అదనపు నిర్మాణాలకు అడ్డుకట్ట
● అనుమతి లేని నిర్మాణదారులకు నోటీసులు ● ఖమ్మంలో పలుచోట్ల పనుల అడ్డగింత, కూల్చివేత
ఖమ్మంమయూరిసెంటర్: ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నానాటికీ స్థిరపడుతున్న జనాభాతో పాటే నగరం విస్తరిస్తోంది. పిల్లల చదువుతో పాటు వ్యాపారం, ఉద్యోగాలు, ఉపాధి కోసం నగరానికి వచ్చే పలువురు సొంతంగా ఇళ్ల నిర్మాణం చేపడుతున్నారు. మరికొందరు అద్దె ఇళ్లలో ఉంటుండగా డిమాండ్ పెరగడంతో యజమానులు అనుమతి లేకుండా అక్రమ నిర్మాణాలకు తెరలేపుతున్నారు. కేఎంసీ కొందరు అనుమతి తీసుకోకపోగా, ఇంకొందరు తీసుకుంటున్నా అనుమతికి మించి నిర్మాణాలు చేపడుతున్నారు. ఈ విషయమై అందిన ఫిర్యాదులను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్ సీరియస్‌గా తీసుకుని అనుమతులు లేని నిర్మాణాలను అడ్డుకోవాలని కేఎంసీ అధికారులకు సూచించారు. దీంతో కమిషనర్ అభిషేక్ అగస్త్య ఆదేశాలతో టౌన్ ప్లానింగ్ అధికారులు రంగంలోకి దిగారు.
పుట్టగొడుగుల్లా..
కేఎంసీలో విలీనమైన పంచాయతీలు, నగర శివారు ప్రాంతాల్లో కొత్తగా నిర్మాణాల సంఖ్య భారీగా ఉంటోంది. అలాగే, పాత భవనాలపై అదనపు నిర్మాణాలు చేపడుతున్నారు. అయితే, ఇందులో ఎన్నింటికి అనుమతి ఉందో అధికారులకు సైతం పరిస్థితి నెలకొంది. కేఎంసీలో టౌన్ ప్లానింగ్ సిబ్బంది తక్కువగా ఉండడం, ఉన్న వారికి అదనపు విధులు, ఎల్‌ఆర్‌ఎస్ పనులు ఉండడంతో అక్రమ నిర్మాణాలను పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. ఇదే అదునుగా నిర్మాణదారులు యథేచ్ఛగా నిర్మాణాలు పూర్తి చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి.
కూల్చివేతలే..
అనుమతుల లేకుండా నిర్మాణాలు చేపట్టవద్దని అధికా రులు ఇప్పటికే పలుమార్లు హెచ్చరించారు. కొందరికి నోటీసులను కూడా చేసినా ఫలితం కానరావడం లేదు. దీంతో టౌన్ ప్లానింగ్ అధికారులు అడుగు ముందుకేశారు. ఖమ్మంలోని పలు ప్రాంతాల్లో మంగళవారం టౌన్ ప్లానింగ్ ఏసీపీ వసుంధర నేతృత్వాన తనిఖీలు చేపట్టారు. కొన్నిచోట్ల అనుమతులు చేపడుతున్న నిర్మాణాలను అడ్డుకొని పిల్లర్లు, స్టాబ్‌లను కూల్చివేశారు. కొత్తగా నిర్మించే భవనాల పిల్లర్లను జేసీబీలతో తొలగించగా.. అపార్ట్‌మెంట్లు, ఇతర భవనాలపై నిర్మిస్తున్న పెంట్ హౌజ్‌ల గోడలను కూల్చివేశారు. అలాగే, స్లాబ్ వేసేందుకు సిద్ధంగా ఉన్న సెంట్రిగ్‌లను సైతం తొలగించారు. కాగా, కేఎంసీ అనుమతి లేకుండా నిర్మాణాలు చేపడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు అవగాహన కల్పించారు. అలాగే, నిర్మాణ అనుమతుల పత్రాలను పనుల వద్ద ప్రదర్శించాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment