నేలకొండపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయం
నేలకొండపల్లి: పంచాయతీల్లో నిధుల్లేక పనులు ఎక్కడికక్కడే ఆగిపోయాయి. చెత్త తరలించే ట్రాక్టర్లు ఇంధనం నింపడానికి డబ్బులేవు. గుప్పెడు బ్లీచింగ్ పౌడర్ చల్లలేని పరిస్థితి నెలకొంది. 15వ ఆర్థిక సంఘం నిధులు, సాధా రణ నిధులను గత ప్రభుత్వం తీసుకోవడంతో ఈ పరిస్థితి తలెత్తుతోంది. గ్రామాల్లో పారిశుద్ధ్యం, వీధి దీపాలు, తాగునీటి నిర్వహణకు ముందుగా నిధులు ఖర్చు చేసి బిల్లులు పెట్టాల్సి ఉంటుంది. వీటితో పాటు మన ఊరు – మన బడి, పల్లె ప్రగతి పనులకు కూడా ప్రజాప్రతినిధులే ఖర్చుచేశారు. పనులు పూర్తయ్యాక అధికారులు పరిశీలించాల్సి ఉంది.
బిల్లులు కార్యదర్శులు ఖజానాకు అప్‌లోడ్ చేసిన తరువాత కార్యదర్శి, సర్పంచ్‌లు సంయుక్తంగా సంతకం చేసి నిధులు తీసుకోవాల్సి ఉంటుంది. ఖజానాలో ఏడాదికి పైగా సరిపడా నిధుల్లేక సర్పంచ్‌లు, అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. పంచాయతీల్లో చిన్న సమస్యల పరిష్కారానికి ఉపయోగించే సాధారణ నిధులు (జనరల్ ఫండ్) సైతం లేక సర్పంచ్‌లు ఏమీ చేయలేకపోతున్నారు. ఖమ్మం జిల్లాలో 589, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 479 గ్రామ పంచాయతీల్లో చాలామంది సర్పంచ్‌లు రూ.లక్షలు అప్పు చేసి అభివృద్ధి పనులు చేశారు. కొన్ని చోట్ల చెక్కులు పంపించినప్పటికీ పాసింగ్ కాక నానా అవస్థలు పడుతున్నారు. ఉమ్మడి జిల్లాలో రూ.కోట్ల పెండింగ్ బిల్లుల వస్తాయా? లేదా అనే అనుమానంతో సర్పంచ్‌లు ఆందోళన చెందుతున్నారు.
కౌంట్‌డౌన్ ప్రారంభం..
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని గ్రామ పంచాయతీ సర్పంచ్‌లకు పదవీ కాలం ముగిసే గడువు దగ్గరకు వచ్చింది. జవనరి 31తో వారి పదవీ కాలం అయిపోతుండటంతో చేసిన పనులకు బిల్లుల పరిస్థితి ఏమిటో అర్థం కాక ఆందోళన చెందుతున్నారు. పాలకవర్గాలు ఏర్పడిన తరువాత కరోనా వెంటాడి రెండేళ్ల పాటు ఏమీ చేయలేని పరిస్థితిలో సర్పంచ్‌లు ఉన్నారు. మిగతా సమయంలో అప్పటి పాలకులు పంచాయతీలను చిన్న చూపు చూశారని సర్పంచ్‌లు మండిపడుతున్నారు. ఒక పక్క పాలకవర్గాల గడువు ముంచుకొస్తోంది.
కేవలం 41 రోజులు మాత్రమే గడువు ఉంది. ప్రతీ పంచాయతీ సర్పంచ్ అప్పులు చేసి అభివృద్ధి చేసిన వాటికి బిల్లులు రాకపోవటంతో ఆందోళన చెందుతున్నారు. ఈలోగా బిల్లుల బకాయిలు చెల్లించకుంటే ఎన్నికల తరువాత కొత్త, పాత వారికి మధ్య భేదాభిప్రాయాలతో పల్లెల్లో మరో పంచాయితీ మొదలయ్యే అవకాశాలు ఉంటాయిని పలువురు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment