బియ్యం ఇస్తారా, ఇవ్వరా?
● ఇంకా పలువురికి అందని రేషన్ బియ్యం ● ‘పోర్టబులిటీ’తో డీలర్ల వద్ద కొరత ● నేటితో ముగియనున్న పంపిణీ గడువు
ఖమ్మం సహకారనగర్/ఖమ్మం అర్బన్: రేషన్‌కార్డు ఏ ప్రాంతంలో ఉన్నప్పటికీ నివసించే చోట బియ్యం తీసుకునేలా కొన్నాళ్ల నుంచి ’వన్ నేషన్.. వన్ రేషన్’ పేరిట పోర్టబులిటీ విధానం అమలవుతోంది. లబ్ధిదారులు నష్టపోవద్దని ఈ విధానాన్ని ప్రవేశపెట్టగా జిల్లా కేంద్రంలోని రేషన్ షాపుల్లో త్వరగా బియ్యం నిల్వలు కరిగిపోతున్నాయి. దీంతో స్థానిక లబ్ధిదారులకు బియ్యం అందక షాపుల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వస్తోంది. ఇలా ప్రతీనెలా జరుగుతున్నా డిమాండ్ ఉన్న షాపులకు అదనంగా బియ్యం కేటాయించాల్సిన అధికారుల నిర్లక్ష్యంతో సమస్య తీవ్రరూపం దాలుస్తోంది.
జిల్లా కేంద్రంలోనే సమస్య
జిల్లాలో 748 రేషన్ షాపులు ఉండగా, వీటి పరిధిలో 4,11,566 రేషన్‌కార్డులు ఉన్నాయి. ఇక 11,29,030మంది లబ్ధిదారులు ఉండగా ప్రతినెల సుమారు 6వేల మెట్రిక్ బియ్యం అవసరమవుతుంది. అయితే, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో వివిధ ప్రాంతాల వారు నివసిస్తుండగా పోర్టబులిటీ విధానంలో నెల తొలినాళ్లలోనే బియ్యం తీసుకుంటున్నారు. దీంతో స్థానికులు వచ్చేసరికి షాపుల్లో బియ్యం నిల్వలు నిండుకుంటున్నాయి. ఖమ్మం నగరంలో 94 రేషన్ దుకాణాలకు గాను సుమారు 80షాపుల్లో పోర్టబులిటీ ద్వారా బియ్యం తీసుకెళ్తున్నారని అంచనా. తద్వారా ఆయా షాపుల పరిధి లబ్ధిదారులకు నెలనెలా కేటాయించే బియ్యానికి తోడు డీలర్లకు సుమారు 50క్వింటాళ్ల బియ్యం అదనంగా అవసరమవుతున్నట్లు తెలుస్తోంది.
అప్రూవ్ అయినా...
అదనంగా బియ్యం అవసరమైన డీలర్లు 7, 8వ తేదీకల్లా జిల్లా పౌరసరఫరాల అధికారి(డీఎస్‌ఓ)కి వినతి ఇవ్వగానే అధికారి అప్రూవ్ చేస్తే గోదాం నుంచి విడుదల చేస్తారు. కానీ గత రెండు నెలలుగా డీలర్లకు సకాలంలో బియ్యం అందక ఇక్కట్లు ఎదురవుతున్నాయి. ఈనెల 19వ తేదీ నాటికి కూడా అధికారి అప్రూవ్ చేసినా డీలర్లకు బియ్యం అందకపోవడం గమనార్హం. జిల్లాలోని గోదాంల్లో నిల్వలు లేక ఈ పరిస్థితి నెలకొందని సమాచారం. ఈనెలారంభం నుంచే బియ్యం అరకొరగా సరఫరా అవుతుండడంతో 20వ తేదీ వరకు తీసుకోవచ్చని అధికారులు వెల్లడించారు. కానీ జిల్లాలోని షాపులకు ఇంకా 350 మెట్రిక్ టన్నుల బియ్యం సరఫరా కావాల్సి ఉండడం, 20వ తేదీ గురువారంతో సరఫరా గడువు ముగియనుండడంతో సందిగ్ధత నెలకొంది. అయితే, గతంలోనూ ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు గడువు మరిన్ని రోజులు పెంచినందున ఈసారీ పొడిగించే అవకాశముందని తెలుస్తోంది.
రెండు, మూడు రోజుల్లో సరఫరా చేస్తాం
జిల్లాకు సుమారు 350మెట్రిక్ టన్నుల మేర అదనంగా బియ్యం అవసరముంది. నల్లగొండ జిల్లా నుంచి బియ్యం తెప్పించేందుకు అక్కడి అధికారులతో మాట్లాడాం. రెండు, మూడు రోజుల్లో రేషన్ దుకాణాలకు అందించి లబ్ధిదారులకు సరఫరా చేసేలా చర్యలు తీసుకుంటాం.
– జి.శ్రీలత, జిల్లా మేనేజర్, పౌరసరఫరాల సంస్థ
బియ్యం ఇస్తారా, ఇవ్వరా?
Comments
Please login to add a commentAdd a comment