
భూగర్భగనుల్లో నష్టాల పరంపర
● నివారణపై సింగరేణి అధికారుల దృష్టి ● యంత్రాల పనిగంటలు పెంచడంపై ఆదేశాలు ● అందరూ 8గంటల పాటు పనిచేస్తేనే లక్ష్య సాధన
సింగరేణి(కొత్తగూడెం): సింగరేణిలోని ఓసీల్లో బొగ్గు ఉత్పత్తి లక్ష్యం మేరకు జరుగుతున్నా భూగర్భ గనుల్లో అందుకు విరుద్ధమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఏళ్ల తరబడి భూగర్భగనుల్లో ఆశించిన మేరకు ఉత్పత్తి నమోదు కాక నష్టాలు ఎదురవుతుండగా యాజమాన్యం నష్టనివారణ చర్యలపై దృష్టి సారించింది. ప్రతీ టన్ను బొగ్గు ఉత్పత్తికి అంతా కలిపి రూ.9వేల వరకు వ్యయం అవుతుండగా, మార్కెట్‌లో రూ.3,500కు మించి రావడం లేదు. ఫలితంగా దాదాపు రూ.5,500 మేర ప్రతీ టన్నుకు నష్టం వాటిల్లుతోంది. సింగరేణి వ్యాప్తంగా 22 భూగర్భగనుల్లో ఇదే పరిస్థితి నెలకొంది. గడిచిన ఐదేళ్లలో భూగర్భ గనుల ద్వారా 3,55.65 లక్షల టన్నుల ఉత్పత్తి చేయగా, రూ.14,198 కోట్ల నష్టం వాటిల్లినట్లు అంచనా.
ఉత్పత్తి పెరిగితేనే తగ్గనున్న నష్టాలు
2024–25 ఆర్థిక సంవత్సరం నవంబర్ వరకు భూగర్బగనుల్లో 4,83,500 లక్షల టన్నుల లక్ష్యానికి గాను 3,76,471 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి(78 శాతం) నమోదైంది. ఈ లెక్కల ప్రకారం ఆర్థిక సంవత్సరం చివరి నాటికి మరో 28.14 టన్నులు సాధిస్తే, టన్నుకు రూ.8,820 వ్యయమవుతుందని అంచనా. ఈ బొగ్గును రూ.4,892 చొప్పున అమ్మగలిగినా టన్నుకు రూ.3,928 నష్టం వస్తుంది. మొత్తంగా సంస్థకు రూ.1,105 కోట్ల నష్టం ఎదురయ్యే అవకాశముంది. దీన్ని సరిదిద్దేలా కంపెనీ నిర్దేశించిన లక్ష్యం మేరకు 4,83,500 టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించగలిగితే టన్ను వ్యయం రూ.7,770కు తగ్గి, నష్టం కూడా టన్నుకు రూ.2,916, మొత్తంగా రూ.985 కోట్లకు తగ్గుతుందని భావిస్తున్నారు.
ఎస్‌డీఎల్ పనిగంటలు పెంచితే..
సింగరేణిలోని 22 భూగర్భగనుల్లో 16 గనుల్లోనే ఎస్‌డీఎల్ యంత్రాలు పనిచేస్తున్నాయి. ఇవి రోజుకు ఎనిమిది గంటలు పనిచేస్తే రోజుకు ఒక్కో యంత్రం 142 టన్నుల ఉత్పత్తి చేయగలుగుతాయి. కానీ ప్రస్తుతం ఆరు గంటలే పనిచేస్తుండడంతో ఉత్పత్తి ఆశించిన మేర సాగడం లేదు. ఈనేపథ్యాన యంత్రాలతో మరో రెండు గంటలు పనిచేయిస్తే రోజుకు 142 టన్నుల ఉత్పత్తి నమోదవుతుంది. అలాగే, ఉద్యోగులు, సిబ్బంది సైతం ఎనిమిది గంటల పాటు పనిచేస్తేనే నష్టనివారణ సాధ్యమవుతుందని చెబుతున్నారు.
స్థితిగతులను వివరించేందుకు సమావేశాలు..
ఉత్పత్తి వ్యయం తగ్గించడం, బొగ్గు ఉత్పత్తి, రవాణా, ఉత్పాదకతను పెంచడంతో పాటు ప్రస్తుత స్థితిగతులను వివరించేందుకు మల్టీ డిపార్ట్‌మెంట్ సమావేశాలు నిర్వహించాం. సంస్థ ఉద్యోగలంతా చిత్తశుద్ధితో విధులు నిర్వర్తించాలని సూచించాం. గత అక్టోబర్‌లో నిర్వహించిన సహపంక్తి భోజనాల ద్వారా కార్మికుల్లో కొంత మార్పు కనిపించింది. మళ్లీ ఇప్పుడు మల్టీ డిపార్ట్‌మెంట్ సమావేశాల ద్వారా ఇంకొంత మార్పు వస్తుందని ఆశిస్తున్నాం. – శాలేంరాజు,
కొత్తగూడెం ఏరియా జీఎం
గత ఐదేళ్లలో భూగర్భగనుల్లో ఉత్పత్తి, నష్టాల వివరాలు
ఏడాది భూగర్భ గనుల్లో ఉత్పత్తి ఉత్పత్తి వ్యయం అమ్మకం ధర నష్టం మొత్తం నష్టం
(లక్షల టన్నుల్లో) (టన్నుకు రూ.ల్లో) (టన్నుకు రూ.ల్లో) (టన్నుకు రూ.ల్లో) (రూ.కోట్లలో)
2019–20 86.65 5,413 3,135 2,325 1,979
2020–21 45.15 9,155 2,935 6,220 2,736
2021–22 64.51 8,210 3,300 4,910 3,145
2022–23 71.99 7,451 4,088 3,363 2,421
2023–24 59.31 9,368 4,628 4,740 2,812
2024–25 28.14 8,820 4,842 3,928 1,105

భూగర్భగనుల్లో నష్టాల పరంపర
Comments
Please login to add a commentAdd a comment