ఇక సౌర వెలుగులు..
● ఉమ్మడి జిల్లాలో 280 మెగావాట్ల ప్లాంట్ల ఏర్పాటుకు సన్నాహాలు ● పీఎం కుసుమ్ పథకం కింద దరఖాస్తుల స్వీకరణ ● ఉమ్మడి జిల్లాలో 15 మెగావాట్లకు అందిన తొమ్మిది అప్లికేషన్లు ● మోడల్ గ్రామాల్లో కొనసాగుతున్న సర్వే
ఖమ్మంమయూరిసెంటర్: జిల్లాలో సౌర వెలుగులు నింపేందుకు అడుగులు ముందుకు పడుతున్నాయి. ప్రధానమంత్రి కిసాన్ ఉర్జా సురక్షా ఏవం ఉత్థాన్ మహాభియాన్ (పీఎం–కుసుమ్) పథకం కింద సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు చర్యలు వేగవంతం అవుతున్నాయి. సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు ఆసక్తి గల రైతులు, రైతు సంఘాలు, సహకార సంఘాలు, పంచాయతీలు, ఎస్‌హెచ్‌జీల నుంచి తెలంగాణ పునరుత్పాదక ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ (టీఎస్ రెడ్‌కో) అధికారులు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఇందు కోసం ప్రత్యేక వెబ్‌సైట్ రూపొందించి ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో ఈ పథకంపై విస్తృత ప్రచారం చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో 280 మెగావాట్ల ప్లాంట్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యం నిర్దేశించగా.. ఇందులో 200 మెగావాట్ల ప్లాంట్లను రైతులు, రైతు సంఘాలు, డెవలపర్స్‌తో ఏర్పాటు చేయించాలని నిర్ణయించారు. మరో 80 మెగావాట్ల ప్లాంట్లను స్వయం సహాయక సంఘాలకు కేటాయించనున్నారు. వీటితో పాటు ఉమ్మడి జిల్లాలో పైలట్ ప్రాజెక్ట్ కింద 31 గ్రామాలను సోలార్ మోడల్ విలేజ్‌లుగా ఎంపిక చేశారు. ఇప్పటివరకు పీఎం కుసుమ్ పథకం కింద ఉమ్మడి జిల్లాలో 15 మెగావాట్ల ప్లాంట్ల ఏర్పాటుకు తొమ్మిది దరఖాస్తులు అందాయని అధికారులు వెల్లడించారు. ఈనెల 22వ తేదీ వరకు అవకాశం ఉన్నందున ఈ సంఖ్య పెరుగుతుందని భావిస్తున్నారు.
ఎస్‌హెచ్‌జీలకు 90శాతం రుణాలు..
సౌర విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు ఒక మెగావాట్‌కు రూ.2.97 కోట్ల వ్యయం అవుతుందని రెడ్కో అంచనా వేసింది. ఎస్‌హెచ్‌జీలు 10 శాతం వాటా భరిస్తే, మిగిలిన 90 శాతాన్ని బ్యాంకులు రుణంగా ఇవ్వనున్నాయి. అంటే, మెగావాట్ ప్లాంటు ఏర్పాటుకు ఎస్‌హెచ్‌జీలు రూ.29.70 లక్షలు పెట్టుబడి పెడితే, బ్యాంకులు రూ.2.61 కోట్లు రుణంగా ఇవ్వనున్నాయి. ప్లాంట్ల ఏర్పాటుకు ఎస్‌హెచ్‌జీలకు ప్రభుత్వ, అటవీ, దేవాదాయ భూములను ప్రభుత్వం లీజుకు ఇవ్వనుంది. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్) ఆధ్వర్యంలో అత్యుత్తమ పనితీరు కలిగిన సంఘాలను ఎంపిక చేస్తున్నారు. రైతులైతే 30 శాతం పెట్టుబడి పెడితే 70 శాతం మూలధనాన్ని బ్యాంకులు రుణంగా ఇవ్వనున్నాయి. ఈ ప్లాంట్ల ఏర్పాటుకు 6 శాతం వడ్డీకే రూ.2 కోట్ల వరకు రుణం ఇచ్చేందుకు బ్యాంకులు ముందుకొస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.
మహిళా సంఘాల ఎంపిక చివరి దశకు
ఉమ్మడి జిల్లాలో 80 మెగావాట్ల ప్లాంట్ల ఏర్పాటుకు ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వగా.. అధికారులు స్థలాల పరిశీలన, సంఘాల ఎంపిక చేపట్టారు. తొలుత ఖమ్మం జిల్లాలో రెండు, భద్రాద్రి జిల్లాలో రెండు యూనిట్ల ఏర్పాటుకు సంఘాలను ఎంపిక చేయాలని ప్రభుత్వం ఆదేశించినట్లు తెలిసింది. మహిళా దినోత్సవమైన మార్చి 8న ప్లాంట్లకు శంకుస్థాపన చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం. దీంతో ఖమ్మం జిల్లాలోని ఏన్కూరు, మధిర, కల్లూరు, పెనుబల్లి, రేలకాయలపల్లి ప్రాంతాలను, భద్రాద్రి జిల్లాలో సుజాతనగర్, బైరాగులపాడు (దుమ్మగూడెం మండలం) ప్రాంతాలను సర్వే చేసి సెర్ప్ అధికారులకు నివేదిక పంపించారు. ఖమ్మం జిల్లాలో రెండు యూనిట్ల ఏర్పాటుకు స్థలాన్ని ఖరారు చేయాల్సి ఉంది.
ఆసక్తి పెరుగుతోంది..
ఉమ్మడి జిల్లాలో సోలార్ విద్యుత్ వినియోగానికి ప్రజల్లో ఆసక్తి కనిపిస్తోంది. ఇళ్లపై సోలార్ ప్యానల్ ఏర్పాటుకు పలువురు దరఖాస్తు చేస్తున్నారు. రైతులు, డెవలపర్లు, మహిళా సంఘాల వారి నుంచి అప్లికేషన్లు అందాయి. మోడల్ గ్రామాల్లో సర్వే పూర్తి చేస్తున్నాం. వీలైనన్ని ఎక్కువ సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నాం. ఆసక్తి ఉన్నవారు 63049 03919 నంబర్‌లో సంప్రదించవచ్చు.
– పొలిశెట్టి అజయ్‌కుమార్,
డీఎం, టీఎస్ రెడ్‌కో, ఖమ్మం
సొంత భూముల్లో విద్యుదుత్పత్తి..
సొంత భూములు కలిగిన రైతులు, డెవలపర్లు, రైతు సంఘాలు, ఇతర సంస్థలు ఆసక్తి చూపితే వారితో 0.5 మెగావాట్ నుంచి 2 మెగావాట్ల సోలార్ ప్లాంట్‌లు ఏర్పాటు చేయించేందుకు చర్యలు చేపట్టారు. ఖమ్మం జిల్లాలో 100 మెగావాట్లు, భద్రాద్రి జిల్లాలో 100 మెగావాట్ల ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఆర్థిక స్తోమత లేకుంటే డెవలపర్లకు తమ భూములను లీజుకు ఇచ్చి ప్లాంటు పెట్టించుకోవచ్చని రైతులకు సూచిస్తున్నారు. ఒక మెగావాట్ సౌర విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు నాలుగెకరాల స్థలం అవసరం. ఈ ప్లాంట్లు ఉత్పత్తి చేసి విద్యుత్‌ను రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు 25 ఏళ్ల పాటు కొనుగోలు చేస్తామని హామీ ఇస్తూ ఒప్పందం చేసుకోనున్నాయి. రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ) నిర్ణయించిన ధర ప్రకారం యూనిట్ విద్యుత్‌కు రూ.3.13 చొప్పున రైతులు, ఎస్‌హెచ్‌జీలకు డిస్కంలు చెల్లిస్తాయి. ఒక మెగావాట్ సౌర విద్యుత్ ప్లాంట్ ద్వారా ఏటా సగటున 16 లక్షల యూనిట్ల వరకు విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ప్లాంట్లు ఏర్పాటు చేసేవారికి రూ.45 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు ఆదాయం వస్తుందని అధికారులు అంచనా వేశారు.
Comments
Please login to add a commentAdd a comment