మహిళా మార్ట్ ప్రత్యేకత చాటాలి
● ఘనంగా ఏర్పాట్లు చేయండి ● అధికారులకు కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సూచన
ఖమ్మంమయూరిసెంటర్ : మహిళా మార్ట్ ప్రత్యేకత చాటి చెప్పేలా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. నగరంలోని సీక్వెల్ రోడ్డులో మహిళా మార్ట్ ఏర్పాటు చేయనున్న భవనాన్ని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజతో కలిసి సోమవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మార్ట్ ముందు పార్కింగ్ సౌకర్యం కల్పించాలని, స్లైడింగ్ గేట్ ఏర్పాటు చేయాలని సూచించారు. మొదటిసారి మహిళలతో ఏర్పాటు చేస్తున్నామని, ఆ తర్వాత నగరంలో మరి కొన్నింటి ఏర్పాటుకు ప్రణాళిక రూపొందిస్తున్నామని వివరించారు. స్వశక్తి మహిళా సంఘాల వారు తయారుచేసిన పదార్థాలు, వస్తువులను ఇందులో విక్రయిస్తామని, ఉత్పత్తుల వివరాలు, తయారీ విధానం, అమ్మే మహిళ స్టోరీని డాక్యుమెంట్ చేస్తూ ప్రదర్శించాలని అన్నారు. మార్చి మొదటి వారంలోగా మహిళా మార్ట్ ఏర్పాటయ్యేలా కార్యాచరణ ఉండాలని, ప్రతి వస్తువుపై ‘మేడ్ ఇన్ ఖమ్మం’ అనే స్టిక్కర్ వేయాలని సూచించారు. మహిళా మార్ట్‌కు అవసరమైన నిధులను డీఆర్‌డీఏ ద్వారా రెండు రోజుల్లో అందిస్తామని చెప్పారు. కార్యక్రమంలో డీఆర్‌డీఓ సన్యాసయ్య, పీఆర్ ఈఈ వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
యూబీఐ బ్రాంచ్ ప్రారంభం
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(యూబీఐ) ముస్తఫానగర్ బ్రాంచ్‌ను కలెక్టర్ ముజిమ్మల్ ఖాన్ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. వివిధ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో యూబీఐ ముందుంటుందని చెప్పారు. అనంతరం స్వయ సహాయక సంఘాలకు, విశ్వకర్మ, పీఎంఈజీపీ లబ్ధిదారులకు కలెక్టర్ చేతుల మీదుగా మంజూరుపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో బ్యాంక్ ఖమ్మం రీజినల్ హెడ్ హనుమంత రెడ్డి, డిప్యూటీ రీజినల్ హెడ్ సర్వేశ్, సుధాకర్, బ్రాంచ్ మేనేజర్ సల్మా పర్వీన్, శ్రీరామ్ హిల్స్ హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడు బెల్లం మనోహర్ రావు తదితరులు పాల్గొన్నారు.
ఫిర్యాదులు పరిష్కరించండి
ఖమ్మం సహకారనగర్ : ప్రజలు అందించిన ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. సోమవారం ప్రజావాణి సందర్భంగా కలెక్టరేట్‌లో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజావాణిలో వచ్చిన అర్జీలను పరిశీలించి పెండింగ్‌లో లేకుండా పరిష్కరించాలని ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి, డీఆర్వో పద్మశ్రీ, డీఆర్‌డీఓ సన్యాసయ్య తదితరులు పాల్గొన్నారు. కాగా, బోనకల్ మండలం రావినూతల గ్రామానికి చెందిన ఎం.సీత పేదరికంలో ఉన్న తనకు ఖమ్మం దగ్గరలో ఉన్న బీసీ గురుకులంలో స్వీపర్ పోస్ట్ ఇప్పించాలని విన్నవించారు. తిరుమలాయపాలెం మండలం బచ్చోడు ప్రాథమిక పాఠశాలలో రూ.7.50 లక్షలతో టాయిలెట్ల మరమ్మతులు, విద్యుత్, నీటి వసతి పనులు చేశామని, తమకు అడ్వాన్స్‌గా ఇచ్చిన రూ.25 వేలు మినహా ఏ బిల్లూ రాలేదని, త్వరగా ఇప్పించాలని గ్రామానికి చెందిన బి.విజయ కోరారు.
Comments
Please login to add a commentAdd a comment