ఇల్లెందురూరల్ : అటవీ భూముల నుంచి మట్టి తరలించేందుకు రూ.30 వేలు లంచం తీసుకుంటూ ఎఫ్‌ఆర్‌ఓ, ఎఫ్‌బీఓ ఏసీబీ అధికారులకు చిక్కారు. ఈ ఘటన ఇల్లెందు మండలంలో మంగళవారం చోటుచేసుకుంది. ఏసీబీ డీఎస్పీ రమేష్ తెలిపిన వివరాల ప్రకారం.. గతేడాది సెప్టెంబర్‌లో కురిసిన భారీ వర్షాలతో పలు గ్రామాల్లో రహదారులు అధ్వానంగా మారాయి. పొలాలకు వెళ్లేందుకు ఇబ్బందిగా మారడంతో మండలంలోని బోడుతండా, కొమరారం, పోచారం తండా గ్రామాల రైతులు స్థానిక ఎమ్మెల్యే కోరం కనకయ్య ద్వారా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. దీంతో కలెక్టర్ ఫ్లడ్ రిలీఫ్ ఫండ్ నుంచి ఒక్కో గ్రామానికి రూ.1.50 లక్షల చొప్పున విడుదల చేశారు. పొలాలకు వెళ్లే రహదారులపై గ్రావెల్ పోసుకోవాలని సూచించారు. దీంతో బోడుతండాకు చెందిన ఓ రైతు ఈ ఏడాది సంక్రాంతి రోజున మట్టి కోసం అటవీ ప్రాంతానికి వెళ్లాడు. విషయం తెలుసుకున్న కొమురారం ఎఫ్‌ఆర్‌ఓ ఉదయ్‌కిరణ్, ఎఫ్‌బీఓ హరిలాల్ మట్టి తరలింపును అడ్డుకుని జేసీబీని స్వాధీనం చేసుకున్నారు. దీంతో రైతు రూ.15వేలు ముట్టజెప్పి జేసీబీని విడిపించుకున్నాడు. ఆపై మొరం తోలకానికి అనుమతి ఇవ్వాలని అటవీ అధికారులను వేడుకోగా రూ.50 వేలు లంచం డిమాండ్ చేశారు. చివరకు బతిమిలాడి రూ.20 వేలు చెల్లించి పనులు ప్రారంభించాడు. అయితే పొలాలకు నీరు పెడుతుండడంతో ఆ దారిలో ట్రాక్టర్ వెళ్లేందుకు వీల్లేక కొన్ని రోజులు పనులు నిలిపివేసి, వారం క్రితం మట్టి తోలుకుంటున్నట్టు అటవీ అధికారులకు సమాచారం ఇచ్చాడు. మిగిలిన రూ.30 వేలు ఇస్తేనే మట్టి తీసుకెళ్లాలని వారు ఖరాఖండిగా చెప్పడంతో రైతు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారి సూచన మేరకు మంగళవారం రూ.30 వేలు తీసుకుని అటవీ రేంజ్ కార్యాలయానికి వెళ్లాడు. అక్కడ ఎఫ్‌ఆర్‌ఓ సూచనతో ఎఫ్‌బీఓకు నగదు ఇస్తుండగా మాటువేసిన ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఇద్దరినీ అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment