప్రాంతాల్లో నిల్వ ఉంచిన అక్రమ ఇసుక మేటలను పరిశీలించారు.
ప్రభుత్వ ఖజానాకు రూ.కోట్లాది గండి
పట్టించుకోని అధికారులు, పాలకులు

యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా