శివాజీనగర: పలు సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న శాశ్వత వెనుకబడిన వర్గాల కమిషన్ ఆర్థిక, విద్యా, సామాజిక (కులగణన) నివేదికకు ఎట్టకేలకు మోక్షం లభించింది. ముఖ్యమంత్రి సిద్దరామయ్య అధ్యక్షతన విధానసౌధలోని మంత్రుల సభా భవనంలో శుక్రవారం జరిగిన మంత్రి మండలి సమావేశంలో కులగణన నివేదికను ప్రవేశపెట్టారు. కులగణన నివేదికపై ముందు జరిగే మంత్రి మండలి సమావేశంలో చర్చించి తీర్మానాలను చేపట్టాలని నిర్ణయించినట్లు తెలిసింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కులగణన నివేదికను అంగీకరించాలనే డిమాండ్లు వినిపించాయి. కుల గణన నివేదిక అమలుకు బలమైన సామాజిక వర్గాలు వ్యతిరేకతను వ్యక్తం చేశాయి. ఈ పరిణామాలన్నింటి మధ్య కులగణన నివేదిక శుక్రవారం మంత్రి మండలి సమావేశంలో ప్రవేశపెట్టారు. నివేదిక ముందు రూపురేఖలపై ముందు జరిగే మంత్రి మండలి సమావేశంలో తీర్మానించాలని మంత్రి మండలి నిర్ణయించినట్లు ఉన్నత వర్గాలు తెలిపాయి.
కేబినెట్ ముందుకు నివేదిక
శుక్రవారం జరిగిన మంత్రి మండలి సమావేశంలో వెనుకబడిన, ఎస్సీల సంక్షేమ మంత్రి శివరాజ్ తంగడగి కులగణన నివేదిక పత్రాలను తెరిచి మంత్రి మండలి సమావేశం ముందుంచారు. ఈ నివేదికపై సమావేశంలో సూచకప్రాయంగా శాఖ కార్యదర్శి వివరాలను ఇచ్చారని తెలిసింది. నివేదికను ప్రవేశపెట్టిన తరువాత ముందు జరిగే మంత్రి మండలి సమావేశంలో కూలంకుషంగా చర్చించి, దీనిపై తీర్మానించాలని మంత్రి మండలి సమావేశంలో నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. కులగణన వివరాలను రాష్ట్రంలో ఉన్న బలమైన సామాజిక వర్గాలైన ఒక్కలిగ, లింగాయిత, బ్రాహ్మణులు వ్యతిరేకతను వ్యక్తం చేశారు. ఈ సమీక్ష శాసీ్త్రయంగా జరగలేదు. నివేదికను ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదించరాదు. ఒకవేళ ప్రభుత్వం ఈ నివేదికను ఆమోదిస్తే బహిరంగ పోరాటం చేపడుతామని ఈ సముదాయ నాయకులు, స్వామీజీలు హెచ్చరించారు. రాష్ట్రంలో శాశ్వత వెనుకబడిన వర్గాల కమిషన్ అధ్యక్షుడైన జయప్రకాశ్ హెగ్డే 2024లో లోక్‌సభ ఎన్నికలకు ముందు రాష్ట్ర ప్రభుత్వానికి సీల్డ్ కవర్‌లో నివేదికను సమర్పించారు.
కేబినెట్ సమావేశంలో నివేదిక ప్రవేశం
తదుపరి భేటీలో చర్చించి నిర్ణయం
17న మంత్రి మండలి ప్రత్యేక సమావేశం
శుక్రవారం మంత్రి మండలిలో ప్రవేశపెట్టిన కులగణన నివేదికపై తగిన తీర్మానం తీసుకునేందుకు ఈనెల 17న మంత్రి మండలి ప్రత్యేక సమావేశం జరుగనుంది. ఆరోజు కులగణన నివేదికపై సమగ్రంగా చర్చించి ప్రభుత్వం తగిన తీర్మానాలను చేస్తుంది.
గతంలో 2015లో సిద్దరామయ్య తొలిసారిగా ముఖ్యమంత్రి అయినపుడు శాశ్వత వెనుకబడిన వర్గాలకు కులగణన జరిపేందుకు సూచించారు. ఆ ప్రకారం అప్పటి అధ్యక్షుడు హెచ్.కాంతరాజు సమీక్ష జరిపి నివేదికను సిద్ధం చేశారు. అయితే దానిని ప్రభుత్వానికి సమర్పించలేదు. ఆ తరువాత వచ్చిన కుమారస్వామి నేతృత్వపు సంకీర్ణ ప్రభుత్వం కులగణన నివేదిక స్వీకారానికి ఆసక్తి చూపించలేదు. బీజేపీ ప్రభుత్వం కూడా నివేదిక జారీ చేసేందుకు మనస్సు చేయలేదు. బీజేపీ అధికారావధిలో జయప్రకాశ్ హెగ్డేను శాశ్వత వెనుకబడిన వర్గాల అధ్యక్షుడిగా నియమించారు. సిద్దరామయ్య 2వ సారి ముఖ్యమంత్రి అయిన తరువాత శాశ్వత వెనుకబడిన వర్గాల అధ్యక్షుడు జయప్రకాశ్ హెగ్డే మాజీ అధ్యక్షుడు కాంతరాజు సేకరించిన దత్తాంశాల ఆధారంగా ప్రభుత్వానికి సీల్డ్ కవర్‌లో నివేదికను అందజేశారు. ఆ నివేదికను ఇప్పటి వరకు అంగీకరించలేదు. శుక్రవారం జరిగిన మంత్రి మండలి సమాశంలో నివేదికను ప్రవేశపెట్టారు. నివేదిక రూపురేఖలను తదుపరి జరిగే మంత్రి మండలి సమావేశంలో నిర్ణయించనున్నారు. ఈ అన్ని పరిణామాల మధ్య ముఖ్యమంత్రి సిద్దరామయ్య నేతృత్వపు ప్రభుత్వం కులగణన నివేదికను శుక్రవారం మంత్రి మండలి సమావేశంలో ప్రవేశపెట్టగా, భవిష్యత్తులో ఎలాంటి తీర్మానాలు జరుగుతాయనేది కుతూహలానికి దారి తీసింది.
2015లో కులగణనకు శ్రీకారం
2015లో కులగణనకు శ్రీకారం