
వేమన పద్య గళార్చనకు స్పందన
సత్తుపల్లి: ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు ఏకకంఠంతో వేమన పద్యాలను చూడకుండా చదివి వినిపించడంతో జేవీఆర్ డిగ్రీ కళాశాల ప్రాంగణం పులకరించింది. అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా సత్తుపల్లి మండలానికి చెందిన ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు రెండు వందల మంది ఏకగళంతో వేమన పద్యాలను సోమవారం చదివి వినిపించారు. జేవీఆర్ డిగ్రీ కళాశాలలో గార్లపాటి, బొల్లేపల్లి స్మారక ట్రస్ట్ ఆధ్వర్యంలో తెలుగుశాఖ, ఆషా, లైవ్, సృజన స్వచ్ఛంద సంస్థలు, మండల విద్యాశాఖ సహకారంతో వేమన శతక పద్య గళార్చన పేరుతో ఈ కార్యక్రమం నిర్వహించగా జేవీఆర్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్.గోపి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఎంఈఓ ఎన్.రాజేశ్వరరావు మాట్లాడుతూ.. విద్యార్థుల్లో తెలుగు భాషపై ఆసక్తిని పెంపొందించే దిశగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి, ప్రోత్సహిస్తున్న నిర్వాహకులను, సహకరిస్తున్న సంస్థలతోపాటు కేవలం మూడు నెలల వ్యవధిలో విద్యార్థులను తీర్చిదిద్దిన ఉపాధ్యాయులు, పాఠశాలల యాజమాన్యాలను అభినందించారు. అనంతరం ఎమ్మెల్యే మట్టా రాగమయి తరఫున విద్యార్థులకు ప్రశంసాపత్రాలు, పాఠశాలలకు జ్ఞాపికలు అతిథుల చేతులమీదుగా అందించారు. కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా పలు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. ఏఎంసీ చైర్మన్ దోమ ఆనంద్‌బాబు, నిర్వాహకులు రామకృష్ణ, మధుసూదన్‌రాజు, కిశోర్‌రెడ్డి, నాగేశ్వరరావు, జేవీఆర్ డిగ్రీ కళాశాల తెలుగు విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ పూర్ణచందర్‌రావు, రిటైర్డ్ టీచర్ కళ్యాణశర్మ, అయ్యదేవర శేషగిరిరావు, మాలతి, మల్లికార్జున్‌రావు, రమణమూర్తి, గట్టే వాసు, గండ్ర కిశోర్‌కుమార్‌రెడ్డి, దొడ్డా కృష్ణయ్య, పసుపులేటి నాగేశ్వరరావు, పల్లం పిచ్చయ్య, ఖాసీం, ఎన్.ప్రసాద్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment