గోవాలో కన్నకొడుకుని హతమార్చిన బెంగుళూరు సీఈఓ ఉదంతం దేశ వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. స్టార్టప్ కంపెనీకి సీఈఓ, ఆర్టిఫిషీయల్ ఇంటెలిజెన్స్‌లో మేధావి అయిన మహిళ నాలుగేళ్ల పసివాడిని గోవాలో అతి కిరాతకంగా చంపిన ఘటన ప్రతి ఒక్కరిని దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. అంతేగాక చిన్నారి మృతదేహాన్ని బ్యాగ్‌లో కుక్కి రహస్యంగా బెంగుళూరుకు తీసుకురావడాన్ని తలుచుకుంటేనే ఒళ్లు గగుర్పుడుస్తోంది
పనాజీ/ బెంగళూరు: నాలుగేళ్ల కుమారుడిని హత్య చేసిన కేసులో నిందితురాలిని చిత్రదుర్గ పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. కన్నతల్లి అంత కసాయిరాలుగా ఎందుకు మారింది.. పేగు బంధాన్ని తెంపుకొని కొడుకును హత్య చేయడానికి గల కారణాలేంటనే విషయాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి.
చిన్నారిని చంపేందుకు అదే కారణమా?
39 ఏళ్ల సుచనకు, ఆమె భర్త వెంకట్ రామన్‌కు మధ్య వివాదాలే చిన్నారి హత్యకు దారితీసినట్లు గోవా పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. సీఈఓకు భర్త వెంకట్ రామన్ మద్య గొడవలు రావడంతో ఇద్దరు విడిపోయారు. వీరి విడాకుల కేసు కోర్టులో నడుస్తోంది. అయితే కుమారుడిని భర్త నుంచిదూరంగా ఉంచేందుకు గోవా టూర్ ప్లాన్ చేసింది. గత శనివారం నార్త్ గోవాలోని బనియన్ గ్రాండ్ హోటల్‌లో దిగింది. తన కుమారుడితో కలిసి చెక్ ఇన్ అయ్యింది. అక్కడే గుట్టుచప్పుడు కాకుండా చిన్నారిని హతమార్చింది.
అనంతరం బెంగుళూరుకు ట్యాక్సీ బుక్ చేయాలని ఆమె హోటల్ సిబ్బందిని కోరింది. కొడుకుతో కలిసి హోటల్ లోపలికి వెళ్లిన మహిళా.. సోమవారం ఒంటరిగా బయటికి వెళ్లడాన్ని గమనించిన సిబ్బందికి అనుమానం రావడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. ఆ గదిని శుభ్రం చేసేందుకు వెళ్లిన సిబ్బంది.. అక్కడ రక్తపు మరకలను గుర్తించడంతో పోలీసులకు సమాచారం అందించారు.
సంబంధిత వార్త: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో అపర మేధావి.. ఎవరీ సుచనా సేథ్!
బ్యాగ్‌లో దాచి.. గోవా నుంచి కర్ణాటకకు..
ఇంతలో ఎవరికి అనుమానం రాకుండా కొడుకు మృతదేహాన్ని బ్యాగులో దాచిపెట్టిన మహిళ.. గోవా నుంచి కర్ణాటక వరకు ట్యాక్సీలో ప్రయాణించింది. మరోవైపు గోవా పోలీసులు ట్యాక్సీ డ్రైవర్‌కు కాల్ చేసి కుమారుడి గురించి చెప్పాలని సీఈవో సుచననాను అడిగారు. తన స్నేహితురాలి వద్ద కొడుకు ఉన్నాడని చెప్పి ఆమె అడ్రస్ ఇచ్చింది. అయితే ఆ అడ్రస్ ఫేక్ అని తెలుసుకున్న పోలీసులు మళ్లీ క్యాబ్ డ్రైవర్‌కు కాల్ చేసి సుచనాకు అర్థం కాకుండా ఉండేందుకు కొంకణి భాషలో మాట్లాడారు.
దగ్గరలో ఉన్న పోలీసు స్టేషన్‌కు వెళ్లాలంటూ ఆ డ్రైవర్‌కు పోలీసులు చెప్పడంతో అతడు తన కార్‌ను నేరుగా దగ్గర్లోని చిత్రదుర్గ పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లాడు. దీంతో చిత్రదుర్గలో సుచనాను పోలీసులు అరెస్టు చేశారు. ఆమె ప్రయాణిస్తున్న కారులో బాలుడి మృతదేహాన్ని గుర్తించారు. నేరం అంగీకరించిన మహిళను.. ఈ కేసులో విచారణ నిమిత్తం పోలీసులు మళ్లీ గోవాకు తీసుకెళ్లారు.
ఎవరీ సుచనా..
లింక్డ్‌ఇన్ ఫ్రొఫైల్‌లోని వివరాల ప్రకారం.. బెంగళూరుకు చెందిన సుచన.. కలకత్తాలోని యూనివర్సిటీ నుంచి ఫిజిక్స్‌లో మాస్టర్స్ పూర్తి చేసింది. ఆస్ట్రోఫిజిక్స్‌తో పాటు ప్లాస్మా ఫిజిక్స్‌లో నైపుణ్యం సాధించింది. అదే విధంగా సంసృతంలో పీజీ పట్టా అందుకుంది. తరువాత ఆర్టిఫిషీయల్ ఇంటెలిజెన్స్, డేటా సైంటిస్ట్‌గా ప్రావిణ్యం పొందింది. ఈ రంగంలో ఆమెకు 12 సంవత్సరాల అనుభవం ఉంది. ఈ క్రమంలో 2020లో మైండ్‌ఫుల్ ఏఐ ల్యాబ్ అనే స్టార్టప్ కంపెనీని స్థాపించి.. దానికి సీఈవోగా వ్యవహరిస్తోంది. కాగా 100 బ్రిలియంట్ వుమెన్ ఇన్ ఏఐ ఎథిక్స్ ఫర్ 2021లో సుచనా టాప్ ప్లేస్‌లో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment