రేషన్‌కార్డు తొలగింపుపై ఆందోళన
నేలకొండపల్లి: కొత్తగా పెళ్లి అయిందని సాకు చూపి.. 26 ఏళ్ల కిందట పెళ్లయిన ఓ కుటుంబం రేషన్‌కార్డును తొలగించారు. దీనిపై బాధితులు గ్రీవెన్స్‌లో మొరపెట్టుకోగా.. చర్యలు చేపడుతామని తహసీల్దార్ హామీ ఇచ్చారు. మండలంలోని భైరవునిపల్లి గ్రామానికి చెందిన మల్లెబోయిన వీరబాబు – రాధిక దంపతులకు 26 ఏళ్ల కిందట వివాహం జరిగింది. వారికి ఇద్దరు కుమార్తెలుండగా.. పెద్ద కుమార్తెకు వివాహమైంది. వీరికి రేషన్ కార్డు ఉంది. జనవరి రేషన్ తీసుకున్న వీరు.. ఫిబ్రవరి కోటా తీసుకునేందుకు రేషన్ దుకాణానికి వెళ్లగా రేషన్ కార్డు తొలగించినట్లు తెలిసింది. రెవెన్యూ కార్యాలయానికి వెళ్లి విచారించగా.. కొత్తగా పెళ్లి కావడంతో రేషన్ కార్డు తొలిగించారని చెప్పడంతో ఖంగుతిన్నారు. తాము ఫిర్యాదు, దరఖాస్తు చేయకుండా ఎలా తొలగిస్తారని, అధికారుల ప్రమేయం లేకుండానే ఈ ప్రక్రియ ఎలా జరుగుతుందని బాధితులు సోమవారం గ్రీవెన్స్‌లో ఆందోళనకు దిగారు. కాగా, సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ జె.మానిక్‌రావు హమీ ఇవ్వటంతో బాధితులు ఆందోళన విరమించారు.
Comments
Please login to add a commentAdd a comment