ఖమ్మం: జిల్లాలో ఎండ వేడి అగ్నిగుండాన్ని తలపించింది. ఉష్ణోగ్రతలు శుక్రవారం తారాస్థాయికి చేరడంతో నేలకొండపల్లి, ముదిగొండ, సత్తుపల్లి మండలాలు నిప్పుల కుంపటిలా మారాయి. ఇందులో నేలకొండపల్లిలో 46.5, ముదిగొండ మండలం బాణాపురం, పమ్మిలో 46.2, సత్తుపల్లిలో 45.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఖమ్మం పరిసర ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. నైరుతి రుతుపవనాలు ఆలస్యమవుతుండటంతో వాతావరణంలో మార్పు కనిపించకపోగా, ప్రజలు ఎండ వేడి, వడగాలులతో ఇబ్బంది పడుతున్నారు.
ఉదయం 8 గంటల నుంచే ఉష్ణోగ్రతలు, వడగాలుల ప్రభావం చూపుతున్నాయి. పది గంటల తర్వాత ఇళ్ల నుంచి బయటకు వచ్చే పరిస్థితి కానరావడం లేదు. దీంతో పగటి వేళ ఎక్కడ చూసినా రహదారులు నిర్మానుష్యంగా ఉంటున్నాయి. ఇళ్లకే పరిమితమైన ప్రజలు ఉక్కపోత నుంచి ఉపశమనం కోసం ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలను వినియోగిస్తుండడంతో విద్యుత్ వినియోగం గణనీయంగా పెరిగింది. జిల్లాకు 4.34 మిలియన్ యూనిట్ల విద్యుత్ కోటా ఉండగా, వారం రోజులుగా 5 మిలియన్ల మేర విద్యుత్ వినియోగం నమోదవుతోందని అధికారులు తెలిపారు.
కాగా, శనివారం పల్లెగూడెం(ఖమ్మం రూరల్ మండలం), పెనుబల్లిలో 44.9, ఖానాపురం(ఖమ్మం అర్బన్), మధిరలో 44.8, తల్లాడలో 44.6, పెద్దగోపతి, ఎర్రుపాలెం, మధిర(ఏఆర్‌ఎస్), ముదిగొండ, కల్లూరు, సిరిపురంల్లో 44.5, వైరా, తిరుమలాయపాలెం, గేటు కారేపల్లి, గంగారంల్లో 44.3, తిమ్మారావుపేట, బచ్చోడు, కొనిజర్ల, చింతకానిలలో 44.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment