
ఈసారి వచ్చినట్టేనా?!
సాక్షిప్రతినిధి, ఖమ్మం: రేషన్‌కార్డు కోసం నిరుపేదలు ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఒక కార్డు కూడా ఇవ్వకపోగా.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏడాది గడిచినా ఆ ఊసెత్తడం లేదు. తాజాగా పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చేసిన ప్రకటన దరఖాస్తుదారుల్లో ఆశలు నింపుతోంది. సంక్రాంతి తర్వాత కార్డుల జారీ ఉంటుందని ప్రకటించగా ఈసారి తప్పక కార్డులు వస్తాయని నిరుపేదలు ఆశిస్తున్నారు. కాగా, జిల్లాలో పలు దఫాలుగా 48,113 మంది రేషన్‌కార్డుల కోసం దరఖాస్తు చేసుకోగా, ఇందులో 8,876 దరఖాస్తుల పరిశీలన కూడా పూర్తయింది.
ప్రామాణికం కాదంటూనే..
ప్రభుత్వం పథకాల అమలులో రేషన్‌కార్డు ప్రామాణికం కాదని చెబుతోంది. అయినప్పటికీ ప్రతీ దరఖాస్తుకు రేషన్‌కార్డు జిరాక్స్ అడుగుతున్నారు. ఇక గత ప్రభుత్వ హయాంలో కొత్త రేషన్‌కార్డులు జారీచేయకపోవడంతో అర్హులైన అనేకమంది పేదలకు ప్రభుత్వ పథకాలు దరి చేరడం లేదు. ముఖ్యమంత్రి సహాయ నిధి, ఆదాయ ధ్రువీకరణపత్రాలు, ప్రభుత్వ కార్యాలయాల ద్వారా జారీ అయ్యే ధ్రువీకరణ పత్రాల దరఖాస్తులకు రేషన్‌కార్డులనే అడుగుతున్నారు. ఈక్రమాన సంక్రాంతి తర్వాత తెల్లరేషన్‌కార్డులు మంజూరు చేస్తామని చేసిన మంత్రి ఉత్తమ్ ప్రకటనతో తమ కష్టాలకు చెక్ పడినట్లేనని పేదల్లో అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఉపసంఘం నివేదిక ఆధారంగా..
రేషన్‌కార్డుల జారీపై చర్చించి విధివిదానాలు రూపొందించేందుకు ప్రభుత్వం మంత్రులతో ఉప సంఘం వేసింది. రేషన్‌కార్డుల జారీ ప్రక్రియకు సంబంధించి అర్హతలను ఈ కమిటీ నిర్ణయించగా అర్హతలపై దరఖాస్తుదారుల్లో ఉత్కంఠ నెలకొంది. రేషన్‌కార్డుల జారీ కోసం సుప్రీంకోర్టుకు సక్సేనా కమిటీ సమర్పించిన సిఫారసులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, రాజ్యసభ, లోక్‌సభ సభ్యుల సూచనలను పరిగణనలోకి తీసుకుని అర్హతలను ఉపసంఘం నిర్ణయించినట్లు చెబుతున్నారు. సంక్రాంతి తర్వాత ఎందరికి రేషన్‌కార్డులు వస్తాయి.. పాత రేషన్‌కార్డులను కూడా స్మార్ట్‌కార్డులుగా మారుస్తారా.. లేక పాతవే కొనసాగిస్తారా అనేది తేలే అవకాశముంది.
ఐదేళ్లుగా ఎదురుచూస్తున్నాం..
రేషన్‌కార్డు కోసం ఐదేళ్లుగా ఎదురు చూస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ప్రజా పాలన సభలో దరఖాస్తు చేసుకున్నా. మా కుటుంబంలో నేను, నా భర్త, కుమారుడు ఉన్నాం. కార్డు లేకపోవడంతో ప్రభుత్వం నుంచి సంక్షేమ పథకాలు అందడం లేదు. ఏ పథకమైనా ముందు రేషన్ కార్డే అడుగుతున్నారు. దీంతో అన్నిచోట్లా నష్టపోతున్నాం. ఈసారైనా కార్డు వస్తుందని అనుకుంటున్నా.
– చల్లా రాజేశ్వరి, తల్లాడ
రేషన్‌కార్డు దరఖాస్తుదారుల్లో ఆశలు
ఏళ్లుగా ఎదురుచూస్తున్న పేద ప్రజలు
తాజాగా మంత్రి ఉత్తమ్ ప్రకటనతో తప్పక వస్తాయని భావన
జిల్లాలో ఇప్పటివరకు 48,113 మంది దరఖాస్తులు
జిల్లాలో రేషన్ షాపులు, కార్డుల వివరాలు
రేషన్ దుకాణాలు 748
అంత్యోదయ కార్డులు 27,276
ఆహార భద్రత కార్డులు 3,83,868
అన్నపూర్ణ కార్డులు 03
మొత్తం రేషన్ కార్డులు 4,11,147
లబ్ధిదారులు 11,29,235
షాపులకు కేటాయించే
బియ్యం 2,73,824 కేజీలు
కార్డుల కోసం వచ్చిన
దరఖాస్తులు 48,113
వివిధ దశల్లో ఉన్నవి 38,494
అప్రూవ్ అయినవి 8,876
తిరస్కరించినవి 743
అనుమానాలెన్నో..
గత పదేళ్ల నుంచి రేషన్‌కార్డుల కోసం పలువురు దరఖాస్తు చేసుకుంటూనే ఉన్నారు. అలాగే, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజాపాలన సభల్లో మరోమారు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో ఏ దరఖాస్తును ప్రామాణికంగా తీసుకుంటారనేది స్పష్టంగా తెలియడం లేదు. లేకపోతే సంక్రాంతి తర్వాత మరోసారి దరఖాస్తు చేసుకోమంటారా అన్న సందేహాలు కూడా తలెత్తుతున్నాయి. మరోవైపు స్మార్ట్‌కార్డుల రూపంలో తెల్ల రేషన్‌కార్డులు ఇస్తామని చెబుతుండగా.. వీటి వల్ల ఏమేం ఉపయోగాలు ఉంటాయో తేలాల్సి ఉంది. గతంలో మాదిరిగానే ఆదాయ పరిమితి ఉంటుందా, మరింత తగ్గిస్తారా అన్న అంశంపైనా స్పష్టత రావాల్సి ఉంది.

ఈసారి వచ్చినట్టేనా?!

ఈసారి వచ్చినట్టేనా?!
Comments
Please login to add a commentAdd a comment