● పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయించిన బాధితులు ● విచారణ చేపట్టిన పోలీసులు
ఖమ్మంఅర్బన్/కారేపల్లి: దుబాయ్ కేంద్రంగా పనిచేసే ఓ ఆన్‌లైన్ సంస్థలో పెట్టుబడి పెడితే రెట్టింపు డబ్బు వస్తుందని ఆశ చూపారు. మరో ఇద్దరిని చేర్పిస్తే కమీషన్ రూపంలో డబ్బు వస్తుందని ఊదరగొట్టారు. మధ్యలో గోవా, బ్యాంకాక్ లాంటి ప్రదేశాలకు తీసుకెళ్తామని నమ్మబలికారు. తీరా చూస్తే ఉన్న డబ్బు పోయి మోసపోయామని గుర్తించి, చివరికి పోలీసులను ఆశ్రయించారు బాధితులు. కారేపల్లిలో ఓ ల్యాబ్ నిర్వాహకుడు రూ.4 లక్షలు పెట్టుబడి పెట్టగా.. టేకులపల్లికి చెందిన ఉపేందర్, కారేపల్లికి చెందిన రవికుమార్, రామనర్సయ్యతో పాటు మరో పదిమంది ఖమ్మానికి చెందిన ముగ్గురు వ్యక్తుల ద్వారా డిపాజిట్ చేసి, మోసపోయామని పోలీసులను ఆశ్రయించారు. కారేపల్లి ఎస్‌ఐ ఎన్.రాజారాంను వివరణ కోరగా.. మెటాప్లస్‌కు సంబంధించిన బాధితులు ఫిర్యాదు చేశారని, కేసు నమోదు చేసి ప్రాథమిక విచారణ చేపట్టామని చెప్పారు. ఇదే రకంగా మోసపోయిన కొందరు బాధితులు నగర ఏసీపీని కలిసి వివరించినట్లు తెలిసింది. ఏసీపీ సూచన మేరకు కొందరు బాధితులు ఖమ్మంఅర్బన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు సమాచారం. సీఐ భానుప్రకాష్‌ను వివరణ కోరగా కొందరు ఫిర్యాదు చేయగా విచారణ చేట్టామని, గోవా ట్రిప్‌నకు కూడా తీసుకెళ్లినట్లు సమాచారం ఉందని, వీటన్నింటిపై పూర్తిస్థాయిలో విచారణ చేస్తే అసలు విషయం తెలుస్తుందని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment