ఖమ్మంఅర్బన్: రబీ సీజన్‌లో సాగు చేసిన పంటలకు రానున్న మూడు వారాలు కీలకమని, ఈ సమయాన సాగర్ ప్రాజెక్టుతో పాటు ఇతర ప్రాజెక్టులు, చెరువుల పరిధి ఆయకట్టుకు సక్రమంగా నీరు సరఫరా చేయడంపై దృష్టి సారించాలని జల వనరుల శాఖ ఉన్నతాధికారులు సూచించారు. ఈమేరకు జిల్లా చీఫ్ ఇంజనీర్‌కు మంగళవారం ఆదేశాలు అందాయి. ఆయకట్టుకు నీరు అందించే విషయంలో ఇంజనీర్లు రానున్న మూడు వారాలు అప్రమత్తంగా వ్యవహరించాలని అందులో సూచించారు. ఎక్కడా నీరు వృధా కాకుండా కాల్వలపై ఈఈలు రాత్రి వేళల్లో పెట్రోలింగ్ చేయాలని సూచించినట్లు తెలిసింది. ఇదే సమయాన వైరా రిజర్వాయర్ కింద స్థిరీకరించిన ఆయకట్టు సుమారు 17,390 ఎకరాలు ఉండగా, రబీ పంటలకు సాగర్ జలాలు అందించేలా ప్రణాళిక రూపొందించాలని అధికారులకు ఆదేశాలు అందాయి.
డిప్యూటీ సీఎం భట్టి సమీక్ష
మధిర నియోజకవర్గంలో జరుగుతున్న పనులపై జలవనరుల శాఖ అధికారులతో హైదరాబాద్‌లో మంగళవారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమీక్షించారు. ఖమ్మం జలవనరుల శాఖ సీఈ రమేష్, కల్లూరు ఎస్‌ఈ వాసంతితో పాటు పలువురు ఇంజనీర్లు పాల్గొనగా మండలాలు, ప్రాజెక్టుల వారీగా మంజూరైన నిధులు, ఇప్పటివరకు చేపట్టిన పనులపై సమీక్షించిన ఆయన సూచనలు చేసినట్లు తెలిసింది.
సాగునీటి సరఫరాలో అప్రమత్తత తప్పనిసరి
Comments
Please login to add a commentAdd a comment