కరకట్టకు బ్రిడ్జి బ్రేక్!
వచ్చే వర్షాకాలంలోనూ
తప్పని వరద ముప్పు
ఇటీవల కొత్తగూడెం అవతల వేపలగడ్డ గ్రామం వద్ద నిర్మించిన రైల్వే ఓవర్ బ్రిడ్జి తరహాలో శాశ్వత ప్రాతిపదికన నిర్మాణం ఉండాలని జాతీయ రహదారుల శాఖ సూచించినట్లు తెలిసింది. ఆ ప్రకారం అప్రోచ్ రోడ్లు, బ్రిడ్జి, బైపాస్ రోడ్ నిర్మాణాలకు బడ్జెట్ భారీగా పెరిగే అవకాశం ఉంది. కరకట్ట పొడిగింపునకు ప్రభుత్వం కేటాయించిన రూ. 38 కోట్లకు వ్యయం మూడు, నాలుగింతలయ్యే అవకాశం ఉంటుందని ఇరిగేషన్ అఽధికారులు పేర్కొంటున్నారు. దీనిపై ఆడిటింగ్, రాష్ట్ర కమిటీ విజిట్ సర్వేలు, ఇతర పనులు పూర్తయితే తప్ప ఆగిపోయిన పనులు తిరిగి ప్రారంభంకావు. ఈ నేపథ్యంలో రానున్న వర్షాకాలం సీజన్ నాటికీ కరకట్ట పూర్తయ్యే పరిస్థితి కనిపించటం లేదు. దిగువ ప్రాంత కాలనీ వాసులు మళ్లీ గోదావరి వరద ముంపు భయంతో ఆందోళన చెందుతున్నారు. ఉమ్మడి జిల్లా మంత్రులు దృష్టి సారించి పనులు త్వరితగతిన పూర్తయ్యేలా చూడాలని వేడుకుంటున్నారు.
భద్రాచలం: భద్రాచలంలో కూనవరం రోడ్డులో నిర్మిస్తున్న కరకట్ట పొడిగింపు పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఇరిగేషన్, జాతీయ రహదారుల శాఖల మధ్య సమన్వయ లోపం, డిజైన్ల మార్పుతో పనులు వేగవంతంగా సాగడంలేదు. ఫలితంగా వచ్చే వర్షాకాలంలో కూడా సుభాష్ నగర్, సీఆర్‌పీఎఫ్ క్యాంపు పరిసర ప్రాంతాలాలకు గోదావరి వరద ముప్పు తప్పేలా లేదు.
రూ.38 కోట్లతో కట్ట పొడిగింపు
గోదావరి వరద నుంచి భద్రాచలంలోని ముంపు కాలనీల ప్రజలను రక్షించేందుకు తీరం వెంబడి 2000లో సుమారు 7.5 కిలోమీటర్ల పొడవునా 10 నుంచి 15 మీటర్ల ఎత్తుతో కరకట్ట నిర్మించారు. కూనవరం రోడ్డులో సరస్వతి శిశు మందిర్ వద్ద ఓవర్ బ్రిడ్జి నిర్మించాల్సి ఉండటంతో అక్కడ రోడ్డుకు ఇరువైపులా 700 మీటర్ల దూరం కరకట్ట పనులు ఆగిపోయాయి. అనంతరం ప్రభుత్వాల నిర్లక్ష్యంతో ముందడుగు పడలేదు. మూడేళ్లు నుంచి గోదావరికి భారీ వరదలు రావడంతో కూనవరం రోడ్డు వైపు ఉన్న కాలనీలు పూర్తిగా ముంపునకు గురయ్యాయి. పలుమార్లు విన్నవించాక అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎన్నికల కోడ్ ముందు 700 మీటర్ల కరకట్ట నిర్మాణానికి రూ. 38 కోట్లు విడుదల చేసింది. అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా పనులు కొనసాగాయి.
ఎన్‌హెచ్‌పై రోడ్డు బ్రిడ్జి నిర్మాణమే పెద్ద సమస్య?
11 మీటర్ల ఎత్తుతో సాగుతున్న కరకట్ట పొడిగింపు పనులు గత జూన్ నాటికి పూర్తి కావాల్సి ఉంది. మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి పలుమార్లు పరిశీలించి త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. కానీ విజయవాడ–జగదల్‌పూర్ జాతీయ రహదారిపై సరస్వతి శిశు మందిర్‌వద్ద ఓవర్ బ్రిడ్జి నిర్మించాల్సి ఉండటంతో నెల రోజుల నుంచి పనులు పూర్తిగా నిలిచిపోయాయి. పనులను ఇరిగేషన్ శాఖ పర్యవేక్షిస్తుండగా, ఓవర్ బ్రిడ్జి, ఇరువైపులా అప్రోచ్ రోడ్, రిటైనింగ్ వాల్ నిర్మాణాలు పటిష్టగా చేపట్టాలని జాతీయ రహదారుల శాఖ సూచించింది. ఈ క్రమంలో రెండు శాఖల మధ్య డిజైన్ల మార్పులపై సంప్రదింపులు, సర్వేలు సాగుతూనే ఉన్నాయి. ఇటీవల ఎన్‌హెచ్ అధికారులు ప్రాథమికంగా అనుమతి ఇవ్వగా, బ్రిడ్జి నిర్మాణ ప్రాంతంలో మట్టి శాంపిల్స్‌ను సేకరించి హైదరాబాద్ ల్యాబ్‌కు పంపారు. ఆ మట్టి సాంద్రత నివేదిక వచ్చాకే బేస్‌మెంట్, కరకట్ట ఎత్తు నిర్ధారించాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు.
నిలిచిన గోదావరి కరకట్ట పొడిగింపు నిర్మాణ పనులు
జాతీయ రహదారిపై ఓవర్ బ్రిడ్జి నిర్మాణం ఆవశ్యం
భారీగా పెరగనున్న నిర్మాణ అంచనా వ్యయం
ఈ ఏడాది జూన్ నాటికీ పనులు పూర్తి కావడం కష్టమే
నివేదిక వచ్చాకే...
బ్రిడ్జి నిర్మాణ ప్రాంతంలో మట్టి శాంపిల్స్ సేకరించి పరీక్షలకు పంపాం. ఆ రిపోర్టులు అందాల్సి ఉంది. నిర్మాణ డిజైన్, బడ్జెట్ ప్రతిపాదనలను ప్రభుత్వం ముందుంచాం. గోదావరి వరదల నుంచి దిగువ ప్రాంత ప్రజలకు శాశ్వత రక్షణ ఉండేలా పనులు చేపడతాం. ప్రభుత్వం నుంచి ఇతర అనుమతులు రాగానే పనులు తిరిగి ప్రారంభమవుతాయి.
– రాంప్రసాద్, ఈఈ, ఇరిగేషన్ శాఖ భద్రాచలం
Comments
Please login to add a commentAdd a comment