● మహిళలను వేధించిన కేసు నమోదైందని బెదిరింపులు
ఖమ్మంఅర్బన్: సైబర్ మోసాలు రోజురోజుకు కొత్తపుంతలు తొక్కుతున్నాయి. అలాంటి ఘటనే సోమవారం వెలుగుచూసింది. ఖమ్మం మమత రోడ్డులో నివాసముండే ఓ వ్యక్తి ఖమ్మం రూరల్ మండలంలోని పంచాయతీరాజ్‌శాఖలో ఉద్యోగం చేస్తున్నాడు. ఆయనకు సోమవారం గుర్తు తెలియని నంబర్ నుంచి ఫోన్ రాగా హిందీ, ఇంగ్లిషు భాషల్లో మాట్లాడిన అవతలి వ్యక్తి బెంగళూరు పోలీసుగా చెప్పుకున్నాడు. సదరు ఉద్యోగి ఫోన్ నుంచి మహిళలకు ఫోన్ చేస్తూ వేధిస్తున్నారని, ఈ విషయమై అందిన ఫిర్యాదుతో ఎఫ్‌ఐఆర్ నమోదైందని చెబుతూ, సెటిల్‌మెంట్ కోసం డబ్బులు డిమాండ్ చేశాడు. దీంతో కంగారు పడిన సదరు ఉద్యోగి తన మిత్రుడు పోలీసు శాఖలో ఉండడంతో సమాచారం ఇచ్చాడు. అయితే, ఇది సైబర్ నేరగాళ్ల పనేనని పోలీసు ఉద్యోగి చెప్పడంతో తనకు వచ్చిన ఫోన్ నంబర్ వివరాలతో సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
చెల్లని చెక్కు కేసులో జైలుశిక్ష, జరిమానా
ఖమ్మం లీగల్: తీసుకున్న అప్పు చెల్లించే క్రమాన ఇచ్చిన చెక్కు చెల్లకపోవడంతో ఖమ్మం బుర్హాన్‌పురకు చెందిన బ్రహ్మదేవర సోమయ్యకు ఏడాది జైలుశిక్ష, రూ.5వేల జరిమానా విధిస్తూ ఖమ్మం ఆబ్కారీ కోర్టు న్యాయమూర్తి రాళ్లబండి శాంతిలత మంగళవారం తీర్పు చెప్పారు. ఖమ్మం కుమ్మరి బజార్‌కు చెందిన తవిడిశెట్టి యుగంధర్ వద్ద సోమయ్య 2015 ఫిబ్రవరి 15న రూ.10 లక్షల అప్పు తీసుకున్నాడు. ఈ అప్పు చెల్లించే క్రమాన 2017 ఫిబ్రవరి 14న రూ.14.80లక్షలకు చెక్కు జారీ చేశాడు. అయితే, ఆ చెక్కును బ్యాంకు ఖాతాలో జమ చేసేందుకు వెళ్లగా అప్పటికే సోమయ్య ఖాతా మూసివేశాడని తెలియడంతో కోర్టులో ప్రైవేట్ కేసు దాఖలు చేశాడు. ఈ కేసు విచారణలో ఆయనపై నేరం రుజువు కాగా ఏడాది జైలు శిక్షతో పాటు రూ.5వేల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు.
పట్టపగలే చోరీకి యత్నం,
బంధించిన స్థానికులు
ఖమ్మంఅర్బన్: ఖమ్మం రోటరీనగర్‌లో ఓ ఇంటి తాళాన్ని రోకలిబండతో పగులగొట్టేందుకు ప్రయత్నించిన వ్యక్తిని స్థానికులు పోలీసులకు పట్టించారు. మంగళవారం మధ్యాహ్నం సాగర్ ప్రధాన కాల్వ సమీపాన ఒక ఇంటికి తాళం వేసి ఉండగా గుర్తుతెలియని రోకలిబండతో పగులగొట్టేందుకు యత్నిస్తున్నాడు. ఈక్రమంలో శబ్దం విన్న స్థానికులు ఆయనను పట్టుకొని ఖమ్మం అర్బన్ పోలీసులకు అప్పగించారు. కాగా, చోరీకి యత్నించిన వ్యక్తి పాత నేరస్తుడని, గతంలో కొణిజర్ల స్టేషన్‌లో నమోదైన కేసులో వారెంట్ జారీ అయిందని పోలీసులు తెలిపారు. దీంతో నిందితుడిని కొణిజర్ల పోలీసులకు అప్పగించినట్లు ఖమ్మం అర్బన్ పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment