పరీక్షలా.. తగ్గేది లేదు..
●ప్రభుత్వ పాఠశాలల్లో ప్రత్యేక తరగతులు ●విద్యార్థుల్లో భయం పోగొట్టేలా అవగాహన సదస్సులు ●కలెక్టర్ ప్రత్యేక చొరవతో నిర్వహణ
ఖమ్మంసహకారనగర్: పదో తరగతి పరీక్షలు అంటే విద్యార్థుల్లో ఆందోళన ఉండటం సహజం. వారి ఆందోళన తొలగించేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తుంది. ఈ సారి ఫలితాలంటే ఆషామాషీగా కాకుండా ఉత్తీర్ణత శాతం పెంచాలనేది లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రతి పాఠశాలలో 100 శాతం ఫలితాలు సాధించే దిశగా విద్యాశాఖ ఉన్నతాధికారులు, కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే విద్యార్థుల్లో భయం పోగొట్టేలా అవగాహన కల్పిస్తున్నారు. ఇటు విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు కూడా పరీక్షలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. మార్చి 23 నుంచి పరీక్షలు జరగనున్న నేపథ్యంలో విద్యార్థులను సన్నద్ధం చేసేందుకు విద్యాశాఖ ముమ్మర కసరత్తు చేస్తోంది. విద్యార్థుల సిలబస్ పూర్తి చేయించడం.. వారితో రివిజన్ చేయించడంపై చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ప్రత్యేక తరగతులు కూడా నిర్వహిస్తున్నారు.
9 వేల మందికి పైగా విద్యార్థులు
జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు 282 ఉండగా.. వాటిల్లో 9,833 మంది విద్యార్థులు మార్చిలో జరిగే పదో తరగతి వార్షిక పరీక్షలు రాయనున్నారు. వారు మెరుగైన ఫలితాలు సాధించేందుకు కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ఆదేశాల మేరకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. ఉదయం గంట, సాయంత్రం ఒక గంట చొప్పున ప్రత్యేక తరగతులు ఏర్పాటు చేశారు. ఈ తరగతుల్లో విద్యార్థులను చదివించటంతో పాటు వారికున్న సందేహాలను నివృత్తి చేస్తున్నారు. దీంతో విద్యార్థులకు ప్రతి సబ్జెక్ట్‌పై పట్టువస్తుందని హెచ్‌ఎంలు చెబుతున్నారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నెల 1వ తేదీ నుంచి అల్పాహారం అందిస్తోంది. సుమారు రూ.55 లక్షలను అల్పాహారం కింద ప్రభుత్వం వెచ్చిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment