వీ.వీ.పాలెంలో ఐసీఎంఆర్ – ఎన్‌సీడీ బృందం
రఘునాథపాలెం: మండలంలోని వీ.వీ.పాలెంలో ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్‌ను ఢిల్లీ నుండి వచ్చిన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్) ఎన్‌సీడీ బృందం సభ్యులు మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా రికార్డులను పరిశీలించాక కేంద్రం పరిధిలో బీపీ, షుగర్ బాధితులకు అందుతున్న వైద్యసేవలపై ఆరా తీశారు. ఎన్‌సీడీ పోర్టల్‌లో చేయాల్సిన మార్పులు, చేర్పులను గుర్తించేందుకు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ఈ బృందం రోహిత్, మాలతి తదితరులు ఉండగా హెల్త్ ఎడ్యుకేటర్ శారద, ఉద్యోగులు మౌనిక, తాల్లూరి శ్రీకాంత్, పద్మ, మేడా పుష్పావతి, పర్వీన్ పాల్గొన్నారు.
కూసుమంచి
ఫైర్ ఆఫీసర్ సస్పెన్షన్
కూసుమంచి: కూసుమంచి ఫైర్ స్టేషన్ ఆఫీసర్ మోహన్‌రావును సస్పెండ్ చేస్తూ మంగళవారం ఉత్వర్వులు జారీ అయ్యాయి. ఇక్కడి ఫైర్‌మెన్ నాగేందర్ తనపై ఫైర్ ఆఫీసర్ విధుల విషయంలో కక్ష్యసాధింపు చర్యలకు పాల్పడడమే కాక దురుసుగా ప్రవర్తిస్తున్నాడని ఫిర్యాదు చేశాడు. దీంతో ప్రాథమిక విచారణ అనంతరం నాగేందర్‌ను సస్పెండ్ చేశామని జిల్లా ఫైర్ ఆఫీసర్ అజయ్‌కుమార్ తెలిపారు. అయితే, పూర్తిస్థాయి విచారణ కొనసాగిస్తామని వెల్లడించారు.
మిర్చి కొనుగోళ్లు, ధరలపై ఇంటెలిజెన్స్ ఆరా
● రైతులు, మార్కెట్‌వర్గాలతో మాట్లాడిన అధికారులు
ఖమ్మంవ్యవసాయం: ఖమ్మం మార్కెట్‌లో మిర్చి క్రయవిక్రయాలు, ధరలపై ఇంటెలిజెన్స్ వర్గాలు ఆరా తీశాయి. రాష్ట్రంలో అత్యధికంగా మిర్చి కొనుగోళ్లు ఇక్కడే జరుగుతున్న నేపథ్యాన అధికారులు మంగళవారం మార్కెట్‌లో పరి శీలించారు. విదేశాల్లో డిమాండ్ కలిగిన ‘తేజా’ రకం మిర్చి క్వింటాకు గత ఏడాది ఖమ్మంలో గరిష్టంగా రూ.23వేల వరకు ధర పలకగా ఈ ఏడాది పతనమైంది. చైనాలో పంట సాగు పెరిగిందని ఎగుమతిదారులు చెబుతున్న నేపథ్యాన ప్రస్తుతం గరిష్టంగా రూ.14 వేలు, మోడల్ ధర 13,300గా నమోదవుతోంది. ఓ వైపు ధర తగ్గడం, మరోవైపు తెగుళ్లతో దిగుబడి పడిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. రైతులు నష్టపోతున్నందున కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మిర్చి బోర్డు ఏర్పాటు చేసి క్వింటాకు రూ.25 వేల ధరతో కొనుగోలు చేయాలని వామపక్షాల పార్టీల అనుబంధ రైతు సంఘాల నాయకులు మంగళవారం మార్కెట్‌లో ఆందోళన చేపట్టారు. ఈనేపథ్యాన ఇంటెలిజెన్స్ అధికారులు మార్కెట్‌లో మంగళవారం మిర్చి జెండా పాట, ధర నిర్ణయం, అందుకు ఎంచుకునే ప్రమాణాలపై ఆరా తీయడమే కాక రైతులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఆ తర్వాత మార్కెట్ అధికారులతో మాట్లాడి ధర పతనంపై చర్చించినట్లు తెలిసింది.
పత్తి యార్డు భవనంలోకి డీఎంఓ కార్యాలయం
ఖమ్మంవ్యవసాయం: జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి(డీఎంఓ) కార్యాలయాన్ని ఖమ్మం వ్యవసాయ మార్కెట్ పత్తి యార్డులోని ఓ భవనంలోకి మార్చారు. మార్కెట్ ప్రాంగణంలోనే ఏళ్లుగా డీఎంఓ కార్యాలయం కొనసాగుతుండగా ఆ భవనాన్ని మిర్చి యార్డు ఆధునికీకరణ పనుల్లో భాగంగా కూల్చివేశారు. దీంతో కార్యాలయ నిర్వహణకు పత్తి యార్డులో ఖాళీగా ఉన్న క్యాంటిన్ భవనాన్ని కేటాయించారు. ఇందులో మార్కెటింగ్ శాఖ అధికారితో ఇంజనీరింగ్ విభాగం కూడా కొనసాగించాల్సి ఉన్నందున మరో గదిని సైతం అప్పగించాలని అధికారులు భావిస్తున్నట్లు తెలిసింది. కాగా, మిర్చి యార్డు నూతన నిర్మాణంతో పాటే జిల్లా మార్కెటింగ్ శాఖ కార్యాలయ భవన నిర్మాణం ఉంటుందని అధికారులు తెలిపారు.
ఎస్సారెస్సీ కాల్వ తవ్వకానికి తొలగిన అడ్డంకులు
కూసుమంచి: శ్రీరాంసాగర్ ప్రాజెక్టు 54వ ప్యాకేజీలో కాల్వ తవ్వకానికి అవసరమైన 13ఎకరాల భూసేకరణలో ఇబ్బందులతో పనులు నిలిచిపోయిన విషయం విదితమే. కాల్వ తవ్వకపోవడంతో కూసుమంచి, తిరుమలాయపాలెం, ఖమ్మంరూరల్ మండలాల్లోని వేలాది ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందడం లేదు. ఈ విషయాన్ని ఇరిగేషన్ అధికారులు మంత్రి పొంగులేటి శ్రీని వాసరెడ్డి దృష్టికి తీసుకెళ్లగా ఆయన నిర్వాసిత రైతులను ఒప్పించారు. ఈ మేరకు రూ.2.64 కోట్ల పరిహారం రైతుల ఖాతాల్లో జమ కావడంతో కాలుల్వవ తవ్వకానికి అడ్డంకులు తొలగిపోయినట్లయింది. ఈ పనులు పూర్తయితే మూడు మండలాల్లో అదనంగా 11వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment