సాక్షి బళ్లారి: మాతృత్వానికే మచ్చ తెచ్చిన కన్నతల్లి ఘాతుకం ఇది. కృత్రిమ మేధ స్టార్టప్ కంపెనీ ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈఓ) సుచనా సేథ్ తన నాలుగేళ్ల కుమారుడిని గోవాలో స్వయంగా హత్య చేసింది. కిరాతకంగా పసిబిడ్డ ప్రాణాలను బలితీసుకుంది. మృతదేహాన్ని మాయం చేసేందుకు ప్రయత్నించి చివరకు పోలీసులకు దొరికిపోయింది.
కన్నబిడ్డ శవాన్ని బ్యాగ్‌లో కుక్కి, ట్యాక్సీలో పొరుగు రాష్ట్రం కర్ణాటకకు చేరుకుంది. సోమవారం రాత్రి చిత్రదుర్గలో ఆమెను అరెస్టు చేసినట్లు గోవా పోలీసులు తెలిపారు. మంగళవారం గోవాకు తరలించి, న్యాయస్థానంలో హాజరుపర్చారు. నిందితురాలు సుచనా సేథ్‌ను తదుపరి విచారణ నిమిత్తం ఆరు రోజులపాటు పోలీసు కస్టడీకి అప్పగిస్తూ గోవా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆమె దురాగతానికి ఒడిగట్టడానికి కారణం ఏమిటన్న దానిపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
భర్త నుంచి విడిపోయి..
39 ఏళ్ల సుచనా సేథ్ మైండ్‌ఫుల్ ఏఐ ల్యాబ్ అనే స్టార్టప్ కంపెనీ సీఈఓగా పనిచేస్తోంది. 2021లో ‘టాప్ 100 బ్రిలియంట్ ఉమెన్ ఇన్ ఏఐ ఎథిక్స్’గా గుర్తింపు పొందింది. ఈ నెల 6న తన కుమారుడితో కలిసి ఉత్తర గోవాలోని కాండోలిమ్‌లో సర్విసు అపార్టుమెంట్‌లో అద్దెకు దిగింది. రెండు రోజులపాటు అక్కడే గడిపింది. ఓ పని కోసం తాను బెంగళూరు వెళ్లాల్సి ఉందని, ట్యాక్సీ ఏర్పాటు చేయాలని ఈ నెల 8న అపార్ట్ట్‌మెంట్ సిబ్బందిని కోరింది. ట్యాక్సీని అద్దెకు తీసుకోవడం కంటే విమానంలో వెళ్లడమే చౌక అని వారు సూచించగా, అందుకు నిరాకరించింది.
ట్యాక్సీ కావాలని పట్టుబట్టడంతో వారు ఆ మేరకు వాహనం ఏర్పాటు చేశారు. 8వ తేదీన తెల్లవారు జామునే ట్యాక్సీలో బెంగళూరుకు పెద్ద బ్యాగుతో బయలుదేరింది. అపార్ట్ట్‌మెంట్‌లో ఆమె గదిని శుభ్రం చేయడానికి వెళ్లిన సిబ్బందికి అక్కడ టవల్‌పై రక్తపు మరకలు కనిపించాయి. అంతేకాకుండా అపార్ట్ట్‌మెంట్ నుంచి వెళ్లిపోయినప్పుడు ఆమె వెంట కొడుకు లేడని గుర్తించారు. అనుమానంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు రంగంలోకి దిగి, సుచనా సేథ్‌తో ఫోన్‌లో మాట్లాడారు.
ఆ రక్తపు మరకలు తన పీరియడ్స్‌కు సంబంధించినవని, తన బిడ్డ ఉత్తర గోవాలోని మార్‌గావ్‌లో తన స్నేహితురాలి వద్ద ఉన్నాడని బదులిచ్చింది. అంతేకాకుండా సదరు మిత్రురాలి చిరునామా కూడా చెప్పింది. పోలీసులు వెంటనే అక్కడికి వెళ్లి విచారించగా, అది నకిలీ చిరునామా అని తేలింది. దాంతో ట్యాక్సీ డ్రైవర్‌ను ఫోన్‌లో సంప్రదించారు. కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లాలో ఉన్నట్లు అతడు చెప్పగా, స్థానిక పోలీసులను అప్రమత్తం చేశారు. పోలీసులు సుచనా సేథ్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఆమె వద్దనున్న బ్యాగ్‌ను తెరిచి చూడగా బాలుడి మృతదేహం కనిపించింది.
గోవా పోలీసులు చిత్రదుర్గ చేరుకొని, నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు. గోవాకు తరలించి, ఐపీసీ సెక్షన్ 302(హత్య), సెక్షన్ 201(సాక్ష్యాధారాలను ధ్వంసం చేయడం)తోపాటు గోవా చిల్డ్రన్స్ చట్టం కింద ఆమెపై కేసులు నమోదు చేశారు. భర్త నుంచి విడిపోయానని, విడాకుల కోసం ప్రయతి్నస్తున్నానని నిందితురాలు పేర్కొన్నట్లు పోలీసులు వెల్లడించారు.
పశ్చిమ బెంగాల్‌కు చెందిన సుచనా సేథ్ 2010లో కేరళకు చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకుంది. తొమ్మిదేళ్ల తర్వాత కుమారుడు జన్మించాడు. ఆ తర్వాత భార్యాభర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి. 2020లో దంపతులిద్దరు కోర్టు నుంచి అనుమతి తీసుకొని దూరంగా ఉంటున్నారు. ప్రతి ఆదివారం కుమారునితో కాసేపు తండ్రి గడిపేవాడు.
ఇది ఏమాత్రం ఇష్టంలేని కసాయి తల్లి.. కొడుకును చంపేయాలని, తద్వారా భర్తపై ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఆమె భర్త ప్రస్తుతం ఇండోనేషియాలో ఉన్నాడు. భార్య చేతిలో కుమారుడి మరణం గురించి అతడికి పోలీసులు సమాచారం అందించారు. ఇదిలా ఉండగా, బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం చిత్రదుర్గ ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం నివేదిక కోసం పోలీసులు ఎదురు చూస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment