చెల్లని చెక్కు కేసులో మూడు నెలల జైలుశిక్ష
ఖమ్మం లీగల్: చెల్లని చెక్కు జారీ చేసిన కేసులో ఖమ్మం బీ.కే.బజార్‌కు చెందిన బిజ్జాల భాస్కర్‌కు మూడు నెలలు జైలు శిక్ష విధిస్తూ ఖమ్మం ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు న్యాయాధికారి కాసరగడ్డ దీప బుధవారం తీర్పు చెప్పారు. బీ.కే.బజార్‌కు చెందిన ఉల్లి శ్రీనివాసరావు వద్ద భాస్కర్ 2015 సెప్టెంబర్ 30న రూ.లక్ష అప్పుగా తీసుకున్నాడు. ఆతర్వాత అప్పు చెల్లించే క్రమంలో 2018 ఫిబ్రవరి 28న రూ.లక్షకు చెక్కు జారీ చేయగా ఆ చెక్కును ఖాతాలో జమ చేస్తే సరిపడా నగదు లేక గురైంది. దీంతో శ్రీనివాసరావు తన న్యాయవాది ద్వారా నోటీస్ జారీచేసి కోర్టులో ప్రైవేట్ కేసు దాఖలు చేశారు. కేసును విచారించాక భాస్కర్‌పై నేరం రుజువు కావడంతో మూడు నెలల జైలు శిక్షతో పాటు ఫిర్యాదికి రూ.1.20 లక్షలు చెల్లించాలని న్యాయాధికారి తీర్పు చెప్పారు.
వాహనం ఢీకొని వ్యక్తి మృతి
సత్తుపల్లిరూరల్: రోడ్డుపక్కగా నడిచి వెళ్తున్న వ్యక్తిని ద్విచక్ర వాహనం ఢీకొట్టడంతో తీవ్రగాయాల పాలై మృతి చెందాడు. మండలంలోని కాకర్లపల్లికి చెందిన నాగళ్ల రామకృష్ణ(38) బుధవారం గ్రామశివారులో నడిచి వెళ్తుండగా వాహనం ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ఆయనను ఖమ్మం ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందాడు. కాగా, మోపెడ్ నడుపుతున్న ఇండ్ల వెంకటేశ్వరరావు సైతం గాయపడగా సత్తుపల్లి ప్రభుత్వాస్పత్రిలో చేర్పించారు.
కుక్కల దాడిలో గేదె ...
నేలకొండపల్లి: ఓ గేదెను వేటాడిన కుక్కలు తీవ్రంగా గాయపర్చడంతో మృతి చెందింది. నేలకొండపల్లికి చెందిన రైతు డి.ఉపేందర్ బుధవారం పాడి గేదెను మేతకు వదిలాడు. ఒక్కసారిగా అక్కడకు వచ్చిన 20కి పైగా కుక్కలు దాడి చేయడంతో గేదె పరుగులు తీసింది. అయినా కుక్కల గుంపు వెంటాడి దాడి చేయగా తీవ్రగాయాలతో మృతి చెందింది. కళ్ల ముందే రూ.70వేల విలువైన గేదె మృతి చెందడంతో రైతు కన్నీరు మున్నీరయ్యాడు. కాగా, ఉపేందర్‌కు చెందిన నాలుగు నెలల దూడపై వారం క్రితం కుక్కలు దాడి చేసి చంపేశాయి. ఇకనైనా అధికారులు స్పందించి మండల కేంద్రంలో కుక్కల బెదడను నివారించాలని స్థానికులు కోరుతున్నారు.
ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య
సత్తుపల్లిరూరల్: అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వ్యక్తి ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. సత్తుపల్లి మండలం గంగారానికి చెందిన ఆటోడ్రైవర్ ఎస్.కే.నజీరుద్దీన్(43) కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. రెండు నెలల క్రితం ఒక కిడ్నీ తొలగించగా మరో కిడ్నీకి కూడా సమస్య ఉందని చెప్పడంతో మనస్తాపానికి గురైన ఆయన బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయాన ఆత్మహత్య చేసుకున్నాడు. నజీరుద్దీన్‌కు భార్య జీనద్ ఉన్నారు.
క్షణికావేశ ంలో మరొకరు..
కారేపల్లి: మద్యానికి బానిసైన వ్యక్తి ఇంట్లో గొడవ పడి క్షణికావేశంలో ఆత్మహత్య చేసుకున్నాడు. మండలంలోని పేరుపల్లికి చెందిన పద్దం మాధవరావు(53) రైల్వే కాంట్రాక్టు కూలీ పనులు చేస్తుంటాడు. ఇటీవల మద్యానికి బానిసైన ఆయన బుధవారం కూడా మద్యం తాగి రావడంతో భార్య నాగమణితో గొడవ జరిగింది. దీంతో భార్య ఇంటి నుంచి బయటికి వెళ్లిపోగా ఆయన చీరతో ఉరి వేసుకున్నాడు. కాసేపటికి వచ్చిన నాగమణి కేకలు వేయగా చుట్టుపక్కల వారు వచ్చి చూసేసరికి మాధవరావు మృతి చెందాడు. ఆయనకు భార్యతో పాటు ఇద్దరు కుమారులు ఉన్నారు.
22న బియ్యం వేలం
ఖమ్మం సహకారనగర్: వివిధ కేసుల్లో జప్తు చేసిన 771.969మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఖమ్మం అర్బన్, ఖమ్మం రూరల్, ఏన్కూరు, వైరా, మధిర, నేలకొండపల్లి, సత్తుపల్లి, కల్లూరు గోడౌన్లలో నిల్వ చేయగా, వేలం ద్వారా విక్రయించనున్నట్లు జిల్లా పౌరసరఫరాల శాఖాధికారి చందన్‌కుమార్ తెలిపారు. ఈనెల 22న ఉదయం 11గంటలకు కలెక్టరేట్‌లోని తమ కార్యాలయం వద్ద వేలం ఉంటుందని పేర్కొన్నారు. జీఎస్‌టీ లైసెన్స్‌దారులు, డిస్టిలరీలు, బేవరేజెస్ కంపెనీల బాధ్యులు మాత్రమే అర్హులని, ఆసక్తి ఉన్న వారు వారు రూ.50వేల రూపాయల డీడీతో హాజరుకావాలని సూచించారు.
చెల్లని చెక్కు కేసులో మూడు నెలల జైలుశిక్ష
Comments
Please login to add a commentAdd a comment