పశువైద్య శాఖ జేడీగా వెంకటనారాయణ | - | Sakshi
Sakshi News home page

పశువైద్య శాఖ జేడీగా వెంకటనారాయణ

Published Tue, Feb 18 2025 12:45 AM | Last Updated on Tue, Feb 18 2025 12:44 AM

పశువైద్య శాఖ జేడీగా  వెంకటనారాయణ

పశువైద్య శాఖ జేడీగా వెంకటనారాయణ

ఖమ్మంవ్యవసాయం : జిల్లా పశు వైద్య, పశుసంవర్థక శాఖ జాయింట్‌ డైరెక్టర్‌గా డాక్టర్‌ కె. వెంకటనారాయణను నియమిస్తూ శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ సవ్యసాచి గోష్‌ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర పశుసంవర్థక శాఖలో డిప్యూటీ డైరెక్టర్లుగా పనిచేస్తున్న ఐదుగురికి జాయింట్‌ డైరెక్టర్లుగా పదోన్నతి కల్పించి వివిధ జిల్లాల్లో నియమించారు. ఈ క్రమంలో హన్మకొండ జిల్లాలో డిప్యూటీ డైరెక్టర్‌గా పనిచేస్తూ, ఖమ్మం పశుసంవర్థక శాఖ అధికారిగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న వెంకటనారాయణకు జేడీగా పదోన్నతి కల్పించి జిల్లాకు నియమించారు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు ఉద్యోగులు అభినందనలు తెలిపారు.

సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా

ఎమ్మెల్సీ అభ్యర్థి పూల రవీందర్‌

ఖమ్మం సహకారనగర్‌ : తనను ఎమ్మెల్సీగా గెలి పిస్తే ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి పోరాడుతానని వరంగల్‌–ఖమ్మం–నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి పూల రవీందర్‌ అన్నారు. నగరంలో సోమవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణ, ఉపాధ్యాయుల హక్కులను కాపాడేందుకే తాను బరిలో నిలిచానని చెప్పా రు. తెలంగాణ ఉద్యమకాలంలో ఉపాధ్యాయ జేఏసీ చైర్మన్‌గా వ్యవహరించానని, సకల జనుల సమ్మెలో పాల్గొని నాటి సీఎంను ఒప్పించి ఆన్‌డ్యూటీ సౌకర్యం కల్పించానని అన్నారు. పెండింగ్‌లో ఉన్న పలు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, తనను ఈ ఎన్నికల్లో గెలిపించాలని కోరారు.

కేఎంసీ అధికారులకు షోకాజ్‌ నోటీసులు !

ఖమ్మంమయూరిసెంటర్‌ : ఖమ్మం నగర పాలక సంస్థ అధికారులకు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌, ఇన్‌చార్జ్‌ కమిషనర్‌ శ్రీజ షోకాజ్‌ నోటీసులు జారీ చేసినట్లు తెలిసింది. ఆదివారం కేఎంసీలో అందుబాటులో లేరని, ఎలాంటి సమాచారం లేకుండా బయటకు వెళ్లారని అసిస్టెంట్‌ కమిషనర్‌ అహ్మద్‌ షఫీఉల్లా, శానిటరీ సూపర్‌వైజర్‌ సాంబయ్యకు నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. శానిటరీ సూపర్‌వైజర్‌ నోటీసు తీసుకోగా, అసిస్టెంట్‌ కమిషనర్‌కు ఇంకా అందలేదని తెలిసింది. ఆదివారం డంపింగ్‌యార్డ్‌లో వ్యర్థాలకు మంటలు అంటుకున్న సమయంలో సంబంధిత అధికారులు ఎవరూ లేకపోవడంతో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. సోమవారం ఉదయం డంపింగ్‌యార్డ్‌సు సందర్శించిన శ్రీజ అధికారులకు షోకాజ్‌ నోటీసుల జారీకి ఆదేశించినట్లు తెలిసింది.

సింగరేణిలో ఆరుగురు జీఎంల బదిలీ

సింగరేణి(కొత్తగూడెం): సింగరేణిలో వివిధ విభాగాల్లో పనిచేస్తున్న ఆరుగురు జీఎంలను బదిలీ చేస్తూ సోమవారం యాజమాన్యం ఉత్తర్వులు జారీ చేసింది. బెల్లంపల్లి జీఎం శ్రీనివాస్‌ను శ్రీరాంపూర్‌ ఏరియాకు, కార్పొరేట్‌ కాంట్రాక్ట్‌ మేనేజ్‌మెంట్‌ విభాగం జీఎం ఎం.విజయ్‌భాస్కర్‌ రెడ్డిని బెల్లంపల్లి ఏరియాకు, కార్పొరేట్‌ విభాగం జీఎం మేకల కనకయ్యను కొత్తగూడెం రీజియన్‌ క్వాలిటీ మేనేజ్‌మెంట్‌ విభాగానికి బదిలీ చేసింది. ఆర్జీ–3 ఏరియాలో అడిషనల్‌ జీఎం కొలిపాక నాగేశ్వరరావును అడ్రియాల ప్రాజెక్ట్‌ జీఎంగా, మందమర్రి ఏరియా కేకే గ్రూప్‌ ఆఫ్‌ మైన్స్‌లో అడిషనల్‌ జీఎం వి.రామదాసును కార్పొరేట్‌ బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ విభాగం జీఎంగా, ఆర్జీ–2 ఏరియాలో అడిషనల్‌ జీఎం మధుసూదన్‌ను కార్పొరేట్‌ కాంట్రాక్ట్‌ మేనేజ్‌మెంట్‌ జీఎంగా బదిలీ చేసింది.

ముత్తంగి అలంకరణలో రామయ్య

భద్రాచలం: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారు సోమవారం ముత్తంగి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చి కనువిందు చేశారు. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం నిత్యకల్యాణానికి బేడా మండపంలో కొలువుదీరిన స్వామివారికి విష్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement