
కర్ణాటక: గత శనివారం గోవా టూర్‌కి వెళ్లి అక్కడ నాలుగేళ్ల కొడుకును కిరాతకంగా హత్యచేసి బ్యాగులో తరలిస్తూ సోమవారం చిత్రదుర్గం జిల్లాలో పట్టుబడిన సీఈఓ సుచన సేథ్ ఉదంతంపై బెంగళూరులో అంతటా తీవ్ర విస్మయం వ్యక్తమవుతోంది. ఐటీ రంగంలో అగ్రస్థానంలో ఉన్న మహిళ ఇంత దారుణానికి పాల్పడుతుందని అనుకోలేదని ఐటీ ఉద్యోగులు, ఇటు నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. గొప్ప భవిష్యత్తున్న మహిళ చేజేతులా కటకటాల పాలైందనే జాలి కూడా వ్యక్తమైంది.
మైండ్‌ఫుల్ ల్యాబ్‌లో తనిఖీలు
బెంగళూరు నగరంలోని రెసిడెన్సీ రోడ్డులోని మైండ్‌ఫుల్ ఏఐ ల్యాబ్ ఆఫీసును బుధవారం ఉదయం గోవా పోలీసులు పరిశీలించి సమాచారం సేకరించారు. ఆమె ఈ కంపెనీ సీఈఓగా పనిచేస్తోంది. ఆమె భర్త వెంకట రామన్ నుంచి విడిగా ఉంటోంది. ఆమె రాచేనహళ్లిలో అపార్ట్‌మెంట్‌లో ఆరేళ్ల నుంచి నివాసం ఉన్నట్లు గుర్తించారు.
ఇంత ఘోరాన్ని ఊహించలేదు
బాలుని మృతదేహాన్ని తండ్రి వెంకట రామన్ చిత్రదుర్గం నుంచి బుధవారం తెల్లవారుజామున తీసుకొచ్చి బెంగళూరులోని శ్రీరాంపుర హరిశ్చంద్రఘాట్‌లో అంత్యక్రియలు చేశారు. మొదట సుచన ఉండే నివాసానికి తీసుకెళ్లి మళ్లీ యశవంతపుర సమీపంలోని బ్రిగేడ్ గేటువే రెసిడెన్సీలోని తన ఫ్లాట్‌కి తరలించారు. బంధుమిత్రులు సందర్శించాక ఉదయం అంత్యక్రియల్ని ముగించారు. తనపై వేధింపుల కేసులు పెట్టడంతో గత కొన్నేళ్లుగా భార్యకు దూరంగా ఉన్నానని వెంకట రామన్ చెప్పారు. కొడుకును చూడాలని వచ్చేవాడినని, ఇంత ఘోరం జరుగుతుందనుకోలేదని విలపించాడు. భార్యభర్తల గొడవ మధ్య చిన్నారి బాలుడు బలయ్యాడు.
దిండుతో అదిమి బాలుని హత్య!
= హిరియూరు ఆస్పత్రిలో పోస్టుమార్టం
సాక్షి, బళ్లారి: సుచన సేథ్ కొడుకు మృతదేహానికి చిత్రదుర్గం జిల్లా హిరియూరు ఆస్పత్రిలో వైద్యాధికారి డా. కుమార్‌నాయక్ ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం పోస్టుమార్టం నిర్వహించారు. దిండు, లేదా టవల్‌తో బాలునికి ఊపిరాడకుండా అదిమి చంపి ఉంటారని వైద్యులు పేర్కొన్నారు. ఇక గోవాలోని గదిలో రెండు దగ్గు మందు సీసాలు కనిపించాయి. వాటిని తాగించాక మత్తులోకి జారుకోగా హత్య చేసి ఉంటారని పోలీసులు చెప్పారు.
36 గంటల ముందే మరణం
పోస్టుమార్టంకు 36 గంటల ముందే చిన్నారి చనిపోయి ఉంటాడని వైద్యులు చెబుతున్నారు. పిల్లవాడు కావడం వల్ల పెద్దల మాదిరిగా మృతదేహం బిగుసుకుపోలేదని, సాధారణంగా 36 గంటల తర్వాత బిగుసుకుపోయే లక్షణాలు కనిపిస్తాయన్నారు. శరీరంపై దెబ్బలు, రక్తస్రావం ఏదీ లేదన్నారు.
ఆత్మహత్య చేసుకోవాలనుకుని..
గోవా ఉత్తర ప్రాంత ఎస్పీ నిథిన్ వల్సన్ మాట్లాడుతూ పిల్లాన్ని తాను చంపలేదని విచారణలో ఆమె చెబుతోందని అన్నారు. భర్తతో విడాకుల కేసులో కోర్టు ఉత్తర్వుల పట్ల సుచన చాలా అయిష్టంగా ఉన్నారు, ఆ కోర్టు ఉత్తర్వుల్లో ఏం ఉందో మేం పరిశీలిస్తామని అని ఆయన చెప్పారు. ఈ హత్యను చాలా పకడ్బందీగా నిర్వహించినట్లు తెలుస్తోందని పోలీసులు చెబుతున్నారు. బాలుని హత్య తరువాత సుచన కూడా కొంచెం మణికట్టు కోసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. ఆమె ఎందుకు బాలున్ని చంపాల్సి వచ్చిందనేది ఇంకా మిస్టరీగానే ఉంది.